Telugu Flash News

AP High Court : ఏపీ హైకోర్టు తరలింపుపై కేంద్రం క్లారిటీ.. చట్టప్రకారమేనన్న కిరణ్‌ రిజిజు

ap high court

AP High Court : ఆంధ్రప్రదేశ్ హైకోర్టును తరలించాలంటే హైకోర్టుతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు జవాబు ఇచ్చారు.

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం హైకోర్టు అమరావతిలో ఏర్పాటైందని ఆయన చెప్పారు. హైకోర్టును కర్నూలుకు తరలించాలంటే హైకోర్టు, ఏపీ ప్రభుత్వం కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏమీ లేదంటూ ఆయన స్పష్టం చేశారు.

ఏపీ హైకోర్టు తరలింపు ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలోని అంశమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 214 నిబంధన ప్రకారం 2018 సంవత్సరంలో కేంద్రం వర్సెస్‌ ధన్‌గోపాల్‌ రావు, ఇతరుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు, ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం అమరావతిలో రాష్ట్ర హైకోర్టు ఏర్పాటైందని కేంద్ర మంత్రి తెలిపారు.

ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి హైకోర్టుగా ఉన్న అప్పటి హైదరాబాద్‌లోని హైకోర్టు, అప్పటి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేశారన్నారు.

ఇక ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలించేందుకు ప్రతిపాదన చేశారని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌ మూడు రాజధానుల ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.

మూడు రాజధానుల వ్యవహారంలో ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని గుర్తు చేశారు. రాజధాని అమరావతి నగరంలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగంగా చేపట్టాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని, ఏపీ సీఆర్డీఏను ఆదేశించిందని కేంద్ర మంత్రి తెలిపారు.

కర్నూలు నగరానికి హైకోర్టును తరలిస్తామని ఏపీ ప్రభుత్వం చట్టం చేసిందని, కానీ అడుగు ముందుకు పడలేదని నిపుణులు అంటున్నారు. వాస్తవానికి అసెంబ్లీకి హైకోర్టును తరలించే అధికారం లేదని, చట్టం చేసినంత మాత్రాన హైకోర్టును తరలించలేరని చెబుతున్నారు.

ఇక మూడు రాజధానుల అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో నడుస్తోంది. అమరావతి రైతుల పిటిషన్లు, ఏపీ ప్రభుత్వ పిటిషన్‌ కలిపి సుప్రీం విచారణ చేస్తోంది. ఈ కేసులో తీర్పు వస్తేగానీ హైకోర్టు తరలింపు, విశాఖలో పరిపాలన, అమరావతిలో శాసన రాజధాని అనే విషయంపై క్లారిటీ వచ్చే ఆస్కారం లేదు.

Exit mobile version