Telugu Flash News

BRS News: బీఆర్‌ఎస్‌లో వర్గపోరు.. జగిత్యాలలో సొంత పార్టీ కౌన్సిలర్ల తిరుగుబాటు!

సీఎం కేసీఆర్‌(CM KCR) టీఆర్‌ఎస్‌ (TRS) ను బీఆర్‌ఎస్‌ (BRS) గా రూపాంతరం చేసిన నేపథ్యంలో.. కొన్ని ప్రాంతాల్లో వర్గపోరు అధికమైంది. సాధారణంగా ఏ పార్టీలోనైనా రెబెల్స్‌ బెడద ఉండేదే. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీలో ఇవి కాస్త ముదిరాయి. తాజాగా జగిత్యాల జిల్లా అధికార పార్టీలో ముసలం ఏర్పడింది. సొంత పార్టీ కౌన్సిలర్లే మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌కు వ్యతిరేకంగా ఏకమైనట్లు తెలుస్తోంది. కొంత కాలంగా మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ శ్రావణికి వ్యతిరేకంగా కొందరు కౌన్సిలర్లు పావులు కదుపుతున్నారట.

శ్రావణిపై ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌కు ఫిర్యాదు చేసినట్లు కూడా చెబుతున్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తీరు ఏకపక్షంగా ఉంటోందని కొందరు కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. ఆమెను వెంటనే గద్దె దింపకపోతే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పారట. అధిక శాతం మంది కౌన్సిలర్లు తిరుగుబాటు చేసినట్లు తెలుస్తోంది. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 48 వార్డులు ఉన్నాయి. వీటిలో మెజార్టీ శాతం 38 మంది అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లే ఉన్నారు.

అయితే, ఇందులో కూడా 27 మంది శ్రావణిపై గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ఇందులో మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. తిరుగుబాటు చేస్తున్న వారి వెనుక వైస్‌ చైర్‌ పర్సన్‌ హస్తం ఉందని చర్చ నడుస్తోంది. కొంత కాలంగా ఈ వ్యవహారం అంతర్గతంగా సాగిందని.. ఇప్పుడు రచ్చకెక్కిందని చెబుతున్నారు. ఏకంగా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమైనట్లు కొందరు సంకేతాలు ఇస్తున్నారు. తాజాగా ఆదివారం ఓ ఫంక్షన్‌ హాల్‌లో శ్రావణికి వ్యతిరేకంగా కొందరు కౌన్సిలర్లు సమావేశం కూడా నిర్వహించారని తెలుస్తోంది.

పార్టీలో కలకలం రేపుతున్న తిరుగుబాటు..

ఊహించని పరిణామంతో బీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం రేపుతోంది. ఎలాగైనా శ్రావణిని గద్దె దింపాలని ఆ కౌన్సిలర్లు పట్టుపడుతున్నారట. అయితే, ఇందులో మరో కోణం కూడా ఉందని చెబుతున్నారు. చైర్‌పర్సన్‌ పీఠం దక్కించుకోవడం కోసం కొందరు కుట్ర పన్ని శ్రావణికి వ్యతిరేకంగా ఏకమవుతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే, శ్రావణిపై అవిశ్వాసం పెట్టేంత ధైర్యం చేయకపోవచ్చనే చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ ఎవరికి మద్దతిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.

also read news: 

Air India : విమాన టికెట్ల ధరలు భారీగా పెరుగుతున్న వేళ సంచలన ఆఫర్.. అతి తక్కువ ధరకే జర్నీ చేయండిలా..!

Janasena in Rayalaseema : సీమలో జనసేన బలం పెరిగిందా? కర్నూలులో అపూర్వ స్పందనే ఇందుకు సంకేతమా?

పై చదువుల కోసం అమెరికా వెళ్లే వారిలో హైదరాబాదీ స్టూడెంట్లదే హవా.. ఎంత మంది వెళ్తున్నారంటే..!

 

Exit mobile version