Telugu Flash News

DK Aruna on Kavitha : తప్పు చేయకపోతే భయమెందుకు? కవితపై డీకే అరుణ కీలక వ్యాఖ్యలు!

dk aruna comments on mlc kavitha

dk aruna comments on mlc kavitha

DK Aruna on Kavitha : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటికి నిన్న సీబీఐ అధికారులు వచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో ఆమె పాత్ర ఉందన్న ఆరోపణలపై సాక్షిగా ఆమె వివరణను సీబీఐ అధికారులు రికార్డు చేసుకున్నారు. సుమారు ఆరు గంటలకుపైగా సుదీర్ఘంగా కవిత విచారణ కొనసాగింది. అనంతరం తన తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసిన కవిత.. సీబీఐ విచారణ జరిగిన తీరును వివరించినట్లు తెలిసింది.

కవిత సీబీఐ విచారణపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పందించారు. ఎమ్మెల్సీ కవిత ఏ తప్పూ చేయనప్పుడు సీబీఐ విచారణకు భయపడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌తో ఏ సంబంధం లేనప్పుడు సీబీఐతో పాటు ఏ దర్యాప్తు సంస్థల అధికారులు వచ్చి ప్రశ్నలు కురిపించినా ధైర్యంగా సమాధానాలు చెప్పాలని సూచించారు.

కవితపై వచ్చినవి కేవలం ఆరోపణలే అయితే వాస్తవాలు విచారణలో వెల్లడవుతాయని డీకే అరుణ చెప్పారు. సీబీఐ విచారణ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, వారి కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు సహా ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు డీకే అరుణ. అవినీతికి పాల్పడకపోతే ఏ విచారణనైనా ధైర్యంగా ఎదుర్కోవాలి కదా అని డీకే అరుణ ప్రశ్నించారు.

పోలీసు వ్యవస్థను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది..

తెలంగాణలో కేసీఆర్‌పై తమ కృతజ్ఞత చాటుకొనేందుకు ఆ పార్టీ నేతలు చాలా మంది బీజేపీపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని డీకే అరుణ వ్యాఖ్యానించారు. సీబీఐ అధికారులు కవితను విచారిస్తుంటే ఆ పార్టీ నేతలంతా ఉలిక్కి పడుతున్నారని, తప్పు చేయనప్పుడు ఆందోళన ఎందుకని ప్రశ్నించారు. కవిత విచారణ నేపథ్యంలో హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన డీకే అరుణ.. ఈ మేరకు కామెంట్స్‌ చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలు అర్థరహితమన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను ప్రభుత్వం ఎలా దుర్వినియోగం చేస్తోందనేది ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు.

also read news:

Green Cards: అమెరికన్‌ గ్రీన్‌ కార్డుల జారీలో కీలక మార్పులు.. భారతీయులకు భారీ ఊరట!

Besharam Rang Song full video from Pathaan featuring Shah Rukh Khan, Deepika Padukone

Exit mobile version