Telugu Flash News

BJP MP Pragya Thakur : ఇంట్లో కత్తులు పెట్టుకోండి.. బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

BJP MP Pragya Thakur

బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్‌ ఠాగూర్‌ (BJP MP Pragya Thakur) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాజాగా లవ్‌ జిహాద్‌ అంశంపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ పార్లమెంటరీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రగ్యా సింగ్‌ ఠాకూర్‌.. హిందూ కార్యకర్తల హత్యలపై స్పందించారు. తమపై దాడి చేసిన వారిపై స్పందించే హక్కు హిందువులకు ఉందని ప్రగ్యా సింగ్‌ పేర్కొన్నారు. హిందువుల గౌరవానికి సంబంధించిన అంశంపై వెనకడుగు వేయాల్సిన అవసరం లేదని చెప్పారు.

తమను తాము రక్షించుకొనేందుకు హిందువులు ఇంట్లో పదునైన కత్తులు పెట్టుకోవాలంటూ కాంట్రవర్సీ కామెంట్స్‌ చేశారు. కొంత మంది లవ్‌ జిహాద్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారి వ్యవహారంలో ప్రేమ ఉండదని చెప్పారు. తాజాగా సౌత్‌ రీజియన్‌ వార్షిక సదస్సులో మాట్లాడిన ప్రగ్యా.. ఈ మేరకు హాట్‌ కామెంట్స్‌ చేశారు. భగవంతుడు సృష్టించిన ఈ లోకంలో అణచివేతదారులను, పాపాత్ములను అంతం చేయాలని పిలుపునిచ్చారు.

అసలైన ప్రేమకు నిర్వచనం చెప్పాలంటే అది పాపాత్ములను అంతం చేయడమేనన్నారు. తమపై దాడి చేసిన వారిని తగిన రీతిలో శిక్షించాలని, అప్పుడే వారికి బుద్ధి వస్తుందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా లవ్‌ జిహాద్‌ పేరుతో మోసపోతున్న, బలవుతున్న యువతులను రక్షించాలని చెప్పారు. చిన్ననాటి నుంచే బాలికలకు సరైన విలువలు నేర్పాలని పిలుపునిచ్చారు. హిందువుల హత్యల గురించి ప్రస్తావన వచ్చిన సందర్భంగా ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రగ్యా సింగ్‌.

మిషనరీ సంస్థల్లో చదివించకండి..

స్వీయ రక్షణ కోసం ఇంట్లో కత్తులనైనా పెట్టుకోవాలని, ఉన్న కత్తులకు పదునైనా పెట్టుకోవాలన్నారు. ఈ క్రమంలో కూరగాయలకు వాడే పదునైన కత్తులైనా సరే.. రెడీగా ఉంచుకోవాలంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలియదని, ఈ క్రమంలో ఆయుధాలు సిద్ధంగా పెట్టుకోవాలని చెప్పారు. దాడి చేసినప్పుడు తగిన రీతిలో జవాబు ఇవ్వాలన్నారు. ఇది మన ప్రాథమిక హక్కు అని తెలిపారు. పిల్లలను మిషనరీ స్కూళ్లలో చదివించవద్దని చెప్పారు. ఇలా చేయడం వల్ల తల్లిదండ్రులను అనాధలుగా చేసేలా స్వార్థంగా తయారవుతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మం గురించి, శాస్త్రాల గురించి తెలియజేయాలని పిలుపునిచ్చారు. తద్వారా సంస్కృతి, సంప్రదాయాలు అలవర్చుకుంటారని తెలిపారు.

మరిన్ని వార్తలు చదవండి :

తెలంగాణ వార్తలు  |  జాతీయ వార్తలు  |  సినిమా వార్తలు  |  అంతర్జాతీయ వార్తలు  |  ఆరోగ్య చిట్కాలు

Exit mobile version