Telugu Flash News

benefits of wearing Rudraksha : ఏయే రుద్రాక్ష‌ ల‌ను ధ‌రిస్తే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయి ?

benefits of rudraksha

రుద్రాక్ష‌ – ఈ భూమి మీద అనేక వందల రకాల చెట్లు ఉన్నాయి. అన్ని చెట్లలోకి సర్వశ్రేష్ఠమైనది రుద్రాక్షచెట్టు అని హిందువులు నమ్ముతారు. ఈ రుద్రాక్ష సాక్షాత్తు శివ స్వరూపమే అని వేదకాలం నుంచి నమ్మకం. ఈ రుద్రాక్ష చెట్టు నుంచి రుద్రాక్ష పళ్లు కోసి ఆ పండులో ఉన్న విత్తనమే రుద్రాక్ష అని మనం తెలుసుకోవాలి. ఈ రుద్రాక్షలో అనేక రకాలున్నాయి. ఈ రుద్రాక్షలకు ఎన్ని గీతలు ఉంటే అన్ని ముఖాలుగా చెబుతారు. ఉదాహరణకు ఒక నిలువగీత ఉంటే ఏకముఖి అని, రెండు నిలువగీతలు ఉంటే ద్విముఖి రుద్రాక్ష అని, ఐదు నిలువగీతలు ఉంటే పంచముఖి రుద్రాక్ష అని ఇలా ప్రతి రుద్రాక్షకు గీతలను బట్టి పేర్లు ఉంటాయి. మొత్తం 25 రకాల రుద్రాక్షలు ఉంటాయి. ఒక్కొక్క రుద్రాక్షకు దాని గీతల సంఖ్య ప్రకారం ఒక్కొక్క అధిపతి ఉంటాడు. అంటే ఏకముఖి రుద్రాక్షకు అధిపతి శివుడు. చతుర్ముఖి రుద్రాక్షకు బ్రహ్మ, అలాగే గౌరీశంకర రుద్రాక్ష అంటే రెండు రుద్రాక్షలు ఒకదానికి ఒకటి అంటుకొని యుండే అటువంటి రుద్రాక్షను గౌరీశంకర రుద్రాక్ష అంటారు. ఈ రుద్రాక్షలు ధరించడం వల్ల అనేక కష్టనష్టాలు పోయి మానవుని యొక్క జీవితము ఆనంద దాయకం అవుతుంది. ఈ రుద్రాక్షలను మాలగా ధరిస్తే అత్యంత సత్ఫలితాలు ఉంటాయనేది సత్యం. భగవానుడైన శివుని మెడలో రుద్రాక్షమాల ఉంటుంది. అదేగాకుండా ఆయన శిఖకి కూడా రుద్రాక్షమాలను చుట్టుకొని యుంటాడు. ఈ రుద్రాక్షలు స్త్రీ, పురుష భేదము లేకుండా ఎవరైనా ధరించవచ్చు. ఈ రుద్రాక్షలను జపమాలగా కూడా ఉపయోగిస్తారు.

1. ఏకముఖి రుద్రాక్ష

సామాన్యంగా ఈ రుద్రాక్ష దొరకదు. ఈ ఏకముఖి రుద్రాక్షను సాక్షాత్తు శివ స్వరూపముగా భావించాలి. ఇది ధరిస్తే సర్వపాపాలు నశిస్తాయి. సర్వసుఖాలు కల్గుతాయి. ధనానికి లోటు ఉండదు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. మానసిక శాంతి దైవ శాస్త్రాలలో పాండిత్యం, వాక్సుద్ధి కలుగుతుంది.

2.ద్విముఖి రుద్రాక్ష

రెండు ముఖముల రుద్రాక్ష దేవతా స్వరూపం. ఇది ధరించడం వల్ల చేసిన హింసాదోషం నశిస్తుంది. నిత్యము సంతోషంగా ఉంటారు. చిత్త, ఏకాగ్రత, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శక్తి, జాగృతి కలుగుతుంది. దీన్నే అర్ధనారీశ్వర రుద్రాక్ష అని కూడా అంటారు.

3. త్రిముఖి రుద్రాక్ష

దీనికి మూడు ముఖాలున్న రుద్రాక్ష అని పేరు. ఇది సాక్షాత్తు అగ్ని స్వరూపం. దీనిని ధరించిన వారికి అపజయం అనేది ఉండదు. స్త్రీ హత్య, శిశుహత్య, గో హత్య, మొదలగు ఘోరపాపములు కూడా నశిస్తాయి. మంచి ఉద్యోగ ప్రాప్తి కలుగు తుంది. శతృపీడ ఉండదు.

4. చతుర్ముఖి రుద్రాక్ష

దీనికి నాలుగు ముఖాలు ఉంటాయి. ఇది సాక్షాత్తు బ్రహ్మ స్వరూపం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. వేద, వేదాంగశాస్త్ర ప్రావీణ్యులుగా అవుతారు. జ్ఞాపక శక్తి పెరిగి బుద్ధి మాంధ్యము నశిస్తుంది. కంఠంలో మాధుర్యం, వశీకరణ శక్తి పెరుగుతుంది. మంచి ఆరోగ్యంగా ఉంటారు.

5. పంచముఖి రుద్రాక్ష

పంచబ్రహ్మ స్వరూపము. దీన్ని ధరిస్తే పురుష హత్యాదోషం ఇది రుద్ర స్వరూపమై యున్న కాలాగ్ని స్వరూపిణి మరియు నశించును. దీన్ని ధరిస్తే సర్వకోరికలు తీరుతాయి. కోరికలను తీర్చడంలో పంచముఖి రుద్రాక్ష అతి శక్తివంతమైనది. దీన్ని ధరించడం వల్ల విష జంతువుల భయం ఉండదు. కలియుగ ములో బ్రహ్మజ్యోతి పంచముఖి రూపములో ధరిస్తుందని పెద్దలు చెపుతారు. దుష్ట భోజన, అక్రమ లైంగిక పాపములు నశిస్తాయి.

6. షణ్ముఖి రుద్రాక్ష

ఆరు ముఖములు గల ఈ రుద్రాక్ష కార్తికేయునికి ప్రతీక.అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి లేక కుమారస్వామి స్వరూపము అంటారు. ఇది ఎంత గొప్పది అంటే దీన్ని దర్శన లేక తాకినంత మాత్రానే అష్ట ఐశ్వర్యములు కలుగునని మరియు అనారోగ్యము నశించునని అంటారు. దీన్ని ధరిస్తే మేథోసంపత్తి, ధారణాశక్తి కలుగును. బుద్ధి బలము, జ్ఞానము లభించును. మంచి వాక్పటిమ కలిగి సభలు, సమావేశాలలో మంచి వక్తలుగా పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. దీన్ని ధరించుట వల్ల పాపములు నశించును.

7. సప్తముఖి రుద్రాక్ష

ఇది ఏడు ముఖములు గలదై మన్మథునికి ప్రతీకగా ఉంటుంది. మహాలక్ష్మి కటాక్షము పొంది అనేక అమ్మవార్ల అనుగ్రహములను పొందుతారు. దీనికి స్త్రీ వశీకరణ శక్తి యుంటుంది. అకాల మృత్యువులు మరియు ఆయుధాల వలన మరణములు కలగవు. పుణ్య జీవితము గడుపుతారు.

8. అష్టముఖి రుద్రాక్ష

ఎనిమిది ముఖాలు గల్గిన ఈ రుద్రాక్ష భైరవ స్వరూపము మరియు గణపతి స్వరూపము కలది. దీనిని ధరించిన అష్టమాత్రికలు సంతోషిస్తారు. జీవితములో సమస్త కోరికలు నెరవేరుతాయి. దీనిని ధరించిన యడల ఎటువంటి మంత్ర, తంత్ర, చేతబడి, లేక బాణామతి ప్రయోగములు ఫలించవు. పిశాచ పీడ, దృష్టిదోషము లాంటి దుష్ఫలితములు కలుగవు. ముఖ్యముగా పక్షపాతపు రుగ్మతలు కలిగిన వారు దీనిని ధరిస్తే లాభము ఉంటుంది.

9. నవముఖి రుద్రాక్ష

ఇది తొమ్మిది ముఖాలు కల్గిన రుద్రాక్ష. ఇది సామాన్య ముగా దొరకదు. ఇది పవిత్రమైనది. ఇది కపిల మహర్షికి మరియు కాల భైరవునికి ప్రతి స్వరూపము. ఇవి ధరిస్తే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, శాంతశక్తి, వామశక్తి, జ్యేష్ఠశక్తి, రౌద్రశక్తి, పశ్యంతి శక్తి, అంబికా శక్తి అనే నవశక్తులు కలుగుతాయి. దీన్ని ధరిస్తే గుండె జబ్బులు రావు. ధర్మనిరతి ఉంటుంది.

10. దశముఖి రుద్రాక్ష

ఇది పది ముఖములు గల సాక్షాత్తు విష్ణు స్వరూము. దీనిని ధరించిన సర్వవాంఛలు సిద్ధించును. దీనిని చూచిన వారికి కూడా శుభఫలితాలు కలుగుతాయి. భూత, ప్రేత, పిశాచాదులు దూరంగా తొలగిపోతాయి. ఇది సామాన్యంగా దొరకదు. దశముఖ రుద్రాక్షను ధరిస్తే కార్యసిద్ధి నవగ్రహ అనుకూలతలు కలుగును.

11. ఏకాదశి ముఖి రుద్రాక్ష

పదకొండు ముఖములు కల్గిన ఈ రుద్రాక్ష సాక్షాత్తు రుద్రునికి ప్రతిరూపం. దీనిని ధరించిన మాత్రాన అన్ని పనులు సమకూరుతాయి. ముఖ్యముగా స్త్రీలకు పుత్ర సంతాన సిద్ధి కలుగుతుంది. నిత్య సౌభాగ్యముతో సంతోషముగా ఉంటారు. సిరిసంపదలు, లక్ష్మీ కటాక్షము ఉంటుంది.

12. ద్వాదశముఖి రుద్రాక్ష

పండ్రెండు ముఖములు గల ఈ రుద్రాక్ష నవగ్రహాల అధిపతి అయిన సూర్యునికి ప్రతీక. దీన్ని ధరిస్తే మంచి తేజస్సు ,వాక్సుద్ధి కలుగుతుంది. ముఖ్యముగా జ్యోతిషశాస్త్ర పండితులు దీనిని ధరించాలి. ఇది కూడా దొరకడం కష్టం. ఇంద్రుడు, వరుణుడు మొదలగు వారు దీనిని ధరిస్తారు. వ్యాధులు, రుగ్మతలు, తొలగిపోయి బుద్ధిమాంధ్యము నశించి జ్ఞానమును పొందుతారు. ఇలాగే ఇంకా త్రయోదశముఖి, చతుర్ధశిముఖి కూడా ఉంటాయి. ఇవి కూడా సాక్షాత్తు దైవ స్వరూపాలే. ఇంకొక రుద్రాక్షను గౌరీశంకర రుద్రాక్ష అంటారు. ఇవి రెండు రుద్రాక్షలు కలిసి జతగా ఉంటాయి. దీన్నే విడదీయడం వీలుపడదు. రెండు రుద్రాక్షలు కలిసియున్న ఏకరంధ్ర రుద్రాక్షగానే యుంటుంది.

ఇపుడు ఏ రుద్రాక్షను ధరించేటప్పుడు ఏ మంత్రమును ఉచ్ఛరించాలో మనం తెలుసుకుందాం.


రుద్రాక్షలు:

1. ఏకముఖి : ఓం హ్రీం నమః శివాయనమః
2. ద్విముఖీ : ఓం నమః శివాయనమః
3. త్రిముఖీ : ఓం క్లీం నమః శివాయనమః
4. చతుర్ముఖి : ఓం హీం నమః శివాయనమః
5. పంచముఖి : ఓం హీం నమః శివాయనమః
6. షణ్ముఖి : ఓం హ్రీం హుం నమః శివాయనమః
7. సప్తముఖి : ఓం హుం నమః శివాయనమః
8. అష్టముఖి : ఓం హుం నమః శివాయనమః
9. నవముఖి : ఓం హ్రీం హుం నమః శివాయనమః
10. దశముఖి : ఓం హ్రీం నమః శివాయనమః
11. ఏకాదశముఖి : ఓం హ్రీం హుం నమః శివాయనమః
12. ద్వాదశముఖి : ఓం క్రౌం క్లైం, ఓం నమః శివాయనమః

రుద్రాక్షలు ధరించే రోజున గంగా జలముతో కడిగి ధూప దీపములతో ఆరాధించి శ్రావణమాసములో సోమవారము నాడు గాని లేక మహాశివరాత్రి రోజున గాని లేక ఏ మాసములోనైనా సోమవారము నాడు మాత్రమే జప, తప, అనుష్టాదులు ముగించిన పిమ్మట ఓం నమశ్శివాయ మంత్రమును జపిస్తూ ధరించాలి.

ఇదే గాకుండా చతుర్ముఖి + షణ్ముఖలను అనగా ఈ రెండు రుద్రాక్షలను ఎర్రటి పట్టుదారములో గుచ్చి పిల్లలకు కట్టినచో దృష్టి దోషము తగులదు.

త్రిముఖి రుద్రాక్షను స్త్రీల మంగళ సూత్రములో ధరించుట వల్ల దీర్ఘకాల మాంగల్య సౌభాగ్యము కల్గుతుంది.

పంచముఖి రుద్రాక్షను అరగదీసి విషజంతువులు కుట్టిన చోట లేపనము చేస్తే ఆ బాధ ఉపశమిస్తుంది.

షణ్ముఖి రుద్రాక్షను తేనెలో అరగదీసి ఆ గంధమును రోజూ ఉదయము, సాయంత్రము సేవించినచో స్త్రీల ఋతు దోషములు పోయి గర్భాశయము శుభ్రపడును.

పంచముఖి రుద్రాక్షను తులసీ రసములో అరగదీసి ఆ గంధమును సేవించినచో సమస్త కఫ దోషములు హరించి పక్షవాతము వారికి చాలా మేలు కలుగును.

రుద్రాక్షల విలువ అంతులేనిది. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే చెక్కిన విగ్రహాల మీద ఉన్న ఋషి బొమ్మకు మెడలో రుద్రాక్ష కనిపిస్తుంది. అలాగే ఏ గుడి శిల్పము మీద ఏ ఋషి లేక నారద మహర్షి. లేక శిల్పాలు, దిక్పాలకులు చూస్తే వారి మెడలో రుద్రాక్షలు కన్పిస్తాయి. అంటే రుద్రాక్ష మహత్యము మన పూర్వులు ఎప్పుడో గ్రహించారు. రుద్రాక్షలో ఎన్ని ముఖాలు ఉంటే దానిలో అన్ని బీజాంకురాలు ఉంటాయని మనం గ్రహించాలి. కాబట్టి రుద్రాక్ష విలువలు వారి అంకురముల మహిమ వలన భక్తి, జ్ఞానము, విద్య, సౌభాగ్యము వస్తాయి. ముఖ్యంగా విద్యార్థులు చతుర్ముఖి రుద్రాక్షను ధరించడం వల్ల చాలా శుభ ఫలితాలను పొందుతారు.

 

Exit mobile version