అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్.. మరోవైపు చైనాలో కలవరపెడుతున్న కరోనా మహమ్మారి ప్రభావం (corona effect) .. వెరసి స్టాక్ మార్కెట్ కుదేలైంది. ఇన్వెస్టర్లు హడలెత్తి పోయారు. వారాంతం రోజైన శుక్రవారం దేశీయ సూచీలు భారీగా నష్టపోయాయి. వేల కోట్ల సంపద ఆవిరైపోయింది. అంతర్జాతీయంగా బలహీనమైన ఇండికేషన్స్ రావడంతో దేశీయ సూచీలకు నష్టాలు తప్పలేదు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు.. తర్వాతి కాలంలో కాస్త పుంజుకున్నాయి. అనంతరం భారీ లాభాల స్థాయికి చేరుకున్నాయి.
ప్రస్తుతం ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తోంది. అగ్ర రాజ్యం అమెరికాకు కూడా ఈ తిప్పలు తప్పడం లేదు. ఫలితంగా ప్రముఖ కంపెనీలన్నీ వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా ఆర్థిక మాంద్యానికి తోడు కరోనా భయం తోడవడంతో అన్ని రంగాలనూ హడలెత్తిస్తోంది. మరీ ముఖ్యంగా స్టాక్ మార్కెట్‌ను కరోనా వణికిస్తోంది. తాజాగా చైనాలో కరోనా విలయతాండవం చేయడంతో ఆ ప్రభావంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి.
శుక్రవారం స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోయింది. కోవిడ్ భయాలతో వరుసగా నాలుగో రోజూ దేశీయ సూచీలు నేలచూపులు చూశాయి. ఉదయమే నష్టాలతో మొదలైన స్టాక్ మార్కెట్.. రోజంతా అదే తీరున కొనసాగింది. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించలేదు. ఫలితంగా మార్కెట్ ముగిసే సమయానికి 980.93 పాయింట్లు నష్టపోయి 59,845.29 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీది కూడా అదే దారి. 320.55 పాయింట్లు పతనమై 17,845.29 వద్ద ముగిసింది.
ఫార్మా కంపెనీల షేర్లు లాభాల్లో..
రూపాయి బలహీనతలు, చమురు ధరలు పెరగడంతో దిగ్గజ షేర్లన్నీ శుక్రవారం నేలచూపులు చూశాయి. రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్‌బీఐ లాంటి టాప్ కంపెనీల షేర్లు వెలవెలబోయాయి. దీని వల్ల మార్కెట్ల సెంటిమెంట్ బాగా దెబ్బతింది. ఫలితంగా బీఎస్‌ఈలో నమోదైన మార్కెట్ విలువ ఒక్క రోజే సుమారు 8 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.82 వద్ద స్థిరపడింది. అన్ని షేర్లలోకెల్లా టైటాన్ కంపెనీ షేర్లు మాత్రమే కాస్త తటస్థంగా ముగిసిశాయి. మరోవైపు కరోనా నేపథ్యంలో ఫార్మా కంపెనీల షేర్లు దూసుకెళ్తున్నాయి.
also read news:
IPL: ఐపీఎల్ చరిత్రలో అత్యధికం.. ఏ ఆటగాడికి ఎక్కువ ధర పలికింది అంటే..!