అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (joe biden) పై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఫైర్ అయ్యారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాలు అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా ఏకమవుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ అణు దాడుల పేరిట బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ట్రంప్.. బైడెన్ అసమర్థత వల్లే ఇదంతా జరుగుతోందని మండిపడ్డారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధం అణు బాంబుల రూపంలో వస్తుందని హెచ్చరించారు. తాను ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో అణ్వస్త్రాలపై మాట్లాడేందుకే చాలా దేశాలు వణికిపోయేవని ట్రంప్ చెప్పారు. అమెరికా ద్రవ్యోల్బణం నియంత్రణలో లేదని, కరెన్సీ విలువ దిగజారిపోతోందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు.
చైనాతో రష్యా, ఇరాన్‌తో సౌదీ అరేబియా జతకట్టాయన్నారు. చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా ఏకమై విధ్వంసకర ఆలోచనలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఇవన్నీ కలలో కూడా జరిగేవి కావన్నారు. అసలు రష్యా, ఉక్రెయిన్ యుద్ధమే వచ్చి ఉండేది కాదన్నారు. అధికారంలో ఉన్న డెమోక్రాట్లు యూఎస్ ప్రతిష్టను దిగజారుస్తున్నారని, విఫల దేశంగా మార్చేందుకు కుట్ర జరుగుతోందని ట్రంప్ ఆరోపించారు.
ఇక శృంగార తారతో వివాహేతర బంధం బయటపడకుండా ఉండేందుకు రహస్య ఆర్థిక ఒప్పందం చేసుకున్నాడన్న కేసులో ట్రంప్‌ను మంగళవారం పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. న్యూయార్క్‌లోని కోర్టులో ట్రంప్‌ను పోలీసులు హాజరుపరిచారు. జడ్జి ఆయనపై నమోదైన 34 అభియోగాలను చదివి వినిపించారు.
అయితే, వీటిపై ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన న్యూయార్క్ నుంచి ఫ్లోరిడాకు వెళ్లారు. మారెలాగో రిసార్ట్‌లో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్.. దేశాన్ని నాశనం చేయాలనుకొనే వారిని ధైర్యంగా అడ్డుకున్నానన్నారు. అమెరికా నరకంలోని వెళ్తోందని, తాను వైట్ హౌస్ నుంచి బయటకు రావడం దేశ చరిత్రలోనే ఇబ్బందికర పరిణామమన్నారు.
మళ్లీ అమెరికాను గొప్ప దేశంగా మనందరం తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. తనమీద ఏ కేసూ లేకపోయినా కోర్టును మన్హటన్ అటార్నీ ప్రభావితం చేశారని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. గ్రాండ్ జ్యూరీ పత్రాలను కావాలనే అటార్నీ లీక్ చేశారని మండిపడ్డారు. తన కేసులో నకిలీ దర్యాప్తు కొనసాగుతోందని ట్రంప్ తీవ్రంగా ఆక్షేపించారు.
దేశాన్ని రక్షించే క్రమంలో తనను దెబ్బతీయలేరని ట్రంప్ స్పష్టం చేశారు. మరోవైపు నేరాభియోగాలు నమోదైన కేసులో డిసెంబర్ 4న ట్రంప్ వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని తెలుస్తోంది.