Telugu Flash News

YS Avinash Reddy : అవినాశ్ రెడ్డికి మరోసారి సీబీఐ పిలుపు.. 24న విచారణకు రావాలని సూచన

ys avinash reddy

ys avinash reddy

వైసీపీ కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి (YS Avinash Reddy) కి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. దివంగత వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈనెల 24న విచారణకు హాజరు కావాలని సీబీఐ వాట్సప్ ద్వారా అవినాశ్‌రెడ్డికి నోటీసులిచ్చింది. అలాగే ఈనెల 23వ తేదీన అవినాశ్‌ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి విచారణకు హాజరు కావాలని సూచించింది. హైదరాబాద్‌ నాంపల్లిలోని సీబీఐ కార్యాలయానికి రావాలని వీరిద్దరికీ సూచించింది. ఈ పరిణామంతో కేసులో సీబీఐ తాజాగా వేగం పెంచినట్లు స్పష్టమవుతోంది.

ఈనెల 24న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని సీబీఐ ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది. వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని ఈనెల 23వ తేదీన వైఎస్సార్‌ జిల్లాలోని పులివెందులలో విచారణ చేస్తామని, ఆయన వయసును దృష్టిలో పెట్టుకొని ఈ మేరకు మినహాయింపు ఇచ్చినట్లు సీబీఐ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ సీబీఐ కార్యాలయానికి ఓసారి హాజరైన అవినాశ్‌రెడ్డిని.. అవసరమైతే మరోసారి పిలుస్తామని సీబీఐ అధికారులు ఆ సందర్భంగా చెప్పిన విషయం తెలిసిందే.

గతంలో సీబీఐ అధికారులు సీఆర్పీసీ 160 సెక్షన్‌ కింద నోటీసులు ఇచ్చారు. గత నెల 28న విచారణకు హాజరయ్యారు అవినాశ్‌రెడ్డి. ఈ నేపథ్యంలోనే తాజాగా తండ్రీ కుమారులకు నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. రెండు రోజుల్లోనే ఇద్దరినీ విచారణ చేయాలని సీబీఐ నిర్ణయించింది. వైఎస్‌ వివేకా హత్య కేసులో కుట్రకోణం దాగి ఉన్నందున, కోణాన్ని వెలికితీసేందుకు దర్యాప్తు వేగవంతం చేసినట్లు ఇప్పటికే సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.

వైఎస్‌ భాస్కర్‌ రెడ్డిని గతంలో రెండుసార్లు విచారించిన సీబీఐ.. ఇప్పుడు మరోసారి విచారణకు రావాలని పిలిచింది. ఆయన హాజరు విషయంలో ఇచ్చిన సమాధానంపై మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. వివేకా హత్య కేసులో రాజకీయ రచ్చ ముదురుతోంది. ఓవైపు టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తుండడం, మరోవైపు సీబీఐ దర్యాప్తు వేగవంతం చేయడంతో అధికార పార్టీలో కలకలం మొదలైంది. వేళ్లన్నీ తాడేపల్లివైపే చూపుతున్నాయంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

also read news :

Taraka Ratna: తార‌క‌ర‌త్న ప్రాణాలు పోవ‌డానికి ఆ చిన్న త‌ప్పే కార‌ణమా?

Pakeezah Vasuki : మెగా హీరోలు చేసిన సాయం మరువలేను..

 

Exit mobile version