Delhi Accident : కొత్త సంవత్సరం ప్రారంభం రోజున దేశ రాజధానిలో అత్యంత పాశవిక ఘటన వెలుగులోకి వచ్చింది. దుండగులు అంజలి అనే యువతిని కారుతో ఢీకొట్టి కిలోమీటర్ల కొద్దీ ఈడ్చుకెళ్లిన ఘటనపై దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. నిందితులను కఠినంగా శిక్షించాలని దేశ వ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయి నగ్న స్థితిలో నడిరోడ్డుపై కనిపించింది. దీనిపై విచారణ చేపట్టిన కేజ్రీవాల్ సర్కార్.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపింది.
అయితే, ఈ ఘటనలో తొలుత అది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా పోలీసులు పేర్కొన్నారు. అయితే, ప్రత్యక్ష సాక్షులు మాత్రం ఉద్దేశపూర్వకంగా కొందరు యువకులు కారుతో ఢీకొట్టి చంపేశారని తెలిపారు. తర్వాత లోతైన దర్యాప్తుచేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. దీపక్ అనే ప్రత్యక్ష సాక్షి ఈ ఘటనపై సంచలన విషయాలు వెల్లడించాడు. దుండుగులు స్కూటీపై వెళ్తున్న యువతి అంజలిని వెంబడించి కారుతో ఢీకొట్టారని తెలిపాడు.
గంటన్నరపాటు చాలా సార్లు యూటర్నులు తీసుకుంటూ సుమారు 12 కిలోమీటర్ల దూరంపాటు వాహనాన్ని నడిపారని వెల్లడించడం తీవ్ర కలకలం రేపుతోంది. రోడ్డులో పోలీస్ బారికేడ్లు గమనించి కారు యూటర్న్ తీసుకోవడం తాను చూసినట్లు మరో ప్రత్యక్ష సాక్షి అయిన ఫుడ్ డెలివరీ బాయ్ పేర్కొన్నాడు. యువతిని కారుతో లాక్కెళ్తున్న భయంకరమైన సీసీ టీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వీటిని చూసిన నెటిజన్లు దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
సమగ్ర దర్యాప్తుకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు
హత్యాచార ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు సుల్తాన్‌పురి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ స్పందించింది. యువతి హత్యపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించింది. ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు స్వాతి మలివాల్ కూడా పోలీసులకు నోటీసులిచ్చారు. బాధితురాలిపై అత్యాచారం జరిగిందా లేదా? అనే అంశాన్ని వెల్లడించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనతో దేశ రాజధానిలో మరోసారి నిర్భయ ఉదంతం గుర్తు చేస్తోందని నెటిజన్లు మండిపడుతున్నారు.
also read:
Vitamin Poisoning : అధిక మొత్తంలో విటమిన్లు తీసుకుంటే కలిగే నష్టాలు ?
Nutrition tips : ఆరోగ్య పరిపుష్టికి పాటించాల్సిన అద్భుతమైన చిట్కాలు..!