మహిళా క్రికెటర్లకు బీసీసీఐ (BCCI) గుడ్ న్యూస్ అందించింది. సీనియర్ క్రికెటర్లకు కాంట్రాక్టులను ప్రకటిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. టీమిండియా నుంచి 17 మంది ఉమెన్ క్రికెటర్లు కాంట్రాక్టులు పొందిన వారిలో ఉన్నారు. కాగా, ఆయా క్రికెటర్లకు వేతనాలు ఎంత చెల్లిస్తారనే విషయం మాత్రం బీసీసీఐ బహిర్గతం చేయకపోవడం గమనార్హం. మూడు గ్రేడ్‌లకు సంబంధించి మాత్రమే పేర్లను బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైఎస్ కెప్టెన్ స్మృతి మంధాన, ఆల్ రౌండర్ దీప్తి శర్మ గ్రేడ్-ఏ కాంట్రాక్టును చేజిక్కించుకుకన్నారు.
అయితే, కేవలం ముగ్గురికి మాత్రమే ఏ గ్రేడ్ ఇవ్వడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. గత ఏడాది కాంట్రాక్టు ప్రకారం చూస్తే 50 లక్షల రూపాయల వార్షిక వేతనం చెల్లించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, ఈ సారి ఆ మొత్తం కాస్త పెరిగే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఏ గ్రేడ్ తర్వాత గ్రేడ్-బీ విషయానికి వస్తే.. ఈ కాంట్రాక్టులో ఐదుగురు ప్లేయర్లను బీసీసీఐ ఎంపిక చేసింది. టాప్ పేసర్‌గా రాణిస్తున్న రేణుకా సింగ్, బ్యాటింగ్‌లో రాణిస్తున్న జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, రిచా ఘోష్, స్పిన్నర్ రాజేశ్వరీ గైక్వాడ్‌లకు గ్రేడ్-బీ దక్కింది.
గ్రేడ్-బీలో గత ఏడాది ఉన్న క్రీడాకారులకు 30 లక్షల రూపాయలు అందించారు. ఈ మొత్తం కూడా ఈ ఏడాది కాంట్రాక్టు దక్కించుకున్న వారికి పెరిగే చాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక ఆఖరిది, గ్రేడ్-సీ కాంట్రాక్టులోకి 9 మందిని బీసీసీఐ తీసుకుంది. వీరిలో మన తెలుగు క్రికెటర్లు ఉండటం విశేషం. సబ్బినేని మేఘన, అంజలి సర్వాని.. వీరిద్దరూ మూడో గ్రేడ్‌లో స్థానం దక్కించుకున్నారు. మూడో గ్రేడ్ దక్కించుకున్న మిగతా వారిలో మేఘనా సింగ్, దేవికా వైద్య, పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా, రాధాయాదవ్, హర్లీన్ డియోల్, యస్తికా భాటియా ఉన్నారు.
మూడో గ్రేడ్ సాధించుకున్న వారికి గత ఏడాది ఫీజు కింద 10 లక్షల రూపాయల వార్షిక వేతనం అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పురుషులు, మహిళల మ్యాచ్ పీజులను సమానంగా చేస్తూ బీసీసీఐ ఇటీవలే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పురుష క్రికెటర్లకు ఫీజు ఎక్కువగా ఉందని, మహిళా క్రికెటర్లకు కూడా సేమ్ ఫీజు ఉండాలనే డిమాండ్లు వచ్చిన నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, వేతనాల్లో మాత్రం ఇరువురికీ వ్యత్యాసం కనిపిస్తోంది. పురుష క్రికెటర్లలో ఏ ప్లస్ కేటగిరీ క్రీడాకారులు సుమారు 7 కోట్ల రూపాయల వరకు వేతనం పొందుతున్నారు.
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE