Devotional: పూర్వ కాలం నుంచే శంఖం సంపదకు ప్రతిరూపంగా విరాజిల్లుతోంది. అఖండ అదృష్గం, సంపద, ఐశ్వర్యం, అభివృద్ధి, కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టేదిగా శంఖం నిలుస్తోంది. అఖండ దైవిక వస్తువుగా శంఖాన్ని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. శంఖంపై శ్లోకం కూడా ఉంది.
శంఖే చంద్ర మావాహయామి!
కుక్షే వరుణ మావాహయామి!
మూలే పృధ్వీ మావాహయామి!
ధారాయాం సర్వతీర్థ మావాహయామి!
అని శంఖంపై శ్లోకం ఉంది. శంఖాన్ని పూజించే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. పూజ గదిలో శంఖం ఉంచుకోవడం ద్వారా అరిష్టాలు తొలగిపోయి సంపద వృద్ధి కలుగుతుందని ప్రతీతి. దేవతలు, రాక్షసులు క్షీర సాగర మధనం చేస్తున్న సందర్భంలో సముద్రం నుంచి వచ్చిన వాటిలో శంఖం కూడా ఒకటి. శంఖాన్ని పాంచజన్యం అని కూడా పిలుస్తారు. శ్రీ మహా విష్ణువు శంఖాన్ని ధరించడం వల్ల దాని పవిత్రత మరింత పెరిగిందని పెద్దలు చెబుతారు.
దేవాలయాల్లో తలుపులు తీసే క్రమంలో, పూజ పూర్తయిన అనంతరం శంఖాన్ని ఊదడం కొన్ని ప్రాంతాల్లో నేటికీ ఆనవాయితీగా వస్తోంది. ఇంట్లో దేవుడి గదిలో శంఖం పెట్టుకొని నిత్యం పూజించడం మూలాన.. శుభం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. శంఖంలో రెండు రకాలు ఉంటాయి. మొదటిది దక్షిణావృత శంఖం. ఈ శంఖాలను ఎక్కువగా పూజలు చేసేటప్పుడు వినియోగంలో ఉంచుకోరు. ఇవి తెల్లటి రంగులో ఉంటాయి. పైన కాఫీ కలర్ గీత ఉంటుంది. కుడి వైపు తెరుచుకొని ఉంటాయి. ఈ శంఖాల్లో నీరు నింపి సూర్యుడికి ధార పోయడం వల్ల శరీరంలో ఉండే రోగాలు నయం అవుతాయని పెద్దలు చెబుతున్నారు.
ఇక రెండో రకం శంఖం.. వామావృత శంఖం. ఇది ఎడమవైపున తెరుచుకొని ఉంటుంది. దీన్ని వామావృత శంఖం అని పిలుస్తారు. పూజా విధానాల్లో తరచుగా వాడుతుంటారు. ఈ శంఖం ఇంట్లో ఉంచుకోవడం వల్ల దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతాయని చెబుతారు. విభిన్న శంఖాల్లో గోముఖ శంఖం కూడా ఒకటి. ఇది ఆవు ముఖం ఆకారంలో ఉంటుంది. సముద్రంలో లభించే అత్యంత అరుదైన శంఖంగా దీనికి పేరుంది. ఇది హియాలయాల్లోని కైలాస మానస సరోవరంలో, శ్రీలంక, అండమాన్ నికోబార్ దీవుల్లో లభ్యమవుతుందట. శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్టలకు, లక్ష్మీ ఆగమనానికి ప్రతీకగా అనాది నుంచి పెద్దలు చెబుతున్నారు.
Read Also : Devotional: సనాతన ధర్మం ప్రకారం నిత్య పూజ ఎలా చేసుకోవాలి?