Telugu Flash News

TSPSC paper leak : పేపర్‌ లీకేజీకి బాధ్యత వహించి కేటీఆర్ రాజీనామా చేయాలి: బండి సంజయ్‌ డిమాండ్‌

TSPSC group 1 main exam question paper pattern released

TSPSC group 1 main exam question paper pattern released

తెలంగాణలో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పేపర్‌ లీకేజీ (TSPSC paper leak) వ్యవహారం రాజకీయ మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ (KTR) హస్తం ఉందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. పేపర్‌ లీకేజీకి మంత్రి కేటీఆర్ బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ బీజేపీ స్టేట్‌ చీఫ్‌ బండి సంజయ్‌ (bandi sanjay) డిమాండ్‌ చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ నోరు విప్పలేదేమని బండి సంజయ్‌ ప్రశ్నించారు. సీఎం తనయుడు కేటీఆర్ మాత్రమే స్పందిస్తున్నారని, ఇందులో కచ్చితంగా కేటీఆర్ పాత్ర ఉందని ఆరోపణ చేశారు.

పేపర్‌ లీకేజీని నిరసనిస్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద బీజేపీ చేపట్టిన మా నౌకరీలు మాగ్గావాలె.. దీక్షలో బండి సంజయ్‌ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన బండి.. పేపర్‌ లీకేజీ కేసులో బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చే ధైర్యం ప్రత్యేక దర్యాప్తు బృందానికి లేదా? అని ప్రశ్నించారు. నయీం కేసులో వేసిన సిట్‌ ఏమైందో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. డ్రగ్స్‌ కేసు, మియాపూర్ భూములపై వేసిన సిట్‌ ఏమైందని ప్రశ్నించారు. పేపర్‌ లీకేజీ వ్యవహారంపై పెద్ద వాళ్లను వదిలేసి చిన్నోళ్లను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు.

క్వశ్చన్‌ పేపర్‌ లీక్‌ అవడం అనేది సాధారణమే అని మాట్లాడిన బీఆర్ఎస్ మంత్రికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని బండి ప్రశ్నలు గుప్పించారు. పేపర్‌ లీకేజీ అంశాన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదని, ప్రభుత్వంపై పోరాడుతామని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. కేటీఆర్ రాజీనామా చేసి తీరాలని, 30 లక్షల మంది నిరుద్యోగ యువతకు తక్షణమే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసును సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. పరీక్షలు రాసి నష్టపోయిన యువతకు ప్రభుత్వం రూ. లక్ష చొప్పున భృతి ఇవ్వాలన్నారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ ఘటనపై భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సీహెచ్‌ విఠల్‌ నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నియమిస్తామని బండి సంజయ్‌ వెల్లడించారు. రేపటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు తిరిగి స్టూడెంట్లతో అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. నిజాలకు తెలుసుకొని ప్రజలకు వివరించేందుకు ప్రయత్నిస్తామని బండి సంజయ్‌ తెలిపారు. ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు 10 ఉమ్మడి జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్‌ను భారీ ఎత్తున చేపడతామన్నారు. సీఎం కేసీఆర్ గడీలు బద్దలయ్యేలా తెలంగాణలో నిరుద్యోగ మార్చ్‌ ఉంటుందని బండి స్పష్టం చేశారు.

 

Exit mobile version