Balagam: జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం బలగం. ఈ సినిమా థియేటర్స్‌లో సంచలనాలు సృష్టించింది. ప్రస్తుతం ఓటీటీలోను దూసుకుపోతుంది. ఇందులో క్లైమాక్స్ సాంగ్.. తోడుగా మాతోడుండి అనే పాట సినిమాకి ఆయువు పట్టుగా మారింది. అంతేకాదు ఈ పాట విని ప్రతి ఒక్కరు కన్నీటి పర్యంతం అయ్యారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులు ఈ పాట పాడి అందరిని మెప్పించారు.
అయితే తాజాగా మొగిలయ్య తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాడు. కరోనా సమయంలో ఆయన రెండు కిడ్నీలు ఫెయిల్ కావడంతో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఈ క్రమంలో బీపీ, షుగర్ పెరగడంతో.. ఆయన కళ్లపై ఆ ఎఫెక్ట్ పడింది. ప్రస్తుతం ఆయన రెండు కళ్లు కనిపించడం లేదు. డాక్టర్ మల్లేశం ఆధ్వర్యంలో ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ ఉచితంగా చేస్తున్నా.. బాధితులు వారానికి మూడుసార్లు దుగ్గొండి నుంచి వరంగల్ సంరక్ష ఆస్పత్రికి రావడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు ఆపరేషన్‌లు చేస్తే.. కంటి చూపు వచ్చే అవకాశం ఉందని.. ఇందుకు మరో 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో వారు సాయం కోరుతున్నారు.