Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో అతి పెద్ద విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో ఇటీవల స్మిత హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘నిజం విత్ స్మిత’ (nijam with smita) టాక్ షోకి హాజరయ్యారు. ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి మొదటి అతిథిగా హాజరయ్యారు. ప్రోమోలో చిరంజీవికి స్వాగతం పలుకుతూ ప్రోమో స్టార్ అవుతుంది. చిరంజీవి ఫస్ట్ క్రష్, తదితర సరదా ప్రశ్నలకు చిరంజీవి ఆకట్టుకునేలా సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇక చిరంజీవికి ఓ చేధు అనుభవం ఎదురైందని తెలుస్తోంది. ‘మీరు ఎదిగే క్రమంలో ఎదురైన అవమానాలు? అనుమానాలు? లాంటివి’ అంటూ స్మిత చిరును ప్రశ్నించగా, అప్పుడు ఆయన మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో ఎదుగుతున్న క్రమంలో.. ఓ సందర్భంలో జగిత్యాలకు వెళ్లాను. అక్కడ అభిమానులు ఘన స్వాగతం పలుకుతూ పైనుంచి పూల వర్షం కురిపించారు. కానీ కొంచెం ముందుకు వెళ్లగానే కొందరు కోడి గుడ్లతో కొట్టారు.’ అంటూ బదులిచ్చారు. ఇంతకీ చిరంజీవికి అలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందనేది ఆసక్తికరంగా మారింది.