కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతోంది. భారత్ జోడో పేరిట కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా పాదయాత్ర చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఇప్పటి వరకు 125 రోజులపాటు పాదయాత్ర చేసిన రాహుల్.. పది రాష్ట్రాలను చుట్టేశారు. 52 జిల్లాల్లో పాదయాత్ర కొనసాగింది. 3,400 కిలోమీటర్లకుపైగా నడిచారు. అయితే, యాత్రలో భాగంగా ఇప్పటి వరకు ఆయన వైట్ టీషర్ట్ మాత్రమే ధరించారు. వణికించే చలిలోనూ ఆయన కనీసం స్వెటర్ ధరించలేదు.
ఓ దశలో మీడియాతో మాట్లాడిన రాహుల్‌ను.. జర్నలిస్టులు ఈ విషయాన్ని ప్రస్తవించారు. దీనికి రాహుల్ సమాధానమిస్తూ.. పేద వారిని ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడగరంటూ తిరిగి ప్రశ్నలు గుప్పించారు. పాదయాత్రలో భాగంగా తాను ముగ్గురు చిన్నారులను కలిశానన్న రాహుల్.. చలికి వణుకుతున్నా వారు స్వెటర్లు ధరించలేదని చెప్పారు. ఇప్పటి వరకు వారే తనకు ఆదర్శమని రాహుల్ వివరించారు.
అయితే, జమ్మూకశ్మీర్‌లోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించగానే రాహుల్ తమ మనసు మార్చుకున్నారు. ఇక్కడ చలి తీవ్రత భారీగా ఉండటంతో జాకెట్ ధరించక తప్పలేదు. దక్షిణాది, ఉత్తరాదిలోనూ కేవలం తెల్లటి టీషర్ట్‌తోనే పాదయాత్రతో చుట్టేసిన రాహుల్.. ఇప్పుడు చలికి జాకెట్ ధరించడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని పలు పార్టీల నేతలు అంటున్నారు.
30తో ముగియనున్న భారత్ జోడో యాత్ర..
ఈనెల 27వ తేదీన అనంతనాగ్ జిల్లా మీదుగా శ్రీనగర్‌లోకి రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. యాత్ర సందర్భంగా కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో నడవకూడదని భద్రతాబలగాలు రాహుల్‌కు సూచించినట్లు తెలుస్తోంది. జమ్మూలో ప్రవేశించిన రాహుల్ యాత్రకు అక్కడి నేత ఫరూక్ అబ్దుల్లా ఘన స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. ఇలా ఉండగా రాహుల్ పాదయాత్ర ఈనెల 30న శ్రీనగర్‌లో ముగియనుంది. యాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు రాహుల్ ప్రయత్నించారు. ఇది ఏ మేరకు ఫలిస్తుందో ఎన్నికలు వస్తేగానీ తెలియదు.
also read news:
Viral Video today : వైకల్యం ఓడిన వేళ.. అతని గుండె ధైర్యానికి సలాం చేయాల్సిందే!
MP Komatireddy Venkat Reddy : కేసీఆర్ ఏ క్షణమైనా ఎన్నికలకు వెళ్లే చాన్స్.. పార్టీని సిద్ధం చేయండి!