ప్రతి ఒక్కరి వంటింట్లో దొరికే వస్తువు కరివేపాకు(curry leaves). మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు తెచ్చుకున్నప్పుడు.. ఆఖర్లో ఓ ఐదు రూపాయలకు కరివేపాకు తెచ్చుకోవడం ప్రతి ఒక్కరూ చేసే పని. కరివేపాకులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలోనూ కరివేపాకు పాత్ర విశేషంగా ఉంది. అనేక రకాల అనారోగ్య సమస్యలను పారదోలే శక్తి కరివేపాకు సొంతం. ఇన్ని విశేష గుణగణాలు ఉన్న కరివేపాకును ఆరోగ్య ప్రదాయినిగా అభివర్ణిస్తారు.
కూరల్లో టేస్ట్ రావాలన్నా, వేపుళ్లు మరింత బాగా ఆరగించాలన్నా చాలా వాటిలో కరివేపాకు తప్పనిసరి అవుతుంది. కూరల్లో రుచిని మరింత పెంచేస్తుంది కరివేపాకు. మనం తీసుకొనే ఆహారంలో కరివేపాకును జోడించడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. కరివేపాకు రెమ్మలు మన శరీరానికి అవసరమైన విటమిన్ ఏ, సీలను నిత్యం సరఫరా చేస్తాయి. మరోవైపు మన శరీరంలోని రక్తంలో కొలెస్ట్రాల్ అధికమైనా లేదంటే తక్కువైనా కరివేపాకు తీసుకోవడం వల్ల బ్యాలెన్స్ చేస్తుంది.
అధిక బరువుతో బాధపడుతున్న వారు కూడా కరివేపాకును కూరల్లో తీసుకోవడం వల్ల నియంత్రణ సాధ్యమవుతుంది. వివిధ రకాలుగా కరివేపాకును మన శరీరంలోకి పంపడం వల్ల కరివేపాకులో ఉన్న ఔషధ లక్షణాలు రక్తహీనతను తగ్గిస్తాయి. కర్రీ లీవ్స్లో ఉండే ఫైబర్.. ఇన్సులిన్‌ను ప్రభావం చేయడం ద్వారా రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. తిన్న ఆహారం జీర్ణం కావడంలో కరివేపాకు కీలక పాత్ర పోషిస్తుంది. మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారు కరివేపాకు రోజూ తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది..
కరివేపాకులోని గుణాలు మన శరీరంలో అధిక బరువును నియంత్రిస్తాయి. ఇక మెదడుతో సహా నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి ఉపయోగపడే పదార్థాలు కరివేపాకులో ఉంటాయని అధ్యయనాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. కరివేపాకు వేయించిన నూనె కూడా ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. యాంటీబయోటిక్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్లను రూపుమాపడంలో ఇది సాయపడుతుంది. కరివేపాకుతో చర్మానికి కూడా మేలు చేకూరుతుంది. వీటిని నీటిలో ఉడకబెట్టి స్నానం చేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటివి దరిచేరకుండా ఉంటాయి.
మరిన్ని వార్తలు చదవండి :
తెలంగాణ వార్తలు | జాతీయ వార్తలు | సినిమా వార్తలు | అంతర్జాతీయ వార్తలు | ఆరోగ్య చిట్కాలు