ఈ 2022 సంవత్సరం బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) నుండి అన్ని జోనర్ లోని సినిమాలు వచ్చాయి. అయితే ఆశ్చర్యంగా ఒక్కటంటే ఒక్కటి కూడా అక్షయ్ కు హిట్ ఇవ్వలేకపోయింది.
కోవిడ్ కు ముందు అక్షయ్ కు ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు. క్రిందటి సంవత్సరం నుండి బాలీవుడ్ సినిమాలను హింది ప్రేక్షకులు పెద్దగా లెక్క చేయడం మానేశారు.
ఎంత పెద్ద హీరోల సినిమాలనైనా తిప్పి కొడుతూ తమ పవర్ ఏంటో చూపిస్తున్నారు. ఈ దెబ్బకు ఎటువంటి సినిమాలు తియ్యాలో తెలియక తల పట్టుకుంటున్నారు బాలీవుడ్ దిగ్గజాలు.
అక్షయ్ కుమార్ మొదటి నుండి తన మార్కు నటనను చూపిస్తూ బాలీవుడ్ లో ఎదిగాడు. హేరా ఫెరి, భూల్ భూలయ్యా, నమస్తే లండన్ తో పాటు అజనబి వంటి థ్రిల్లర్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను పెంచుకున్నాడు.
ఆ తర్వాత మెల్లగా దేశభక్తి సినిమాల వైపు కూడా ఒక చూపు చూసాడు ప్రతిష్టాత్మక అవార్డులు కూడా గెలుచుకున్నాడు. ఎయిర్ లిఫ్ట్, కేసరి వంటి సినిమాలు అక్షయ్ ఇమేజ్ ను మరికొంత పెంచాయి.
ఆ తర్వాత ప్యాడ్ మాన్, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా అంటూ సామాజిక అంశాలపై సినిమాలను కూడా చేసి తనకు సామాజిక సృహ ఉందని నిరూపించుకున్నాడు. అయితే ఇవన్నీ అతనికి పెద్ద స్టార్ డం ఇవ్వడమే కాకుండా అక్షయ్ సినిమా అంటే ప్రేక్షకుల అంచనాలు పెరిగేలా చేసాయి.
అయితే అదంతా గతం 2020లో వచ్చిన మహమ్మారి వలన ప్రజలు ఇంట్లో ఓటిటి లకు అలవాటు పడ్డారు. ప్రేక్షకుల అభిరుచి మారింది కానీ బాలీవుడ్ నిర్మాతల, స్టార్ల రొటీన్ కమర్షియల్ ఫార్ములా మాత్రం మారలేదు.
అయితే గత సంవత్సరం వచ్చిన సూర్యవంషి పర్లేదు అనిపించినా, ఈ సంవత్సరం వచ్చిన బచ్చన్ పాండేతో మొదలైన ప్లాపుల పరంపర ఆ తర్వాత వచ్చిన సామ్రాట్ పృథ్వీరాజ్, రక్షా బంధన్ ను ఘోరంగా దెబ్బ తీసింది.
ఆ తర్వాత వచ్చిన ఓటిటి రిలీజ్ కట్ ఫుట్లీ కూడా నిరాశపరిచింది. అయితే అక్షయ్ కుమార్ ను భయపెడుతున్న మరో అంశం రామ్ సేతు ట్రైలర్ కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదని.
ఈ ట్రైలర్ లో అక్షయ్ నీటిలో నుండి నడిచి వస్తున్న సీన్ కు ఒకప్పటి అక్షయ్ అయితే ప్రేక్షకులు అబ్బురపడేవారేమో కానీ ఇప్పటి ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు థియేటర్లు వరకు వస్తారా అనేది అనుమానమే. దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది.