Chhattisgarh : కొంతమంది క్షణికావేశంలో చేసిన పనులకు తర్వాతి కాలంలో పశ్చాత్తాపం వ్యక్తం చేస్తుంటారు. తెలిసీ తెలియని వయసులో కొందరు, తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో దారుణాలకు ఒడిగడుతుంటారు. నేరం చేసిన సందర్భాల్లో అపరాధ భావం కలగకపోయినా కొన్నేళ్ల తర్వాత దాని ప్రభావం కనిపిస్తుంది. అప్పుడు ఎంత విచారం వ్యక్తం చేసినా చేసిన తప్పును సరిదిద్దుకోలేకపోయామని బాధ పడుతుంటారు. కొందరికి చేసిన తప్పు జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. కలలో కూడా ఆ పనే గుర్తొస్తుంటుంది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఘటన ఇందుకు అద్దం పడుతోంది.
సుమారు 20 ఏళ్ల కిందట ఓ వ్యక్తి.. మరో వ్యక్తిని హత్య చేశాడు. అయితే, చంపేసిన వ్యక్తికి చనిపోయిన వ్యక్తి కలలోకి వచ్చి ప్రస్తుతం చిత్ర హింసలు పెడుతున్నాడట. వినడానికి చోద్యంగా అనిపించినా.. ఇది వాస్తవంగా జరిగిన ఘటనే. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్‌లోని బాలోద్ జిల్లాలో ఈ ఘటన కలకలం రేపింది. చనిపోయిన వ్యక్తి మృతదేహం కోసం పోలీసులు సంవత్సర కాలంగా వెతుకుతున్నారు. కరక్‌భాట్ ప్రాంతానికి చెందిన టికం కొలియారా అనే వ్యక్తి 2003లో తాను ఛవేశ్వర్ గోయల్ అనే వ్యక్తిని హతమార్చినట్లు చెప్పాడు. అనంతరం అడవిలో పాతిపెట్టానంటూ గతేడాది గ్రామస్తులతో పేర్కొన్నాడు.
తాను చంపేసిన వ్యక్తి తన భార్యకు స్నేహితుడని, ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించిన నేపథ్యంలో హత్య చేసినట్లు చెప్పాడు. అయితే, ఛవేశ్వర్ ఇప్పుడు తన కలలోకి వస్తూ వేధిస్తున్నాడని చెప్పాడు. దీంతో ఈ వ్యవహారంపై గ్రామంలోని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అతడు చెప్పిన విషయాల ఆధారంగా అనేక ప్రాంతాల్లో తవ్వకాలు చేశారు. అయినప్పటికీ డెడ్‌బాడీ జాడ తెలియరాలేదు. ఇంతలోనే కొలియారా మానసికంగా వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు.
దీంతో అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. అయితే, ఛవేశ్వర్ తండ్రి మళ్లీ తవ్వకాలు జరపాలంటూ అధికారులను కోరాడు. దీంతో తాజాగా తవ్వకాలు జరిపిన అధికారులకు.. ఓ డ్యామ్ సమీపంలో కొన్ని ఎముకలు, బట్టలు లభ్యమయ్యాయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. డీఎన్‌ఏ పరీక్షల కోసం ఎముకలను ల్యాబ్‌కు పంపించారు. అయితే, ఇంతలోనే కొలియారా గ్రామంలో కనిపించకుండా పోయాడు. మొత్తానికి ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
also read:
Akhil-RamCharan: రామ్ చరణ్, అఖిల్ కాంబినేషన్‌లో మల్టీ స్టారర్ రానుందా.. అసలు విషయం ఏంటంటే..!