Telugu Flash News

Birth of Navagrahas : గ్రహోత్పత్తి – నవగ్రహాల పుట్టుక గురించి తెలుసుకొండి

Birth of Navagrahas : గ్రహోత్పత్తి – నవగ్రహాల పుట్టుక

రవి చంద్ర జననము

విష్ణువాది అంతములేని ప్రభువు. ఆయనయే దేవకార్య నిమిత్తము పండ్రెండు రూపులయి కశ్యపుని వలన అదితియందు తనను తానే పుట్టించుకొనెను. (స్వయంభువు అయ్యెనన్నమాట) ఆ పండ్రెండుగురలో సవిత (ఆదిత్యుడు) దేవత యొకడు. అదేరీతిగ అత్రికి పది దిక్కుల నుండి విష్ణువే యుదయించెను. ఆయనయే మృగలాంఛనుడు (శశాంకుడు) చంద్రుడు. వసువులలో నొకడైన ధర్ముని భార్య దాక్షాయణి వసువులనడుమ  ధర్మజ్ఞుడయిన నిశాంకరుని గన్నది. అతడే యమృత మథనము వేళ సోముడై లక్ష్మీదేవితో గూడ యుదయించినాడు.

కుజ జననము

హిరణ్యాక్షుడను దైత్యుడు మహాపరాక్రముడు. వాని కూతురు వికేశి (జుట్టులేనిది). ఆమె తపస్సు చేసి జుట్టుసంపా దించుకొనెను. ఆమెను స్థాణువు (శివుడు) కామించెను. ఆమెతో పినాకిరత్యాసక్తుడై యున్నపుడు, నిప్పు పుట్టునని భయపడి దానికగ్ని విఘ్నముకావించెను. అతడి నగ్ని యేకాంత గృహమం దుండగా హరుడు కని కుపితుడైనంత నాతని మోమున బొడమిన చెమటచుక్క దేవి మోమునంబడెను. దాని నామెక్రావెను. దాన గౌరి గర్భవతియయ్యె, ఆగర్భతేజస్సు మోయలేక ప్రజ్వలించునగ్ని ప్రభవలెనున్న యాగర్భము నామె జారవిడిచెను. దేవీస్వరూపిణి యైన ధరణి యాగర్భ ముంధరించెను. ఆ శిశువునకు కశ్యపుడు స్వయముగా జాతకర్మాది సంస్కారములు చేసెను. బొగ్గుల సమీపమున నుండుటచే నాబాలుని కంగారకుడను పేరు పెట్టబడెను. కుజుని యొక్క జన్మవృత్తాంతమిది.

బుధ జననము

కశ్యపునికి దనువను పత్ని, ఆమె త్రిలోక ప్రసిద్ధురాలు. ఆమె రజుడను కుమారుంగనెను. అతడు వరుణుని కూతురగు వారుని మించెను. ఆమె త్రిలోకసుందరి. ఆమెకు తన తపస్సును తేజస్సును బలమును వీర్యమును శుల్కముగానిచ్చెను. ఆరమణి వానింగొని యుదకములందు లీనమయ్యెను. ఉగ్రతపస్సుచే దను కుమారుడైన రజుడలనీట లీనమైనట్లమె నెరింగి తాను నా నీటిలో ప్రవేశించెను. ఆమెను దాకెను. తాకిన మాత్రాన నతడు ద్రవించెను (కరిగి పోయెను). ద్రవత్వమంది నట్లమె గ్రహించి చంద్రుడా యుద్ధకమును పుత్రార్దియై మధించెను. సోముడట్లు మధించుచున్నతరి లోకనమస్కృతుండగు విష్ణువా తేజస్సునందు ప్రవేశించెను. అంతట బుధుడు పుట్టెను. గ్రహముల యందొకడుగా దెలియు బుధుడాతడే. ఆ తేజస్సును బృహస్పతి భార్య తార తాను ధరించెను. ధరింపలేక దక్షకన్య యగునామె (చంద్రుని  భార్య) యామయు నాబాలుని గర్భచ్యుతుం గావించెను.

గురజననము

మరీచి ప్రజాపతి కూతురు సురూప, రూప యౌవనశాలిని. ఆమె నతడంగిరసునకిచ్చెను. ఆయన యామెయందు బృహస్పతిని దేవగురుంగనెను. ఆయన మంచివక్త. మహాబుద్ధిశాలి, వేద వేదాంగ పారంగతుడు.

శుక్ర జననము

హిరణ్యకశిపుని కూతురు ఉష, ఆ విశాలాక్షి త్రిలోకసుందరి. భృగుమహర్షి భార్య. ఆమెజౌశనసుని (ఉశనుడను భృగుమహర్షి కుమారుని) శుక్రునింగనెను. ఆయన ధర్మజ్ఞుడు. యోగశక్తిచే నతడు కుబేరుని ధనమును హరించెను. విత్తముగోల్పడి కుబేరుడు హరుని శరణందెను. దాన శివుడు కోపముగాని భార్గవుని జంపను ద్యమించెను. భార్గవుడు యోగశక్తిచేత హరుని లోనే ప్రవేశించెను. ఆదేవదేవు నుదరమందుండి స్తుతించెను. పార్వతీ దేవి గూడ కొనియాడెను. శంకరుడంతట వానిని శిశ్నము ద్వారమున విడిచెను. జగద్గురువు శంభు లీతనికి శుక్రుడను పేరు పెట్టెను. ధనేశునితో బాటీతనికి గూడ ధనాధిపత్యము మెసంగెను. విడిచెను..మరియు కుబేరునితో నితనికి మైత్రిని గూడ గూర్చెను.

శని జననము

బ్రహ్మ మానస పుత్రుడు త్వష్ట ప్రజాపతి. త్రిలోక సుందరి యగు సంజ్ఞయను కూతురుంగని సూర్యుని కిచ్చెను. సూర్యుడామెయందు వైవస్వతమనువుంగనెను. యముని యము నను గూడ గనెను. యమునానది త్రైలోక్యపావని. సంతానము గల్గిన తర్వాత నా సుందరి సంజ్ఞాదేవి సుకుమారి భర్తతేజమును సైపలేక ఛాయం బిలిచి కల్యాణి నా రూపుగొని యెట్టి వికృతి దోపనీక యిట సూర్యభగవానుని దగ్గర నుండుము. నా కొడుకులను నా కూతురును గాపాడుచుండుము అని పలికి యా సంజ్ఞాదేవి తండ్రి దరికేగెను. అతడు నీ మగని దగ్గరకుబో పొమ్మన నుత్తరకురుభూముల కేగి బడబారూపమున నచ్చట పచ్చికబయళ్లతోడి యచటి వనంబునందు దిఱుగుచుండెను. సూర్యుడును ఛాయయం దీమే సంజ్ఞయేయని భావించుచు నిద్దరు కొడుకులంగనెను. వారు సావర్ణుడు, శనైశ్చరుడు.

రాహుకేతువుల జననము

కశ్యపప్రజాపతి భార్య సింహిక. ఆమె దక్షుని కూతురు. తపస్సున నున్న భర్తనుజేరి భగవంతుడా! నేను బుత్రునిగావలెనని కోరికతో నున్నా ననుగ్రహింపు మనియె. ఆ సమయమందడుగుటకు కోపించి యా ప్రజాపతి దైత్య దానవులు పోలిన వానిని గుమారుని నీవు గనెద వనెను. ఆ మహాత్ముని వరదానమున నామె రాహువుం గనెను.

కేతువు జన్మకథ

బ్రహ్మ ప్రజలూరక పెరిగిపోవుట చూచి యాబుద్ధిశాలి ప్రజలు క్షయించుటకనువైన యాలోచన చేసెను. ఆ ఆలోచన మృత్యువనుకన్య యాయనకు గల్గెను. ఆమెను జూచి “ఓ కల్యాణి! నీవు ప్రజాసంహారము చేయు” మని విధి పల్కెను. అదివిని యామె ఏడ్చెను. ఆ కన్నీళ్ళ నుండి వ్యాధులు వేలకొలది  పుట్టెను. ఆమె వారింగని కన్నీళ్ళు ఆపుకొని (తుడిచికొని) ఉష్కరారణ్యముంజొచ్చి దుశ్చర తపము సేసెను. అక్కడనే కాదు * పెక్కుచోట్ల పెక్కు సంవత్సరములు తపస్సు చేసెను. బ్రహ్మ మరల యామెంగని ప్రజాసంహారము సేయుము. మున్నునేజెప్పితిని గదా! అది యట్లే కావలయును. మఱకలాగున కాదు అనెను. అదివిని యా సుందరి వేడి నిట్టూర్పు పుచ్చెను. ఆ యూర్పు నుండి కేతువు పుట్టెను. అగ్నివలె జ్వలించు శిఖ (జుట్టు) కాలాగ్ని వంటి కాంతియు కల్గి పొగలు గ్రమ్ముచు కేతురూపుడై (జెండా వలె నుండి) యున్నవానిని దేవదేవుడు బ్రహ్మ ధూమకేతువను పేరందెదవు. లోకములకు శుభాశుభములం జూపింతువనెను. దినమున నంతరిక్షమున భూమియం దీకేతువొక్కడే ధూమ కేతువయి బహువిధముల రూపములతో గనిపించును. మనుష్యు లకు శుభాశుభ ఫలమును జూపుచుండును.

also read :

Aishwarya Rai: మ‌ణిర‌త్నం పాదాలకు నమస్కరించిన ఐశ్వ‌ర్య‌రాయ్.. గ్రేట్ అంటూ నెటిజ‌న్స్ కామెంట్స్

History of Thailand : థాయిల్యాండ్ చరిత్ర గురించి తెలుసుకోండి..

Gold Rates Today ((26-04-2023) : ఈరోజు బంగారం, వెండి ధరలు ఇలా..

 

 

 

Exit mobile version