Telugu Flash News

Viral Video : మంచు తుఫాన్‌ ధాటికి వన్యప్రాణులూ విలవిల.. జింక కష్టాలు చూస్తే అయ్యో పాపం అంటారు!

Viral Video : ప్రస్తుతం అమెరికా, కెనడా దేశాల్లో భారీ మంచు తుఫాను గడగడలాడిస్తోంది. చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో మంచు తుఫాన్‌ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఉష్ణోగ్రతలు -40 డిగ్రీలకు పడిపోవడంతో పెద్ద ఎత్తున మంచు వర్షం, పెనుగాలులు వీస్తున్నాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. అమెరికాలో చరిత్రలో ఇలాంటి ఘటనలు జరగలేదని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో సాధారణ ప్రజలతో పాటు పశుపక్షాదులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. తినడానికి తిండి లేక, మొత్తం మంచుతో కప్పేయడంతో దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లోనూ మంచు ప్రభావం తీవ్రంగా ఉంది. ఊహించని ఈ పరిణామంతో ప్రజలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. వన్యప్రాణులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా నెట్టింట ఓ వీడియో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో ఓ జింక పరిస్థితి చూస్తే.. అయ్యోపాపం అనిపించేలా ఉంది. జింక పూర్తిగా నోరు, కళ్లు, చెవులు మంచు గడ్డలతో పేరుకుపోయి కనిపించింది. కనీసం తినడానికి ఆహారం లేక, తిరగడానికి ఏమీ కనిపించక, ఊపిరాడక.. తీవ్రంగా సతమతం అయ్యింది ఆ లేడి పిల్ల.

ఈ పరిస్థితిని ఓ వాహనదారుడు గమనించి వీడియో తీశాడు. అంతేనా.. తన వంతు సాయంగా ఆ జింక వద్దకు చేరుకొని సాయం చేసే ప్రయత్నం చేశాడు. సాధారణంగానే జింకలు చిన్న శబ్దం వచ్చినా పరుగు పరుగున వెళ్లిపోతాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. మనిషి శబ్దం విన్న జింక.. పరుగున వెళ్లిపోవడానికి ప్రయత్నించింది. అయితే, దాని వద్దకు వెళ్లిన వాహనదారుడు.. మెల్లగా జింకను అటకాయించి పట్టుకొని సాయం చేశాడు.

వాహనదారుడికి అభినందనల వెల్లువ

కళ్లు, చెవులు, ముక్కు వద్ద పేరుకుపోయిన మంచు గడ్డలకు వాహనదారుడు మెల్లగా తొలగించాడు. అనంతరం కాస్త ఊపిరి ఆడినట్లయ్యింది జింకకు. అనంతరం వేగంగా మంచులోనే పరుగెత్తుకుంటూ వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వన్యప్రాణులు ఎంతగా ఇబ్బంది పడుతున్నాయో ఈ వీడియోలో తెలుస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. జింకకు సాయం చేసిన వాహనదారునికి అభినందనలు తెలుపుతున్నారు.

మరిన్ని వార్తలు చదవండి :

తెలంగాణ వార్తలు  |  జాతీయ వార్తలు  |  సినిమా వార్తలు  |  అంతర్జాతీయ వార్తలు  |  ఆరోగ్య చిట్కాలు

Exit mobile version