Jasprit Bumrah : మరి కొద్ది రోజులలో టీ20 ప్రపంచకప్ జరగనుండగా, ప్రపంచ కప్‌కి ముందు టీమిండియాకి పెద్ద షాక్ తగిలింది. భారత ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి కారణంగా వరల్డ్ కప్ సిరీస్‌కి దూరమయ్యాడు.
ఇటీవలే వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకొని జట్టులోకి వచ్చిన బుమ్రా.. రెండు మ్యాచ్‌ల వ్యవధిలోనే మళ్లీ గాయపడడం, వరల్డ్ కప్ సిరీస్‌కి దూరం కానుండడం అభిమానులలో ఆందోళన కలిగిస్తుంది. బుమ్రా గాయంపై ఇప్పటి వరకు క్లారిటీ లేకపోయిన వెన్ను ఫ్రాక్చర్ అయినట్లు భావిస్తున్నారు. కనీసం 4-5 వారాల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తుంది.
చిన్న తప్పు..
జూలైలో ఇంగ్లండ్ పర్యటన అనంతరం విశ్రాంతి పేరిట ఆటకు దూరమైన బుమ్రా.. ఆ తర్వాత జరిగిన వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్నాడు.
జింబాబ్వే పర్యటనకు కూడా బుమ్రా వెళ్లలేదు. ఆసియాకప్ ముంగిట బుమ్రా వెన్ను నొప్పితో బాధపడడం వలన అతనిని ఆ సిరీస్‌లోను ఆడించలేదు. ఇక రీసెంట్‌గా జరిగిన ఆస్ట్రేలియా సిరీస్‌లో మాత్రం ప్రాక్టీస్ కోసం రెండు మ్యాచ్‌లు ఆడించారు. పూర్తిగా గాయం నుంచి కోలుకోకపోవడంతో వెన్నులో మరింత ఒత్తిడి పెరిగి ఫ్రాక్చర్ అయినట్టు తెలుస్తుంది.
సౌతాఫ్రికాతో తొలి టీ20కి ముందు వెన్ను నొప్పితో బాధపడుతున్న బుమ్రా ఆ మ్యాచ్ ఆడలేదు. కామన్‌గా పక్కన పెట్టారని అందరు అనుకున్నారు. కాని అభిమానులకి నిన్న పెద్ద షాకిచ్చాడు.
ఇప్పటికే పసలేని బౌలింగ్‌తో ఇబ్బంది పడుతున్న భారత జట్టుకి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. బీసీసీఐ తొందరపాటు వల్లే బుమ్రా సేవలు కోల్పోవాల్సి వచ్చిందనేది కొందరు ఎక్స్‌పర్ట్స్ భావిస్తున్నారు. పూర్తిగా గాయం తగ్గక ముందే ఆడించడం వల్లనే అతనికి వెన్నులో ఫ్రాక్చర్ వచ్చి ఉంటుందని అనుకుంటున్నారు. మరి బుమ్రా లేకుండా భారత జట్టు ఎలాంటి ప్రణాళికలతో వరల్డ్ కప్ ఆడుతుందో చూడాలి.