Rishabh Pant: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ గత ఏడాది డిసెంబరులో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి మనకు తెలిసిందే. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో పంత్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. కొత్త ఏడాదికి ఇంటికెళ్తూ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆరోగ్యం గురించి ఇప్పుడు షాకింగ్ వార్త ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తుంది. త్వరలోనే గ్రౌండ్‌లోకి పంత్ అడుగుపెడతాడని అందరు భావిస్తుండగా, ఇది మాత్రం షాకిచ్చే న్యూస్ అని చెప్పాలి. ఇప్పటికే పంత్ ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్‌లో అతను ఆడటం లేదని ఇప్పటికే సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. అయితే తాజాగా ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం పంత్ కేవలం ఈ ఐపీఎల్ మాత్రమే కాదు. వన్డే వరల్డ్ కప్ , వచ్చే ఏడాదిలో జరిగే టీ20 వరల్డ్ కప్ కూడా అతను ఆడబోడని సమాచారం.
పంత్ కనీసం 18 నెలల పాటు క్రికెట్‌కు దూరం అవుతాడని కొందరు నిపుణులు చెప్తున్నారు. టెస్టుల్లో భారత్‌కు పంత్ చాలా కీలకమైన ఆటగాడు అనే విషయం మనందరికి తెలిసిందే. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ కచ్చితంగా నెగ్గాలి. ఈ సిరీస్‌లో పంత్ లేని లోటు కచ్చితంగా కనిపిస్తుందని మాజీలు అంటున్నారు. ‘పంత్ వికెట్ కీపర్ కాబట్టి అతను చేసే ప్రతి పనీ మోకాళ్లపైనే భారం ఎక్కువగా చూపుతుంది. వికెట్ల వెనుక కూర్చోవాలన్నా.. పక్కలకు చటుక్కున దూకాలన్నా మోకాళ్లు పర్‌ఫెక్ట్‌గా ఉండటం ఎంతో అవసరం. వాటికే శస్త్రచికిత్స జరగడం వల్ల తను కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని అతన్ని తొందరపెట్టడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి పంత్ కోలుకోవడానికి చాలా టైమ్ అయితే పడుతుంది’ అని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
పంత్ యాక్సిడెంట్ కు గురైన సమయంలో అతడిని కారు నుంచి బయటికి తీసుకురావడంలో హర్యానా రోడ్డు రవాణా సంస్థ డ్రైవర్ తో పాటు ఇద్దరు స్థానిక యువకులు కీలకపాత్ర పోషించిన విషయం విదితమే. పంత్ కారులో తమకు దొరికిన రూ.4 వేల నగదును ఆ యువకులు తిరిగి ఇచ్చేసి తమ నిజాయతీ చాటుకున్నారు. రీసెంట్‌గా యువకులు పంత్ ను ఢిల్లీ ఆసుపత్రిలో పరామర్శించారు. దీనిపై పంత్ స్పందించాడు. వారిద్దరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎప్పటికీ వారిని మరచిపోనని అన్నాడు