Telugu Flash News

MLC 2023 : ఎమ్మెల్సీ గెలుపుతో టీడీపీకి బూస్ట్‌.. నేతల చేరికలు షురూ!

MLC 2023 : గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు కైవసం చేసుకోవడంతో తెలుగుదేశం పార్టీ (Telugu desam party) లో కొత్త జోష్‌ వచ్చింది. దీనికి తోడు 19 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నప్పటికీ అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టి ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కూడా ఒకటి కైవసం చేసుకోవడంతో ఇక టీడీపీలో రెట్టింపు ఉత్సాహం ఉరకలేస్తోంది.

ఇదే ఊపుతో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గెలవాలని పట్టుదలతో ముందుకెళ్తోంది. చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎన్నికలు జరిగేందుకు ముందే నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి 23 ఎమ్మెల్యేలు గెలుపొందారు. వివిధ కారణాలతో టీడీపీ నుంచి గెలిచిన వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరిధర్‌, వాసుపల్లి గణేష్‌.. ఈ నలుగురు ఎమ్మెల్యేలూ వైసీపీకి జై కొట్టారు. జగన్‌ను కలిసి అధికారికంగా పార్టీలో చేరకున్నా మద్దతు పలికారు.

ఇక అధికార పార్టీకి 151 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నలుగురితో కలిపి 156 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయితే, ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి గత కొంత కాలంగా వైసీపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.

వీరికి తోడు ఇప్పుడు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి కూడా క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడి టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధను గెలిపించారు. దీంతో చంద్రబాబు వ్యూహం ఫలించినట్లయింది.

అవకాశం లేకపోయినా చంద్రబాబు (chandrababu) అభ్యర్థిని నిలపడంపై అప్పుడే అందరికీ అనుమానం కలిగింది. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల కదలికలను పసిగట్టాలి. అయితే, టీడీపీ కదలికలపై, ఎత్తుగడలపై అధికార పార్టీ మేల్కోలేకపోయిందని స్పష్టమైంది. క్రాస్‌ ఓటింగ్‌ దెబ్బకు గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ కూడా ఇలాగే దెబ్బ తిన్నాయి. ఇప్పుడు వైసీపీకి ఈ దెబ్బ తగిలింది.

ఎమ్మెల్సీ గెలుపుతో టీడీపీలోకి వలసలు పెరిగాయి. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోదరుడు గిరిధర్‌రెడ్డి టీడీపీలో చేరారు. భారీ ర్యాలతో వచ్చిన ఆయన చంద్రబాబు సమక్షంలో పచ్చ కండువా కప్పుకున్నారు. ఆయనతోపాటు మరికొందరు పార్టీలో చేరారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని, నెల్లూరు జిల్లాలో పదికి పది స్థానాలూ టీడీపీ గెలుస్తుందని గిరిధర్‌రెడ్డి జోస్యం చెప్పారు. ఇక వచ్చే ఎన్నికల్లో సునామీ వస్తుందని, ఆ సునామీలో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు.

also read :

Shakuntalam: శాకుంత‌లం సినిమా కోసం వాడిన బంగారం, వ‌జ్రాల ధ‌ర ఎంత తెలిస్తే ఉలిక్కిప‌డ‌డం ఖాయం..!

Rahul Gandhi : రాహుల్‌ గాంధీకి బిగ్‌ షాక్‌.. అనర్హత వేటు వేసిన లోక్‌ సభ సెక్రటేరియట్‌

Exit mobile version