Telugu Flash News

Viveka Murder Case: ఉదయ్‌కుమార్‌రెడ్డికి బెయిల్‌ ఇవ్వొద్దన్న సీబీఐ.. అవినాశ్‌రెడ్డి ప్రమేయం ఉందంటూ..

Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్య కేసుకు సంబంధించిన డైరీని తాజాగా సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు న్యాయస్థానానికి సమర్పించారు. ఈ సందర్భంగా కేసులో నిందితుడుగా ఉన్న గజ్జల ఉదయ్‌ కుమార్‌రెడ్డి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై ఇరు వర్గాలు తమ వాదనలను వినిపించాయి. వివేకానందరెడ్డి హత్య కేసులో ఉదయ్‌ కుమార్‌ రెడ్డికి బెయిల్‌ ఇస్తే సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేస్తారని సీబీఐ తెలిపింది.

హత్య కేసులో ఉదయ్‌కుమార్‌రెడ్డి ప్రమేయంపై తమ వద్ద ఆధారాలు ఉన్నాయని సీబీఐ పేర్కొంది. ఆధారాలు సేకరించిన తర్వాతనే ఉదయ్‌ కుమార్‌ రెడ్డిని అరెస్టు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. ఈ మేరకు సీబీఐ కౌంటర్‌ దాఖలు చేసింది. ఉదయ్‌ కుమార్‌ రెడ్డికి బెయిల్‌ ఇవ్వొద్దంటూ న్యాయస్థానాన్ని సీబీఐ కోరింది. వాదనలు విన్న కోర్టు.. బెయిల్‌ పిటిషన్‌పై తమ నిర్ణయాన్ని మే 15వ తేదీకి వాయిదా వేసినట్లు పేర్కొంది.

ఇక వివేకా హత్యకు కుట్ర, సాక్ష్యాధారాల ధ్వంసం వ్యవహారంలో వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి ప్రమేయం కూడా ఉందని సీబీఐ తన కౌంటర్‌లో ప్రస్తావించింది. ఉదయ్‌కుమార్‌ రెడ్డిని సీబీఐ ఇటీవల అరెస్టుచేసిన సంగతి తెలిసిందే.

హత్య తర్వాత ఆధారాలను చెరిపేయడంలో ఉదయ్‌ కుమార్‌ రెడ్డి పాత్ర ఉందని సీబీఐ నిర్ధారించింది. ఉదయ్‌ కుమార్‌ రెడ్డి విచారణకు సహకరించడం లేదని సీబీఐ ఆరోపిస్తోంది. వివేకా హత్య కేసులో సాక్ష్యాల ధ్వంసంలోనూ అవినాశ్ రెడ్డి పాత్ర కూడా ఉందని సీబీఐ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

అయితే, ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఉదయ్‌ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సంబంధం లేకపోయినా మొదటి నుంచి తనను సీబీఐ వేధిస్తోందని ఉదయ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. తనకు బెయిల్‌ ఇవ్వాల్సిందిగా కోర్టును ఉదయ్‌ కుమార్‌ రెడ్డి కోరారు.

వివేకా హత్య కేసు దర్యాప్తు చివరి దశకు చేరుకుందని, చార్జ్‌ షీట్‌ ఒక్కటే మిగిలి ఉందని పేర్కొన్నారు. కాబట్టి ఇంకా జైలులో ఉంచాల్సిన అవసరం లేదని, తాను నిబంధనలు, షరతులు పాటించడానికి సిద్ధంగా ఉన్నానని, బెయిల్‌ మంజూరు చేయాలని ఉదయ్‌ కోరారు. బెయిల్‌పై న్యాయస్థానం 15వ తేదీన తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.

Read Also : Pawan Kalyan: వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వబోం.. పొత్తులపై పవన్‌ క్లారిటీ!

Exit mobile version