భారతీయ సంస్కృతికి మూలం అయిన పురాణాలలో ఎందరో భారతీయ ఋషులు, మహర్షులు మనకు కానవస్తారు. వారిని గూర్చి పూర్తిగా తెలుసుకోవాలి అంటే పురాణాలలోకి వెళ్ళవలసినదే అయితే బాలలకు కనీస ఋషిపరిజ్ఞానం కలుగచేయడం కోసం యిక్కడ మేము కొంత విషయాన్ని అందిస్తున్నాము.
అగస్త్యుడు-వశిష్ఠుడు :
వీరిరువురూ సోదరులు. వీరికి “కుంభ సంభవులు”, “కలశజులు”, “మిత్రావరుణ పుత్రులు”, ఔర్వశీయులు అని పేర్లు. నర నారాయణులలో ఒకరయిన నారాయణ మహర్షి యొక్క తొడ నుండి ఊర్వశి ఉద్భవించింది. ఊర్వశిని చూచి సూర్యుడు, వరుణ దేవులు మోహించారు. అలా మోహించిన ఆ సూర్యుడు వరుణుడు తమ మోహాన్ని ఒక కలశంలో పెట్టి వెళ్ళిపోయారు. అందులోనుండే కొంత కాలమునకు అగస్త్యుడు, వశిష్ఠుడు ఉద్భవించారు. కలశమునుండి పుట్టారు కాబట్టి “కలశజులు” అని సూర్య, వరుణుల మోహం వలన పుట్టారు కాబట్టి మిత్రావరుణులు అని, ఊర్వశి కారకురాలు కాబట్టి ఔర్వశేయులు అని పేరు వచ్చింది.
అగస్త్యుడు :
అగస్త్యునికి ఉపనయనాది సంస్కారములు దేవతలే చేశారు. విదర్భరాజ కుమార్తె లోపాముద్రను వివాహం చేసు కున్నాడు. అంతేకాక ‘కవేరకన్య’ను కూడా వివాహం చేసుకున్నాడు. రామరావణ యుద్ధ సమయంలో రావణునిపై రామ విజయం కోసం రామునికి ఆదిత్య హృదయం ఉపదేశించాడు.
వశిష్ఠుడు :
వశిష్ఠుని భార్య అరుంధతి. వీరిరువురూ వారి యొక్క తపస్సు పాతివ్రత్యముల చేత లోకంలో గొప్పఖ్యాతి గడించిన దంపతులు. ఈయన బ్రహ్మచే సృష్టికోసం ఉద్భవించిన నవ బ్రహ్మలలో ఒకడు. ఇక్ష్వాకు వంశానికి కులగురువు. వశిష్ఠుని వంశంలోనివారు పరాశరుడు, శుక మహర్షి, వ్యాసుడు మొదలగువారు. వశిష్ఠుడు సాక్షాత్ అగ్ని స్వరూపమే.
విశ్వామిత్రుడు :
జన్మతః క్షత్రియుడు. వశిష్ఠునితో కలహించి ద్వేషముతో తపస్సు చేసి రాజర్షి అయి తర్వాత మహర్షి అయి చివరకు బ్రహ్మర్షి అయిన గొప్ప వ్యక్తి విశ్వామిత్రుడు. కుశనాభుని కుమారుడు “గాధి” ఆయన కుమారుడు విశ్వామిత్రుడు. ఈయనకు బ్రహ్మర్షి అయ్యే నిమిత్తం తపస్సు చేస్తూవుండగా మేనకతో కలయిక జరిగి శకుంతల అనే కుమార్తె కలిగింది. అలాగే త్రిశంకు స్వర్గం నిర్మాణం చేశాడు. రామ లక్ష్మణులను తన వెంట అరణ్యములకు తీసుకొనిపోయి సర్వ అస్త్రశస్త్ర సంపదను బోధించాడు.
అత్రి మహర్షి :
ఈయన బ్రహ్మ మానస పుత్రుడు. ఈయన భార్య అనసూయ. అత్రి మహర్షి తపశ్శక్తితోను అనసూయ పాతివ్రత్యముతోను లోకములో కీర్తిని గడించాడు. వీరికి బ్రహ్మ అంశతో చంద్రుడు రుద్ర అంశతో దూర్వాసుడు, విష్ణు అంశతో దత్తాత్రేయుడు జన్మించారు. ఒకసారి రామ లక్ష్మణులు అత్రిమహర్షి ఆశ్రమానికి వచ్చారు. సీతాదేవి అనసూయ మాత దగ్గర పతివ్రతా ధర్మాలు నేర్చుకున్నది. పృధు చక్రవర్తి అశ్వమేధయాగ సమయంలో రాహువు చేత దెబ్బతిన్న సూర్యుడు, చంద్రుడు యొక్క రక్షణను అత్రి మహర్షి యొక్క కంటి చూపుతోనే జరిగిపోయింది.
భృగు మహర్షి :
బ్రహ్మ యొక్క హృదయము నుండి పుట్టిన నవ బ్రహ్మలలో భృగు మహర్షి ఒకడు. ఈయన వంశములో చ్యవన మహర్షి, జమదగ్ని, శుక్రాచార్యుడు, దధీచి, పరశురాముడు వంటి గొప్పవారు ఎందరో జన్మించారు. శ్రీ మహావిష్ణువును మానవుడిగా జన్మించేలా శపించిన వాడు భృగు మహర్షియే. కారణం శ్రీ మహావిష్ణువు భృగువు యొక్క భార్యను సంహరించిన సందర్భంలో భృగువు విష్ణువును శపించాడు. అలా అవతారాలు ఎత్తిన శ్రీమహావిష్ణువు గాధలే నేడు పురాణాలయినాయి. “మోక్షప్రదాత” ఎవరు అని నిర్ణయం చేసిన వారు కూడా భృగు మహర్షియే. అలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పరీక్షించి శ్రీ మహావిష్ణువే మోక్ష ప్రదాత అని తేల్చిన ఘనత భృగు మహర్షిది. ఈయనకు ఖ్యాతి, ఉశన, పులోమ అనే భార్యలు వున్నారు.
భరద్వాజ మహర్షి :
భరద్వాజుడు పూర్వ కాలంలో విమానం తయారీ వంటి ఎన్నో సైన్స్ విషయాలను సృష్టించిన గొప్ప మహర్షి సైంటిస్ట్). ఈయన పరమ శాంతమూర్తి. “బృహస్పతి” వలన పుట్టిన వాడు భరద్వాజుడు. జననం అయిన వెంటనే మరుద్గణాలు తీసుకువెళ్ళి భరద్వాజుని పెంచాయి. భరద్వాజుడికి “ఘృతాచి” అనే అప్సరస మీద మోహం వలన ఉద్భవించినవాడు ద్రోణాచార్యులు. భృగుమహర్షి ద్వారా భరద్వాజుడు జ్యోతిష్యశాస్త్రం, వర్ణాశ్రమ ధర్మాలు తెలుసుకున్నాడు. రావణ వధ అనంతరం శ్రీరాముడు భరద్వాజుని ఆశ్రమానికి వచ్చాడు. భరద్వాజుడికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనం యిచ్చినట్లుగా హరివంశంలో చెప్పబడినది.
కశ్యప ప్రజాపతి :
కశ్యప మహర్షి కశ్యప ప్రజాపతి. మరీచి మహర్షికి, “కళ”కు జన్మించిన వాడే కశ్యప మహర్షి. బ్రహ్మ యొక్క సలహా మేర దక్షప్రజాపతి తన కుమార్తెలు అయిన అదితి, దితి, దనువు, కాల, అనాయువు, సింహిక, ముని, కపిల, క్రోధ, ప్రధ, క్రూర, వినత, కద్రువలను యిచ్చి వివాహం చేశాడు. అదితి గర్భంలో ఆదిత్యులు దితి గర్భంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు పుట్టారు. పశు, వృక్ష, కీటక, పక్షి జాతులను కశ్యపుడే సృష్టి కావించారు. పరశురాముడు భూమి మొత్తాన్ని జయించి కశ్యపునికి దానం యిచ్చాడు కావున భూమిని “కాశ్యపి” అని పిలుస్తారు. కశ్యపుడు, అదితికి వేరు వేరు యుగాలలో వామనుడు, శ్రీకృష్ణుడు జన్మించారు. అంటే కశ్యపుడే వసుదేవుడుగా జన్మించారని అర్థం. కశ్యపుడు “దితికి” మరుద్గణం పుట్టారు. దేవదానవులు చాలా మంది కశ్యప సంతానమే.
గౌతమ మహర్షి :
బ్రహ్మ మానస పుత్రులలో ఈయన ఒకడు. సప్తర్షులలో సుప్రసిద్ధుడు. అహల్యాదేవి అతిలోక సౌందర్యవతి. అమెయే గౌతముని భార్య. విశేషం ఏమిటి అంటే అహల్యను చిన్ననాటి నుండి గౌతముడే పెంచాడు. అది బ్రహ్మ ఆజ్ఞ. గౌతముడు ఒకసారి తపస్సుచేసి “తాను విత్తనం చల్లితే ఒక ఝాములోపు పంట పండాలి” అనే వరం పొందాడు. ఒకసారి కొందరు బ్రహ్మణుల మాయ వలన గౌతమునికి గోహత్యాదోషం వచ్చింది. గోహత్యా దోషం పోగొట్టుకోవడం కోసం గోదావరి నదిలో ఒక శాఖ గౌతమిని భూమి మీదకు తీసుకు వచ్చాడు గౌతముడు.
వీరికి శతానందుడు అనే పుత్రుడు కలిగాడు. శతానందుని కుమారుడు శరద్బంధుడు వీరి వంశంలోనే కృపాచార్యుడు, కృపి పుట్టారు. ఆంజనేయుని తల్లి “అంజనాదేవి” వీరి సంతానమే. గౌతముని వేషంలో ఇంద్రుడు ఒకసారి అహల్యను మోసం చేయ యత్నింపగా అహల్యను “రాయి”వి కమ్మని శపించాడు. రామావతారంలో రాముని పాద స్పర్శతో ఆమెకు శాపవిముక్తిని ప్రసాదించారు. రామాయణంలో యిది విశేష ఘట్టం. గౌతముడు వ్రాసిన ధర్మ సూత్రాలు అందరూ ఆచరింపదగినవి.
జమదగ్ని మహర్షి :
ఋచేక మహర్షి, సత్యవతుల పుత్రుడు జమదగ్ని మహర్షి. ఋచేకుని తపః ప్రభావంచేత రెండు యజ్ఞ ప్రసాదములు సృష్టించబడి ఆ ప్రసాదముల ప్రభావం చేత సత్యవతిని జమదగ్ని, సత్యవతి తల్లికి విశ్వామిత్రుడు పుట్టారు. జమదగ్ని భార్య రేణుక. జమదగ్ని రేణుకల పుత్రుడు పరశురాముడు. జమదగ్నిని కార్తవీర్యార్జునుడు తపస్సులోవుండగా సంహరించాడు.
కానీ భృగుమహర్షి తపః ప్రభావం చేత ఆయన పునర్జీవితుడయ్యాడు. పరశురాముడు ఈ కారణంచేత కార్తవీర్యార్జునితో పోరి అతనిని సంహరించాడు. ఆ కక్షతోనే కార్తవీర్యార్జుని పుత్రులు ‘జమదగ్నిని హోమగృహంలోనే సంహరించారు. ఆ సమయంలో “పరశురామా నీ తండ్రిని రక్షించు” అని 21 సార్లు రేణుకాదేవి రోధించినది. అందుకోసమే పరశురాముడు 21 సార్లు భూమి మొత్తం తిరిగి క్షత్రియ సంహారం చేశారు. జమదగ్ని సప్తర్షులలో ఒకడు.
కర్దమ ప్రజాపతి :
కర్దముని చరిత శ్రీమద్భాగవతంలో చెప్పబడి ఉన్న ఒకసారి భూమి నిర్మానుష్యం అయినప్పుడు బ్రహ్మయొక్క ఆజ్ఞమేర కర్దముడు సంతానోత్పత్తి చేశాడు. స్వయంభువ మనువు యొక్క కుమార్తె “దేవహుతి”ని యిచ్చి ఇతనికి వివాహం చేశారు. వీరికి తొమ్మండుగురు పుత్రికలు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో కపిల మహర్షిగాను కలిగారు. దేవహుతి కర్దమునికి చేసిన సేవకు సంతసించి ఒక విమానం సృష్టించి అందులో వుండి ఆకాశమార్గాన తిరుగుతూ ఎంతోకాలం సుఖజీవనం చేశారు. మరీచి, అత్రి, అంగిర, పులస్త్య, పులహ, భృగు, వశిష్ఠ, అధృవ వీరు ఈయనకు అల్లుళ్ళు అంటే కర్దముని కుటుంబం ఎంతో గొప్పది.
కపిల మహర్షి :
కర్దమ ప్రజాపతి, దేవహుతులకు శ్రీమహా విష్ణువు యొక్క అంశ కపిల మహర్షిగా పుత్రుడయి జన్మించారు. కపిల మహర్షి కర్దమునికి సాంఖ్యయోగం బోధించారు. అంతేకాదు కపిలునిచే చెప్పబడిన సాంఖ్యం ద్వారానే కర్దముడు దేవహూతి ముక్తిని పొందాడు. ఒకానొక సందర్భంలో విధానం ప్రకారం జీవనం చేయుచూ వేదము చదివిన వేద పండితులకు నేను నమస్కరిస్తాను అని “సూర్యరశ్మి” అనే మహర్షికి కపిలుడు తెలియచేశారు. కపిల మహర్షి ద్వారా రావణాసురుడి కూడా జ్ఞానబోధ అయినది. మత్స్యపురాణం, శ్రీమద్భాగవతం, పరాహపురాణాలలో కపిల మహర్షి చరిత్రలు వున్నాయి.
అష్టావక్రమహర్షి :
బ్రహ్మ మానస పుత్రులలో ఒకరయిన ప్రచేతసుని కుమారుడు అసితుడు. అసితునికి రుద్రుడు చేసిన రాధామంత్ర ఉపదేశ ప్రభావంగా దేవలుడు అనే పుత్రుడు కలిగాడు. దేవలుని రంభ మోహించి విఫలురాలయి అతనిని “అష్టావక్రుడివిగా జన్మించమని” శపించినది. ఏకపాదుడు అనే బ్రాహ్మణునికి దేవలుడు అష్టావక్రుడుగా జన్మించాడు. అష్టావక్రుడు తపస్సు చేసుకొనుచుండగా వారికి సేవచేయుటకు ఇంద్రుడు రంభాదులను పంపాడు. వారు అష్టావక్రునికి సేవచేస్తూ అడగగా ఆయన “తధాస్తు” అన్నారు.
అష్టావక్రుని దేహం అన్ని “మాకు శ్రీ మహావిష్ణువుతో వివాహం అయ్యేలాగ వరం యివ్వమని” విధాలా అనుకూలంగా అయిన తరువాత ఆయన వదాన్యుడు అనే బ్రాహ్మణుని యొక్క కుమార్తె “సుప్రభ”ను వివాహం చేసుకున్నారు. ద్వాపరయుగం రాగానే సుప్రభ ఉత్తమగతులు పొందినది. అష్టావక్రుడు ద్వారకకు వెళ్ళి శ్రీ కృష్ణుని పాదాల చెంత ప్రాణములు వదిలినట్లు బ్రహ్మ వైవర్త పురాణంలో వున్నది.
అంగీరస మహర్షి :
బ్రహ్మ యొక్క బుద్ధిలో నుండి పుట్టిన నింపగలిగిన తేజస్సు కలిగినవాడు. అంగిరస మహర్షి ఎన్నో వాడే అంగిర మహర్షి. అంగిరసుడు మూడు లోకములు ఒకేసారి వేద మంత్రాలకు ద్రష్ట. ఆయన పుత్రుడు “అయాస్యుడు” కూడా ఎన్నో వేదమంత్రాలకు ద్రష్ట. ఒకసారి అగ్నికి కోపం వచ్చి అంతర్ధానం అయిపోగా, అప్పుడు అగ్నిగా అంగిరసుడు అందరి యిండ్లలోను ఆవిర్భవించాడు. తర్వాత అగ్నిదేవుడే అంగిరసుని గొప్పదనానికి సంతుష్టుడై ప్రత్యక్షం కాగా అప్పటి నుండి అగ్ని దేవుడు ప్రధమాగ్నిగాను అంగిరస మహర్షి రెండవ అగ్నిగాను వెలుగొందుతున్నారు.” అంగారాన్ని రూహ్య అని వైదిక కర్మ కాండలో వాడే అగ్ని అంగరస మహర్షియే.
పులస్త్య మహర్షి :
బ్రహ్మ సృష్టిని పెంచదలచి తన కర్ణముల నుండి పులస్త్యుడని పులహడిని సృష్టించారు. కశ్యపుని పుత్రిక హవిరుక్కును పులస్త్యుడిని యిచ్చి వివాహం చేశారు. పురాణ కథల ప్రకారం పులస్త్యునికి ప్రీతి, సంధ్య, ప్రతీచి అనే వేరే భార్యలు కూడా వున్నారు. పులస్త్యునికి విశ్రావసువు అనే పుత్రుడు కలిగారు. విశ్రవసుని కుమారుడే కుబేరుడు. విశ్రవసుకు దేవవర్ణి వలన కుబేరుడు కలిగాడు.
ఆయన మరొక భార్య కైకసి. ఆమె వలన రావణ, కుంభకర్ణ, విభీషణ, శూర్పణఖలు కలిగారు. ఒకప్పుడు కార్తవీర్యార్జునుడు రావణుని బంధించి తన నగరానికి తీసుకొనిపోయారు. అయితే ఆ తర్వాత పులస్త్యుని మీద గౌరవంతో ఆయన రావణుని విడిచి పెట్టాడు. పరాశర మహర్షి రాక్షస గణ నిర్మూలనకు యాగం చేయుచుండగా రాక్షస సంఖ్య తగ్గిపోసాగినది. అప్పుడు పులస్త్యుని మాట మీద ఆ యాగం పరాశర మహర్షి విరమించాడు. యిలా అందరి దగ్గర మంచి గౌరవం పొందిన మహర్షి పులస్త్యుడు.
చ్యవన మహర్షి :
భృగు మహర్షి పులోమలకు పుట్టినవాడు. ఈయన గర్భంలో వుండగా పులోమను రాక్షసుడు ఎత్తుకు పోతుండగా గర్భం నుండి జారి చ్యవన మహర్షి క్రిందపడ్డారు. అంతేకాక వెంటనే రాక్షసుడి వంక తీవ్రంగా చూశాడట అంతే వెంటనే రాక్షసుడు భస్మం అయిపోయాడట. అంటే పుట్టగానే ఎంత శక్తివంతుడో గ్రహించాలి. రాక్షసుడు పులోమను ఎత్తుకొని పోవుటకు పరోక్ష సహకారం వున్నదని తెలిసి భృగుమహర్షి అగ్ని దేవుని “సర్వ భక్షకుడవు అగుము” అని శపించాడట అశ్వినీ దేవతలకు యజ్ఞ యాగాలలో హవిర్భాగం చ్యవన మహర్షియే కలుగచేశాడు. చ్యవన మహర్షి భార్య సుకన్య, పుత్రుడు దధీచి పాతాళంలో వున్న ప్రహ్లాదునికి చ్యవనమహర్షి జ్ఞానోపదేశం చేశాడు.
దూర్వాసమహర్షి :
అత్రిమహర్షికి రుద్రాంశతో అనసూయ గర్భమున ఉదయించిన మహర్షి. ఈయన చిన్న వయస్సులోనే స్వేచ్ఛగా ఏ లోకంలోనైనా తిరిగే శక్తిని పొందాడు. ధర్మదేవతను దూర్వాసుడు శపించాడు. ఆ శాపం ప్రకారం ఒక అంశతో యుధిష్టురుడుగాను, మరొక అంశతో విదురుడుగాను, మరొక అంశతో హరిశ్చంద్రుని పరీక్షించిన వీరబాహునిగాను అవతారం ఎత్తవలసి వచ్చినది. ఆయన ఔర్వ మహర్షి కుమార్తె “కందళి”ని వివాహం చేసుకున్నాడు.
ఆమె ఎంతటికీ దూర్వాసునకు అనుకూలంగా మారక పోయినందున ఆమెను ఒకసారి ఉగ్రుడై చూడగా ఆమె భస్మం అయి, ఆమెనుండి ఒక సుందరస్త్రీ పుట్టి ఆమె ఆకాశంలోకి వెళ్ళిపోయింది. అయితే ఆమె పేరు భూమి మీద శాశ్వతంగా వుండాలి అనే ఆలోచనతో కదళీవృక్షమును సృష్టించాడు. అయితే మామగారు ఔర్వుడు తన కుమార్తెను భస్మంచేసిన దూర్వాసుని శపించాడు. ఆ శాపం కారణంగా అంబరీషుని విషయంలో విష్ణువు చేత అవమానింపబడి శాంతం నేర్చుకున్నాడు.
దధీచి మహర్షి :
చ్యవనుని కుమారుడు. ఈతడు చిన్నతనం నుండియే బాగా తపస్సు చేయసాగాడు. అతని తపస్సు పాడు చేయుటకు యింద్రుడు అప్సరసను పంపించాడు. అయితే దధీచికి సరస్వతీనదిలో వుండగా వీర్యం స్కలించి, అందుండి ‘సారస్వతుడు’ అను పుత్రుడు కలిగెను. ఒకసారి దధీచి దేవతల ప్రార్ధన మీద తన శరీరములోని ఎముకలు ఆయుధములుగా మార్చి వారికి ఆయుధములుగా చేసి యిచ్చాడు. దానికి కారణం దేవతల ఆయుధములు అన్నీ దధీచి మహర్షి దగ్గర దాచారు. ఆయన వాటిని ఒకసారి జలముతో అభిమంత్రించి తాగివేశాడు. అంతట దేవతలకు ఆయుధములు లేకపోయాయి.
ఆ తర్వాత వారి ప్రార్ధనమేరకు తన శరీరమును విసర్జించి తన శరీరంలో ఎముకలతో మరల ఆయుధములుగా మార్చాడు. తను దేహత్యాగం చేయునాటికి దధీచి భార్య “సువర్చ” గర్భవతి. వారికి పిప్పలాదుడు జన్మించాడు. పిప్పలాదుడు పుట్టుక నుండి తన ‘తండ్రికి చావు కారకులు దేవతలు కాబట్టి వారిని జయించి తీరాలి అనే కాంక్షతో రుద్రుడికోసం తపస్సు చేశాడు. రుద్రుడు అతనికి ఒక శక్తిని యిచ్చాడు. ఆ శక్తితో ఒక కృత్యను దేవతల మీదకు వదిలాడు పిప్పలాదుడు. అతని శక్తిని తట్టుకోలేక దేవతలు రుద్రుడిని ప్రార్థింపగా రుద్రుడు ప్రత్యక్షమయి పిప్పలాదుని శాంతింపమని, నీ తల్లిదండ్రులను పితృలోకమున ప్రత్యక్షముగా చూడగల్గెదవు అని వరమీయగా పిప్పలాదుడు శాంతించెను. అనరణ్యుని కుమార్తె పద్మను పిప్పలాదుడు వివాహం చేసుకొనెను.
మార్కండేయ మహర్షి :
భృగు వంశమువాడు. మృకండ మహర్షి యొక్క కుమారుడు. ఈయన ఒకసారి హరిహరులు ఇరువురినీ గూర్చి తపస్సుచేసి మార్కండేయుని సంతానముగా పొందెను. మార్కండేయుని తల్లి మనస్విని. మార్కండేయునికి చిన్నతనంలోనే మృత్యువు రాగలదని అతడు అల్పాయుష్కుడని తల్లిదండ్రుల ద్వారా తెలిసికొని, శివుని గూర్చి తపస్సుచేసి మృత్యువును ఎదిరించి చిరంజీవి అయినాడు. మార్కండేయుని భార్య ధూమ్రాపతి. ఆమెయందు వేదశిరుడు అనువాడు జన్మించాడు. మార్కండేయ చరిత భాగవతంలో వున్నది.
కణ్వమహర్షి :
కశ్యప ప్రజాపతి వంశంలోని వాడు కణ్వ మహర్షి. ఈయన బ్రహ్మచారి. కాణ్వశాఖీయులకు మూల పురుషుడు కణ్వ మహర్షి. సామవేదంలో అనేక మంత్రాలకు ఈయన ద్రష్ట, విశ్వామిత్ర మేనకల కుమార్తె శకుంతల కణ్వ మహర్షి దగ్గరే పెరిగింది. శకుంతలా దుశ్యంతులకు భరతుడు జన్మించారు. ఈ గాధతో ఆయన అందరికీ సుపరిచితుడే.
జాబాలి మహర్షి :
జాబాల అనే విప్రకన్యకు దేవతా వర ప్రసాదంగా కన్యాత్వదశ యందు ఈ జాబాలి పుట్టాడని పురాణ కథ. దశరథ మహారాజు ఎంచుకున్న గురువులలో ఈ జాబాలి కూడా ఒకరు. ఈయన పేరు మీదనే “జాబాలము” అనే ఉపనిషత్ వున్నది. విభూది రుద్రాక్షల మహిమలు అందులో తప్ప వేరొకచోట లేవు. హరిద్రుమతుడు అనే గురువు దగ్గర చేరి ఆయన చేతనే ఉపనయనాది సంస్కారములు పూర్తి కావించుకొని గురు ఆదేశంలో గోవులను రక్షిస్తూ కాలం గడపసాగారు. అతని భక్తికి గుర్వాజ్ఞను అమలు చేయు విధమునకు మెచ్చుకొని వాయు, అగ్ని సూర్యులు ఒక పక్షి ఆయనకు బ్రహ్మజ్ఞానం పూర్తిగా నేర్పారు. జాబాలికే “సత్యకామ జాబాలి” అని పేరు. జాబాలి ఆస్తికుడే అయిననూ రామునితో నాస్తిక వాదము చేశాడు.
దత్తాత్రేయ మహర్షి :
అత్రి అనసూయలకు విష్ణ్యంశలో పుట్టిన వాడే దత్తాత్రేయుడు. గొప్ప యోగి. యోగసాధకులు ఆయనను ఆరాధించిన ఎడల త్వరగా యోగసిద్ధి కలుగుతుంది.కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆరాధించియే సమస్త భూమండల పాలనా దక్షతను సహస్ర బాహువులను పొందెను. దత్తాత్రేయుల వారు జంభాది రాక్షసులను సంహరించి దేవతలకు రక్షణ కల్పించెను. మదాలస పుత్రుడు అలర్కునికి దత్తాత్రేయుడు చేసిన బ్రహ్మజ్ఞానము చాలా విశేషమయినది. యోగుల యొక్క విశేషము మరొక యోగికి మాత్రమే తెలియును. అట్లే దత్తుని మహిమ యోగ సాధకులకు యోగులకు తప్ప వేరెవ్వరికీ కూడా గోచరించదు.
ఋష్యశృంగుడు:
విభాండవ మహర్షి పుత్రుడు ఋష్యశృంగుడు. ఇతనికి తపస్సు, వేదాధ్యయనము, వైదిక కర్మకాండ తప్ప వేరొకటి తెలియదు. ఆ విధంగా పెరుగుచుండగా అంగ దేశానికి అతని రాక అత్యావశ్యకం అయినది. అంగ దేశంలో అనావృష్టి పెరిగింది. ఆ దేశ రాజు రోమపాదుడు. ఋష్యశృంగుడు అడుగిడిన ప్రదేశం సుభిక్షమగును. అని తలచి అతనిని రప్పించు నెపమున తన పుత్రిక శాంతను ఋష్యశృంగుని కడకు పంపగా ఆమె తనను ఋష్యశృంగుడు ఆకర్షించునట్లు చేసి అతనిని అంగదేశమునకు తీసుకొని వచ్చెను. శాంత ఋష్య శృంగుల వివాహం అయినది. వారి వలన అంగదేశంలో సువృష్టి ప్రారంభం అయినది. వారు అయోధ్యకు వెళ్ళి అక్కడ దశరధునిచే అశ్వమేధ పుత్రకామేష్టి యాగములు చేయించిరి. ఋష్య శృంగుని ఆశీర్వచనమున రోమపాదునికి, దశరథునికి యిరువురికీ సంతానం కలిగినది.
మరీచి మహర్షి :
బ్రహ్మ తనకు సృష్టి విషయంలో సహాయకులుగా వుంటారని నవబ్రహ్మలను సృష్టించాడు. అందులో మరీచి ఒకడు. మరీచి కర్దమ ప్రజాపతి యొక్క కుమార్తె కళను వివాహం చేసుకొని ‘కశ్యపమహర్షికి జన్మనిచ్చాడు. వీరికే ‘పూర్ణిమ’ అనే కుమార్తె కూడా జన్మించినది.
జైమిని మహర్షి :
వ్యాస మహర్షి యొక్క శిష్యుడు. ఈయనను గూర్చి భారత భాగవతములలో స్వల్పముగా వున్నది. ఈయన సామవేదం పఠించి ప్రచారం చేశాడు. మార్కండేయ మహర్షిని దర్శించి తన సంశయములు తీర్చుకున్నాడు. మార్కండేయుని సూచన ప్రకారం ధర్మపక్షుల ద్వారా సందేహ నివృత్తి చేసుకున్నాడు. జైమిని భారతం, జ్యోతిషగ్రంథము, తంత్ర గ్రంధము, శ్రోతసూత్రం, ధర్మసూత్రములు అనే గ్రంథాలను రచించాడు.
దేవలమహర్షి :
పూర్వము దేవుడను మనువుండేవాడు. ఆయన కుమారుడు ప్రజాపతి. ప్రజాపతి కుమారునికి ప్రత్యూషకుడను కుమారుడు కలిగెను. అతడే దేవలుడు. యీతడు వ్యాస మహర్షికి ప్రియశిష్యుడు. పితృలోకములో మహాభారత ప్రచారము దేవలుని ద్వారా జరిగినది. వస్త్రముల సృష్టి దేవల మహర్షి చేసినదే. హూహూ అనే గంధర్వుడిని దేవల మహర్షి శపించగా అతడు మరు జన్మమున మొసలి రూపం అయి గజేంద్ర మోక్షఘట్టంతో శాపవిమోచనం పొందారు.
నరనారాయణ మహర్షులు :
శ్రీమహా విష్ణువు యొక్క అవతారములలో నరనారాయణావతరం విశేషించి శ్రీమద్భాగ వతంలో తెలుపబడినది. వీరు ధర్ముడనే మహాముని సంతతి. వీరు బాల్యము నుండి బదరికా వనములో తపస్సు చేయు చుండిరి. ఇంద్రుడు వీరి తపస్సుకు భయపడి విఘ్నము కల్పించుటకు చాలా విఫలయత్నము చేశాడు. నారాయణ మహర్షి తొడ నుండి ఊర్వశి పుట్టినది. నరనారాయణులు ప్రహ్లాదుడితో యుద్ధం చేశారు. శౌనకునకు జ్ఞానబోధ చేశారు. సహస్ర కవచుడు అనే రాక్షసుని సంహరించారు.
బకదాల్య మహర్షి :
దల్బుడు అనే మహర్షికి శ్రీహరి వరప్రసాదం వలన పుట్టినవాడు బకదాల్భ్య మహర్షి. ఇతడు చిరంజీవి, బ్రహ్మచారి. పాండవులు ద్వైతవనంలో వుండగా వారిని ఆశీర్వదించిన సందర్భంలో భారతంలో మనకు కనిపించును.
మాండవ్య మహర్షి :
మహాశక్తివంతుడయిన మహర్షి. సతీసుమతి చరిత్రలో సుమతి భర్త కౌశికుని శపించిన మహర్షి మాండవ్యుడే. ఈయన జనక మహారాజు దగ్గర తృష్ణ పోవు శిక్షణ పొందెను. మాండవ్య మహర్షి శాపప్రభావంగానే యముడు ‘విదురుడు’ గా పుట్టాడు.
ముద్గల మహర్షి :
నిత్యము ఊంఛ వృత్తిచే జీవనం చేసెడి వాడు. అట్లు జీవనం చేయుచునే, అతిథి సత్కారములు చక్కగా చేసెడివాడు. అతని తపస్సుకు మెచ్చి దూర్వాసుడు దేవలోక ప్రాప్తిని కలుగ చేశారు. దేవతలు స్వయంగా విమానం పంపించినా “క్షీణే పుణ్యే మత్స్య లోకం విశంతి” అన్న విషయాన్ని గుర్తించి అశాశ్వతమయిన దేవలోక నివాసం వదిలి వేసిన గొప్ప మహర్షి. ఇతని కుమారుడే మౌద్గల్యుడు. మౌద్గల్యుని భార్య “ఇంద్రసేన” మరుజన్మలో ద్రౌపది.
మైత్రేయ మహర్షి :
పరాశర మహర్షికి శిష్యుడు. ఈ మహర్షి దగ్గర విదురుడు తత్వము నేర్చుకొనెను. విష్ణుపురాణము పరాశరుల ద్వారా మైత్రేయుడు తెలుసుకొనెను. మాతృగర్భమున ఉండగానే ఆయన వేదశాస్త్రములు నేర్చుకొనెను. పాండవుల విషయంలో ధృతరాష్ట్ర దుర్యోధనులకు హితవు చెప్పెను. దుర్యోధనుని తొడలు భీమునిచే విరగగొట్టబడుటలో ఈయన శాప ప్రభావం కూడా వున్నది.
రైభ్య మహర్షి :
రైభ్యుడు బ్రహ్మసుతుడని వరాహపురాణంలో వున్నది. “అర్వావసుడు”, “పరావసుడు” అను వారు ఈయన కుమారులు మంచి విద్యా సంపన్నులు. భరద్వాజ పుత్రుడు “యువక్రీతుడు” అహంకారి అయి చెడు కార్యములు చేయు చుండగా, అతనిని రైభ్య మహర్షి తనతపోబలంతో సంహరించెను. పుత్రుని దహన కార్యములు పూర్తిచేసికొని భరద్వాజుడు దేహత్యాగం చేసెను. రైభ్యుని చీకటిలో చూసి మృగమని భ్రమించి అర్వావసువు చంపెను. అర్వావసువు మరల తపస్సుచేసి రైభ్య, అవక్రీత, భరద్వాజులను బ్రతికించెను.
రోమశ మహర్షి:
రోమశుడు బ్రహ్మచారి. భూభాగమున కల సమస్త తీర్థములు దర్శించి పుణ్యము సంపాదించెను. సర్వ లోకములందు స్వేచ్ఛగా సంచరించు శక్తి సంపాదించినవాడు. ఇతని చరితము భారత భాగవతములలో ఇంద్రలోకంలో వున్న అర్జునుని సమాచారం ధర్మరాజుకు తెలియచేయు సందర్భంలోను, ఇంద్రునికోరిక ప్రకారం అర్జునునితో కలిసి తీర్థయాత్రలు చేసిన సందర్భంలోను మనకు గోచరించును.
పరాశర :
వశిష్ఠ మహర్షి పౌత్రుడు. ఈయన తండ్రి పేరు శక్తి. పరాశరుడు గర్భంలో వుండగానే శక్తి మరణించెను. పరాశరుడు శివుడిని గూర్చి తపస్సు చేసి తన తండ్రి “శక్తి”ని స్వర్గంలోనే చూచెను. రాక్షస వంశనాశనమునకు యాగం చేయుచుండగా పులస్త్యుని కోరిక మేర ఆ ప్రయత్నము ఆపివేసిరి. పరాశర మహర్షికి సత్యవతి అనే మత్స్య గంధి వలన వేదవ్యాసుడు జన్మించాడు. పరాశరుడు ధర్మశాస్త్ర గ్రంథము జ్యోతిషశాస్త్ర గ్రంథములను రచించాడు.
వ్యాసమహర్షి :
వ్యాసమహర్షి ప్రతి ద్వాపరయుగంలోను ఉద్భవించి వేదములు పురాణములు, విభజన చేస్తాడు. అందుకే ఆయనకు వేద వ్యాసుడని పేరు. ప్రస్తుత వేదవ్యాసుని కృష్ణద్వైపాయనుడు. ఈయన లేనిదే భారతీయ సంస్కృతిలేదనే చెప్పాలి. ఋగ్వేదము పైలునికి, వైశంపాయనునికి యజుర్వేదము, జైమినికి సామవేదము, సుమంతునకు అధర్వవేదము బోధించి ప్రచారము చేయించాడు. సూత మహాముని ద్వారా పురాణములు ప్రచారం చేసినాడు. వ్యాసుడు పరమశివుని గూర్చి తపస్సు చేసి శుక మహర్షిని సంతానముగా పొందెను.
శుకమహర్షి :
శుకమహర్షి ఎక్కడా ఆవుపాలు పితుకు సమయము కూడా నిలువడు. తండ్రి దగ్గరే వేద శాస్త్రాధ్యయనం చేశాడు. ఈయనకు పార్వతీ పరమేశ్వరులే ఉపనయనం చేశారని పురాణగాధ. జనక మహారాజు దగ్గర ముక్తి మార్గమును తెలిసికొని గృహస్థాశ్రమంలోకి అడుగిడెను. ఈయన భార్యపేరు “పేవరీ”, ఈయన “కృష్ణ”, “గౌరప్రభ”, “భూరి” “దేవశ్రవు”లను పుత్రులు “కీర్తి” అను కుమార్తె కలరు.
నారదమహర్షి:
బ్రహ్మ మానస పుత్రుడు నారదుడు. నారద మహర్షి యొక్క ప్రస్తావన లేని పురాణకథలు లేవు. దేవతలు రాక్షసులు యిరువురూ కూడా గౌరవించిన విశేషమయిన వ్యక్తి నారదుడు. ఇతడు సదా హరి నామస్మరణ చేయుచూ ఒకచోట స్థిరముగా వుండక పదునాలుగు లోకములు తిరుగాడుచు ఉండును. యితని గూర్చి సూక్ష్మంగా చెప్పుట కుదరదు. ప్రతి పురాణ గాధలోను ఈయన ప్రమేయము కలదు.
వాల్మీకి మహర్షి :
యాజ్ఞవల్క్య మహర్షి :
దేవరాత ముని యొక్క పుత్రుడు. దేవరాతుని తపస్సుకు మెచ్చి నీకు నేనే పుత్రుడుగా జన్మించి శుక్ల యజుర్వేదమును భూమిమీద వ్యాప్తి చేయుదును అని వరమిచ్చెను. యితడు చతుర్వేదములూ అతిచిన్న వయసులోనే పఠించినాడు. భాష్కలుని ద్వారా ఋగ్వేదము, జైమిని ద్వారా సామవేదము, అరుణి వద్ద అధర్వణ వేదము వైశంపాయుని ద్వారా యజుర్వేదము చదివాడు. ఇతనికి మైత్రేయి, కాత్యాయిని అనే యిరువురు భార్యలు కలరు.
వామదేవుడు :
వామదేవ మహర్షి గొప్ప ఆత్మజ్ఞాని. ఈయన సుమేరు దక్షిణ శృంగమగు కుమార శిఖరమునకు వచ్చి కుమార స్వామి సాక్షాత్కారము పొంది ఆయన దగ్గర ఆత్మజ్ఞానమును తెలుసుకున్న మహర్షి. ఈయన ఎందరో రాజ వంశస్థులకు ఆత్మజ్ఞానం బోధించాడు. భరద్వాజ మహర్షితో కలసి వెళ్ళి శ్రీకృష్ణుని దర్శించి ఆయన ద్వారా అర్ఘపాద్యాదులు పొందినవాడు.
మతంగ మహర్షి :
మతంగమహర్షి పేరుచెప్పగానే వాలి గుర్తుకు రావలసినదే. ఋష్యమూక పర్వతం మీద తపస్సు చేసుకొనుచుండగా, వాలి దుందుభి అనే రాక్షసుని చంపి ఆ కళేబరం విసిరి వేశాడు. ఆ రక్తం మతంగ మహర్షిపైనపడినది. మతంగ మహర్షికి కోపం వచ్చి – యీ పర్వతంమీదకు వచ్చిన ఎడల వాలి మృతుడగును అని శపించారు. రామాయణంలోనిది ఈ ఘట్టం.
ఔర్యుడు :
భృగువంశ సంజాతుడు. చ్యవనుని మనమడు అప్రవానుని పుత్రుడు. ఔర్యుడు గర్భమునందు వుండగా కృతవీర్యుని వంశస్థుల నుండి రక్షణ కొరకు ఊరు ప్రదేశమున ధరించెను. అతని తేజముకు కృతవీర్యుని వంశస్థులందరికీ కనులు పోయెను. గర్భమునందు వుండగానే అతనిలో అంత శక్తి వున్నది. భృగు వంశము వారిని హింసించిన రాజవంశ స్థులను సంహరించుటకు ఔర్యుడు తపశ్శక్తిని పొందెను. శక్తి ప్రభావంగా అతడు ముల్లోకములు దహింపగల అగ్నిని సంపాదించెను. ఆ అగ్ని వలన ఉపద్రవము కలుగును అని గ్రహించి పితృదేవతలు ఆ అగ్నిని ఔర్యునిచేత సముద్రమున పారవేయించిరి. ఔర్యునికి కందళీ అనే అయోనిజ పుత్రిక కలదు. దుర్వాస మహర్షి ఈయన అల్లుడు.
గర్గమహర్షి:
బ్రహ్మ మానసపుత్రులలో గర్గుడు ఒకరు. ఈయన శివుని గురువుగా భావించి విద్యలను అన్నింటినీ సంపాదించెను. హైహయ రాజ వంశస్థులకు యాదవులకు ఈయన కుల గురువు, పురోహితుడు. గర్గుడు చెప్పిన ధర్మసూత్రాలు ‘గర్గ సంహిత’ అనే పేరుతో ప్రఖ్యాతి గాంచినవి.
Also Read :
Gajendra Moksham : భాగవతంలోని అపూర్వ గాధ ‘గజేంద్ర మోక్షం’ గురించి తెలుసుకోండి..
Gomatha : సకల దేవతా స్వరూపమైన గోమాత విశిష్టత, పూజ ఫలితాలు, ఆరోగ్య రహస్యాలు
8 Ganesh Temples in Maharashtra : అష్టగణపతి క్షేత్రములు
rukmini kalyanam : రుక్మిణీ కళ్యాణం కథ తెలుసుకోండి.. ఈ శుభచరిత్ర చదివినవారికి అన్నీ శుభాలే!
ఏ రాశుల వారు ఏ మంత్రాలు పఠించవలెను ?
జ్యోతిర్లింగాలు ఎన్ని అవి ఎక్కడ ఉన్నాయి.. వాటి విశేషాలు
benefits of wearing Rudraksha : ఏయే రుద్రాక్ష లను ధరిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ?