సంక్రాంతి దగ్గరకు వస్తున్న వేళ దేశంలో చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ఎముకులు గడ్డ కట్టేంత చలి వీస్తూ వణికిస్తోంది. ఉదయం పది దాటినా చలి ప్రభావం అలాగే ఉంటుండడంతో జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు.
ఇంకొన్ని రోజుల పాటు చలి ఇదే విధంగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని చోట్ల ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు.
ఢిల్లీ, ఉత్తరప్రదేశ్,పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో చలి గాలితో పొగమంచు కమ్మేస్తుండడంతో ఉదయం పూట కూడా రవాణాకు ఇబ్బంది కలుగుతుంది.
ఇదిలా ఉండగా ఉత్తర భారతదేశంలో తీవ్రమైన చలి గాలులు వీస్తున్నాయని, రాజస్థాన్‌లోని బికనీర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 0 డిగ్రీలుగా, మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లా నౌగాంగ్‌లో 0.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని ఐఎండీ పేర్కొంది.
అదే విధంగా రానున్న ఐదు రోజుల్లో ఢిల్లీ, ఉత్తరాఖండ్,చండీగఢ్, హర్యానా,పంజాబ్,పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్మేసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తుంది.
జాతీయ రాజధాని ఢిల్లీలో ఇటీవల మూడు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరో పక్క నిరాశ్రయులైన జంతువుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత రెండేళ్లలో జనవరిలో ఇంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి కాగా అయానగర్ ప్రాంతంలో శుక్రవారం కనిష్ట ఉష్ణోగ్రత 1.8 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. దీంతో జనాలు బయటకి రావడానికి జంకుతూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు.
ఢిల్లీ లాగానే రాజస్తాన్‌లో కూడా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.రాత్రిపూట చలిగాలుల తీవ్రత మరింత అధికంగా ఉంటుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.గత శుక్రవారం చురులో 0.0 డిగ్రీల సెల్సియస్, పిలానీలో 0.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.చలి తీవ్రత రోజు రోజుకీ పెరుగుతుండడంతో రాజస్థాన్ ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ప్రకటించింది.
మధ్యప్రదేశ్‌లోని నౌగాంగ్‌లో ఉష్ణోగ్రత 0.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.దట్టమైన పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.చలి తీవ్రత వల్ల ఇక్కడ కూడా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
మధ్యప్రదేశ్‌లోని ఖజురహో, గ్వాలియర్, సాగర్ లాంటి ప్రాంతాలలో కూడా చలి తీవ్రత ఇలాగే ఉంది. గ్వాలియర్‌లో కనిష్ణ ఉష్ణోగ్రత 4 డిగ్రీల సెల్సియస్, ఖజురహోలో 2.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.దీంతో ప్రజలు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండడానికి చూస్తున్నారు.
ఇలా ఏ ప్రాంతంలో చూసినా చలి తీవ్రత రోజు రోజుకీ పెరుగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖవారు హెచ్చరిస్తున్నారు.
also read: