ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటోంది. గత వైసీపీ పాలనలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడిన నేపథ్యంలో వారికి అన్ని విషయాల్లోనూ మేలు జరిగేలా ఒక్కో నిర్ణయం వెలువరిస్తోంది.
ఇందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే రాష్ట్ర స్ధాయి ఉద్యోగులకు మాత్రమే వర్తించేలా ఈ నిర్ణయం ఉంది.
రాష్ట్రానికి రాజధానిగా 2015లో అమరావతిని ఎంపిక చేసిన తర్వాత విభజిత రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి జరిగేందుకు వీలుగా అప్పటి టీడీపీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చి పనిచేసే ఉద్యోగులకు ఐదు రోజుల పని దినాల నిబంధన కూడా ఒకటి. అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకూ మాత్రమే వీరు పనిచేసేలా వెసులుబాటు ఇచ్చారు. దీన్ని అప్పటి టీడీపీ సర్కార్ తో పాటు ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా కొనసాగించింది. దీని గడువు ఇవాళ్టితో ముగిసింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానం పొడిగిస్తూ సీఎం చంద్రబాబు ఇవాళ మరోసారి నిర్ణయం తీసుకున్నారు. సెక్రటేరియట్, హెచ్ ఓడీ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాలు పొడిగించేలా ఇచ్చే ఉత్తర్వులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఇవాల్టితో వారానికి ఐదు రోజుల పనిదినాల నిబంధన గడువు ముగుస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఈరోజు లేదా రేపు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో సీఎం చంద్రబాబు కు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.