Cyclone Biparjoy : బిపర్‌జాయ్ తుపాను ప్రభావంతో గుజరాత్‌లోని తీర ప్రాంత జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. తుపాను గురువారం తీరాన్ని తాకనుండడంతో అధికారులు 70 గ్రామాలకు చెందిన 75 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు త్రివిధ దళాలతోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది.
సహాయక చర్యలపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తుఫాను బుధవారం కచ్ మరియు సౌరాష్ట్ర వైపు తన దిశను మార్చుకుంది మరియు ఈశాన్య దిశగా కదులుతుందని, ఇది గురువారం సాయంత్రం జకావో ఓడరేవులో కేంద్రీకృతమై ఉంటుందని IMD తెలిపింది. తుపాను ప్రస్తుతం కచ్‌కు 290 కిలోమీటర్ల దూరంలో ఉందని గుజరాత్ రాష్ట్ర రిలీఫ్ కమిషనర్ అలోక్ కుమార్ వెల్లడించారు.
రాష్ట్రంలోని తీర ప్రాంత ద్వారక, జామ్‌నగర్, కచ్ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. ద్వారక తీరాన్ని బిపార్జాయ్ తుపాను ప్రభావం చూపుతోంది. బలమైన గాలులు వీస్తుండడంతో సముద్రంలో 20 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగసిపడుతున్నాయి.తుపాను ప్రభావంతో గోమతి ఘాట్ దెబ్బతిన్నది. ఒడ్డున ఉన్న ఆలయంలోకి సముద్రం నీరు చేరింది.
గోమతి ఘాట్ ఒడ్డున ఉన్న హరికుండ్, మహాప్రభూజీ ఆలయాల్లోకి సముద్రం నీరు చేరింది. తుపాను ప్రభావంతో ఈదురు గాలులతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ప్రస్తుతం అరేబియా సముద్రానికి ఈశాన్య దిశలో బీపర్జాయ్ తుపాను అత్యంత తీవ్రమైన తుపానుగా ఉంది.
గాలి వేగం పెరగడంతో తీర ప్రాంతాల్లో 4 వేల హోర్డింగ్‌లను తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. IMD అంచనా ప్రకారం బుధవారం నుంచి గంటకు 65-75 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఈ నెల 16న రాజస్థాన్‌పై బిపార్జాయ్ తుపాను ప్రభావం చూపుతుందని ఐఎండీ వెల్లడించింది. మరోవైపు తుపాను ప్రభావం తమ జీవనోపాధిపై పడుతుందని ఓడల తయారీదారులు ఆందోళన చెందుతున్నారు. తీర ప్రాంతంలో ఓడలు తయారవుతాయని, 3000 టన్నుల బరువున్న చెక్క నౌకలను తయారు చేసేందుకు రెండేళ్లు పడుతుందని, వాటిని ఇప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించలేమని వారు వాపోతున్నారు. తుపాను కారణంగా డామన్ బీచ్‌లలో 144 సెక్షన్ విధించినట్లు అధికారులు తెలిపారు.
read more :
Cyclone Biparjoy : మూడు రోజుల పాటు కరెంటు ఉండదు.. ఏర్పాట్లు చేసుకోవాలని అధికారుల సూచన