Abhinav Manohar : ఐపీఎల్‌లో యువ క్రికెటర్లు తడాఖా చూపిస్తున్నారు. నిన్నగాక మొన్న కేకేఆర్ జట్టులో సభ్యుడైన రింకూ సింగ్ ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో రింకూ ఫ్యామిలీ నేపథ్యం, చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు బయటి ప్రపంచానికి తెలిశాయి. ఈ క్రమంలో మరో యువ క్రికెటర్ బ్యాగ్రౌండ్ గురించి ఇప్పుడు చర్చనీయాంశమైంది. అతడే గుజరాత్ టైటాన్స్ జట్టు సభ్యుడు అభినవ్ మనోహర్. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన గుజరాత్ టైటాన్స్ జట్టు.. ఈ సీజన్లో కూడా దూసుకుపోతోంది.
మంగళవారం ముంబై ఇండియన్స్ జట్టుపై జరిగిన మ్యాచ్‌లో జీటీ ఏకంగా 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సీజన్లో గుజరాత్‌కు ఇది ఐదో విక్టరీ. ఈ మ్యాచ్‌లో అభినవ్ మనోహర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తన తుఫాన్ ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి జట్టును కాసేపు వణికించాడు. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జీటీ.. 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 207 పరుగులు చేసింది. ఎంఐ ఛేజింగ్‌లో తడబడింది. మొత్తంగా 152 పరుగులే చేసి తొమ్మిది వికెట్లు కోల్పోయింది. 21 బంతుల్లోనే మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 42 పరుగులు చేశాడు అభినవ్.
గత ఏడాదిలో జరిగిన వేలంలో అభినవ్‌ను 2.6 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనింది. ఈ మొత్తం అతని బేస్ ధర కంటే 13 రెట్లు ఎక్కువ. సయ్యద్ ముస్తాక్ ట్రోఫీలో కర్ణాటక తరఫున ఆడిన అభినవ్.. సిక్సర్ల వర్షం అప్పటి నుంచే అలవాటు చేసుకున్నాడు. 2021లో, అతడు ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌ల్లో 162 పరుగులు చేశాడు. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో 49 బంతులు ఎదుర్కొన్న అభినవ్.. ఏకంగా 70 పరుగులతో అజేయంగా నిలిచాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో కూడా ఇదే జోరు కనబరుస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు అభినవ్ మనోహర్.
ఇక అభినవ్ ఫ్యామిలీ విషయానికి వస్తే.. అతడిది సాధారణ కుటుంబం. తండ్రి బెంగళూరులో చెప్పుల దుకాణం పెట్టుకున్నాడు. కోచ్ ఇర్ఫాన్ సైత్ వద్దకు తన కుమారుడిని తీసుకెళ్లి చేర్చుకోవాలని కోరగా.. కోచ్ సమ్మతించాడు. అక్కడే అతడి కెరీర్ మలుపు తిరిగింది. 2006లో అభినవ్ అండర్-14 మ్యాచ్‌లు ఆడుతుండగా తలకు గాయమైంది. చికిత్స కోసం వెళ్తే కుట్లు పడ్డాయి. అయితే, ఈ గాయాన్ని లెక్క చేయని అభినవ్ మనోహర్.. మరుసటి రోజే మైదానంలోకి వచ్చి సెంచరీ కొట్టడం అతడి చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచింది. ఇలా పట్టుదలగా నేర్చుకోవడమే అతడికి ఇప్పుడు ప్లస్ పాయింట్ అయ్యిందని కోచ్ పేర్కొన్నాడు.
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE