Telugu Flash News

Street Dogs | మూగజీవాలపై మారణహోమం: 21 కుక్కలు మృతి!

Mahbubnagar dogs killed

మహబూబ్ నగర్ జిల్లాలోని అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో అర్ధరాత్రి దుండగులు వీధికుక్కలపై (Street Dogs) విచక్షణారహితంగా కాల్పులు జరిపి, 21 కుక్కలను మట్టుబెట్టారు. ఈ దారుణం గ్రామంలో భయాందోళనకు గురిచేసింది.

గుర్తు తెలియని వ్యక్తులు శనివారం అర్ధరాత్రి 2 గంటల తర్వాత గ్రామంలోకి చొరబడి, కనిపించిన కుక్కలపై తుపాకీతో కాల్పులు జరిపారు. తుపాకీ చప్పుళ్ళు, కుక్కల అరుపులతో గ్రామస్థులు భయాందోళనకు గురై, ఇళ్ల నుంచి బయటకు రాలేదు.

ఉదయం లేచి చూసేసరికి గ్రామంలో 21 కుక్కలు మృత్యువాత పడ్డాయి. మరికొన్నింటికి తీవ్రగా గాయాలు అయ్యాయి. మొత్తం 30 కుక్కలపై కాల్పులు జరిపినట్లు గుర్తించారు.

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం, వెటర్నరీ డాక్టర్లు మరణించిన కుక్కలను పరిశీలించారు. కుక్కల శరీరాల్లో బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. కాల్పులకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరించారు.

ఈ దారుణానికి కారణం ఏమిటో ఇంకా తెలియరాలేదు. గ్రామంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితులు ఎవరో గుర్తించడం కష్టంగా మారింది. నాటు తుపాకీని ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version