Telugu Flash News

Evergreen : ఉద్యోగులకు బంపరాఫర్‌.. ఆ కంపెనీలో ఏకంగా ఐదేళ్ల బోనస్‌!

Evergreen

Evergreen shipping company is giving 5 years of salary as bonus : ఏ సంస్థలోనైనా ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వడం సాధారణమే. చాలా కంపెనీల్లో ఏడాదికి ఒకసారి ఓ నెల జీతం బోనస్‌గా ఇస్తుంటారు. దీంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తుంటారు. కానీ అత్యంత అరుదుగా కొన్ని సంస్థల యజమానులు ఉద్యోగులపై ప్రేమ చూపిస్తుంటారు.

ఇలా ఓ కంపెనీ తమ వద్ద పని చేసే ఉద్యోగులకు ఏకంగా ఐదేల్ల వేతనం బోనస్‌గా ఇస్తుండడంతో ఉద్యోగుల ఆనందానికి పట్టపగ్గాల్లేకుండా పోయాయి. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. తైవాన్‌కు చెందిన ఎవర్‌గ్రీన్‌ అనే షిప్పింగ్‌ సంస్థ (Evergreen shipping company) తమ ఉద్యోగులకు ఇయర్‌ ఎండ్‌ బోనస్‌గా ఇప్పటికే 50 నెలల జీతాన్ని ప్రకటించింది.

ఇక తాజాగా ఇదే కంపెనీ తమ ఉద్యోగులకు 10 నుంచి 11 నెలల వేతనాన్ని మిడ్‌ ఇయర్‌ బోనస్‌ కింద చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. అంటే మొత్తంగా ఐదేళ్ల జీతాన్ని ఆ సంస్థ ఉద్యోగులు బోనస్ రూపంలో అందుకుంటున్నారు.

మిడ్‌ ఇయర్‌ బోనస్‌ కింద సుమారు 94 మిలియన్‌ డాలర్ల మేర చెల్లించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు అక్కడి స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కోవిడ్‌ నేపథ్యంలో సూయిజ్‌ కాలువలో ఓ భారీ నౌక చిక్కుకుపోయిన ఉదంతం తెలిసిందే. దీంతో కొన్ని రోజులపాటు ఆ మార్గంలో రవాణాకు తీవ్ర ఆటంకాలు కలిగాయి.

ఆ భారీ నౌక ఎవర్‌గ్రీన్‌ కంపెనీకి చెందినదే కావడం విశేషం. ఈ షిప్పింగ్‌ సంస్థ కోవిడ్‌ కాలంలో భారీ నష్టాలను మూటగట్టుకుంది. అయితే, తర్వాత పరిస్థితులు చక్కదిద్దారు. ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో రెండేళ్లుగా 39.92 శాతం మేర లాభాలను ఎవర్‌గ్రీన్‌ సంస్థ ఆర్జిస్తోంది.

ఇదంతా ఉద్యోగుల కృషి, పట్టుదల కారణంగానే జరిగిందని, అందుకే భారీ లాభాలు మూటగట్టుకున్నామని భావించిన ఆ సంస్థ యాజమాన్యం.. ఉద్యోగుల పనితీరు ఆధారంగా బోనస్‌ ఇచ్చింది. ఈ ఏడాది మధ్యలో ఉద్యోగుల ఖాతాల్లో బోనస్‌ మొత్తాన్ని జమ చేస్తామని సంస్థ పేర్కొన్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

తైవాన్‌లో ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ 31 ముగుస్తుంది. 2022 డిసెంబర్‌ 31 నాటికి ఎవర్‌గ్రీన్‌ రికార్డు స్థాయిలో లాభాలను పొందింది. ఎన్‌టీ334 బిలియన్‌ డాలర్లతో గతంలో ఎన్నడూ లేనంతగా లాభాల బాట పట్టింది. దీంతో ఉద్యోగుల కృషికి మెచ్చిన యాజమాన్యం.. సుమారు 3,100 మందికి బోనస్ ప్రకటించింది.

ఎవర్‌గ్రీన్‌ సంస్థలో పని చేసే ఉద్యోగుల వార్షిక వేతనం సుమారు 29,545 డాలర్ల నుంచి 1,14,823 డాలర్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఐదేళ్ల బోనస్‌ ప్రకటించడంపై సోషల్‌ మీడియాలో ఈ వార్త హల్‌ చల్‌ చేస్తోంది. ఎవర్‌గ్రీన్‌ ఉద్యోగులు చాలా లక్కీ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

also read :

వేసవి లో మీ ఇల్లు చల్లగా ఉండాలా? మీకోసమే ఈ టిప్స్‌ ..

Exit mobile version