Telugu Flash News

AP News : చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ.. ఐ ప్యాక్‌ ట్వీట్ సంచలనం

chandrababu-naidu-prashant-kishore

AP News : రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు మరింత ఉత్కంఠగా మారుతున్నాయి. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధికార, విపక్షాలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలోనే శనివారం చంద్రబాబు నాయుడుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారింది.

ఈ భేటీ తర్వాత ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ (I-PAC) చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ గెలుపు కోసం ఐ ప్యాక్ పని చేస్తుందని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌తో టీడీపీ గెలుపు కోసం ప్రశాంత్ కిషోర్ తన వ్యూహాలను అందిస్తారనే చర్చకు ముగింపు పడింది.

చంద్రబాబు, లోకేష్, ప్రశాంత్ కిషోర్ మూడు గంటల పాటు సుదీర్ఘ సమావేశం జరిపినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఏపీలో రాబోయే ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీలో తన సర్వే నివేదికలను చంద్రబాబు ముందు ప్రశాంత్ కిషోర్ ఉంచినట్లు తెలుస్తోంది.

గతంలో ఐ ప్యాక్ టీమ్ జగన్ కోసం పనిచేసింది. 2019 ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు రావడంలో ఐ ప్యాక్ టీమ్ కీలక పాత్ర పోషించింది. అయితే గత కొంత కాలంగా ఎన్నికల వ్యూహాలకు దూరంగా ఉంటున్న ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం బీహార్ రాజకీయాలపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది.

భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి

చంద్రబాబుతో భేటీ తర్వాత ఐ ప్యాక్ చేసిన ట్వీట్‌తో రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త ఊహాగానాలు మొదలయ్యాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య ఏదైనా కలయిక ఉంటుందా? లేదా ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీకి వ్యూహాలు అందిస్తారో? అనేది చూడాలి.

 

Exit mobile version