మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Vivekanandareddy murder case) లో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి (YS Avinash reddy) పై సీబీఐ (CBI) ప్రశ్నల వర్షం కురిపించింది. రెండో సారి నోటీసులు జారీ చేసిన సీబీఐ.. ఈ మేరకు హైదరాబాద్‌కు వచ్చిన అవినాశ్‌రెడ్డిని విచారణ చేసింది.
ముఖ్యంగా హత్య జరిగిన రోజున నిందితుడైన సునీల్‌కుమార్ యాదవ్.. అవినాశ్‌రెడ్డి ఇంట్లో ఎందుకు ఉన్నాడని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అది యాదృచ్ఛికంగానే జరిగిందా? లేక ఇంకేమైనా ఉందా? అని సీబీఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
వివేకా హత్య కేసులో మరో నిందితుడైన గంగిరెడ్డితో అవినాశ్‌రెడ్డి సంబంధాలపై సీబీఐ ఆరా తీసినట్లు తెలుస్తోంది. గంగిరెడ్డితో ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నలు వేసినట్లు సమాచారం. శుక్రవారం అవినాశ్‌రెడ్డి మరోసారి విచారణకు హాజరైన సందర్భంగా ఇప్పటి వరకు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన పలు అంశాలపై అవినాశ్‌రెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వచ్చిన అవినాశ్‌రెడ్డి.. సుమారు మూడు గంటల పాటు విచారణ ఎదుర్కొన్నారు.
కేసు దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్న ఢిల్లీ సీబీఐ ఎస్పీ రాంసింగ్ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల బృందం అవినాష్‌రెడ్డిని ప్రశ్నించింది. వివేకా హత్య జరిగిన రోజు, ఆ తర్వాత జరిగిన సంఘటనల గురించే ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.
సీఎం వైఎస్ జగన్ బాబాయి అయిన వివేకా హత్య కేసులో అవినాశ్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోందని అటు అధికార పక్షంలోనూ, ఇటు ప్రతిపక్షంలోనూ జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో సునీల్ యాదవ్ అరెస్టయ్యాడు.
మరోవైపు కేసు విచారణపై స్పందించిన అవినాశ్‌రెడ్డి.. అబద్ధాన్ని సున్నా నుంచి వందకు పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత నెల 28న తొలిసారి విచారణజ రిగిందని, దానికి కొనసాగింపుగా రెండోసారి పిలిచారని తెలిపారు. తనకు తెలిసినంత వరకు సమాధానాలు చెప్పానని అవినాశ్‌రెడ్డి వెల్లడించారు.
వాస్తవాలు తెలుసుకొని వార్తలు ప్రసారం చేయాలని మీడియాను కోరారు. తాను వైఎస్ విజయమ్మ దగ్గరకు వెళ్లి వస్తే బెదిరించానని డిబేట్లు పెట్టడం సమంజసం కాదన్నారు. తాను దుబైకి వెళ్లానంటూ కొందరు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ కేసులో వాస్తవాల కంటే వ్యక్తి లక్ష్యంగా విచారణ జరుగుతోందని ఆరోపించారు.
Also read :
Kiara Advani : బంగారం, వెండితో స్పెషల్ లెహంగా చేయించుకున్న కియారా.. ధర ఎంతో తెలుసా?