Karnataka Elections : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచార జోరు పెంచాయి. రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఓటర్లను ఆకట్టుకొనేందుకు పార్టీల నేతలు హామీలు కురిపిస్తున్నారు. అధికార బీజేపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ మేనిఫెస్టోను విడుదల చేసింది.
రాష్ట్రంలో పేదలకు ఉచిత సిలిండర్లు, 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది బీజేపీ. దాంతోపాటు ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేకెత్తించిన నందిని పాల బ్రాండ్‌ను కూడా బీజేపీ తన మేనిఫెస్టోలో చేర్చడం విశేషం.
బీజేపీ ప్రజా ప్రణాళిక పేరుతో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం తమ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. బెంగళూరులో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై, సీనియర్ నేత యడ్యూరప్ప, ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నడ్డా.. అన్ని వర్గాలకు న్యాయం, సంక్షేమం అందించడమే బీజేపీ విజన్ అని చెప్పారు. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకా మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు. ఇప్పటికే పలు సర్వేల్లోనూ ఈసారి కర్ణాటక కాంగ్రెస్‌దేనని తేలిన సంగతి తెలిసిందే.
ఇక బీజేపీ మేనిఫెస్టోలో ముఖ్యాంశాల విషయానికి వస్తే.. కర్ణాటకలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. తయారీ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన జీవించే వారి కుటుంబాలకు రోజూ ఉచితంగా అర లీటరు నందిని పాలను అందజేయనున్నట్లు మేనిఫెస్టోలో పెట్టారు.
పేద కుటుంబంలో ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం, 5 కేజీల తృణధాన్యాలతో ప్రతినెలా రేషన్ కిట్ అందజేస్తామన్నారు. కర్ణాటక యాజమాన్య చట్టాన్ని సవరిస్తామని, ప్రతి వార్డుకూ ల్యాబొరేటరీ ఏర్పాటు చేస్తామన్నారు.
దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు ఏటా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తామని మేనిఫెస్టోలో బీజేపీ స్పష్టం చేసింది. ఇవి ఉగాది, వినాయక చవితి, దీపావళి పర్వదినాలకు ఒక్కొక్కటి చొప్పున ఇస్తామని పేర్కొంది.
ఇక మైసూరులోని ఫిల్మ్ సిటీకి దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ పేరు పెడతామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ప్రతి వార్డులో అటల్ ఆహార కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరాశ్రయులకు 10 లక్షల ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది.
also read :
Shriya Saran : ఇలాంటి ప్రశ్న హీరోలను అడిగే ధైర్యం మీకు ఉందా?
IPL 2023 : అతడికి అద్భుతమైన కెరీర్.. ఇండియాకు మంచిది.. యువ క్రికెటర్‌పై హిట్‌మ్యాన్ ప్రశంసలు