Devotional: సనాతన ధర్మం చాలా గొప్పది. హిందూ సంప్రదాయం ప్రకారం పూజాది కార్యక్రమాలు చేసుకోడానికి కొన్ని పద్ధతులను పూర్వీకులు సూచించారు. హిందూ సనాతన ధర్మం జీవితంలో జీవన విధానాలను తెలియజేస్తుంది. భగవంతుడి ఎదుట దీపాన్ని వెలిగించే పద్ధతి లేని ఇంట్లో ఉండరాదని ధర్మ శాస్త్రం చెబుతుంది. క్రమం తప్పకుండా ప్రతి రోజూ నిత్యపూజ చేయడం ద్వారా శుభాలు కలుగుతాయని పండితులు చెబుతారు. రోజూ ఇంట్లో భగవంతుడిని ఆరాధించడం వల్ల మంచి జరుగుతుందనేది పెద్దల ఉద్దేశం.
మనిషి జన్మ ధర్మార్థకామమోక్షాలనే చతుర్విధ ఫలితాలను సిద్ధించేలా చేసుకొనేందుకు మార్గం. అదే సంకల్పంతో జీవించాలని ధర్మం మనకు చెబుతుంది. ఈ సంకల్పాలు నెరవేరాలంటే భగవంతుని అనుగ్రహం తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. ఇంట్లో ప్రతి నిత్యం పూజ చేసుకోవడం ద్వారా ఇది సాధ్యమవుతుందని పెద్దలు చెబుతారు. ఇందుకోసం ధర్మ శాస్త్రంలోనూ కొన్ని విషయాలను తెలిపారని పండితులు చెబుతున్నారు. భక్తి లేని ఆధ్యాత్మికత వ్యర్థమని ఆధ్యాత్మిక గురువులంతా ముక్త కంఠంతో చెబుతుంటారు.
భగవంతుడి అనుగ్రహం పొందాలంటే కూర్చొని పూజ చేయాలి. నిలబడి పూజ చెయ్యరాదు. పూజలో తర్పణ తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. గంధం పూజలో వినియోగించడం వల్ల దౌర్భాగ్యాన్ని, కష్టాన్ని దూరం చేస్తుంది. ధర్మ జ్ఞానాన్ని ఇస్తుంది. పవిత్రమైందన అక్షతలను పూజా ద్రవ్యాల్లో వినియోగించాలి. పుష్పం పాపాలను పోగొట్టి పుణ్యాన్ని ఇస్తుందని ప్రతీతి. పువ్వు లేని పూజ పూర్తికాదని పండితులు చెబుతారు. భగవంతుడికి కనీసం ఒక్క పువ్వునైనా సమర్పించి పూజ చేయడం వల్ల ఆ పూజ ఫలితాన్ని ఇస్తుందని చెబుతున్నారు.
ఇక ధూపం భగవంతుడికి సమర్పించడం కూడా తప్పనిసరి. ధూపం సమర్పిస్తే దుర్వాసనలను పోగొట్టి చక్కని పవిత్ర పర్యావరణాన్ని ఏర్పరుస్తుంది. ఇక దీపం అజ్ఞాన అంధ:కారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును మన ఆత్మకు అందిస్తుంది. అహంకారాన్ని దూరం చేసి మనలో భక్తిని మేల్కొలుపుతుంది. ఏం చేసినా లేకపోయినా దీపం వెలిగించి నువ్వే దిక్కు అని వేడుకోవడం వల్ల సమస్త బాధలు తొలగిపోతాయని మన సనాతన ధర్మం స్పష్టం చేస్తోంది. నైవేద్యం సమర్పించడం వల్ల భగవంతుని కరుణాకటాక్షాలు పొందగలుగుతారు.
Read Also : Cool Water: అతిగా కూల్ వాటర్ తాగుతున్నారా? గుండెపోటు రావొచ్చట!