Ind vs Ban: తాము మ్యాచ్‌ని అంత తేలిగ్గా వదులుకునే రకం కాదని బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మరోసారి నిరూపించింది. ఏకపక్షంగా సాగుతున్న మ్యాచ్‌ను బ్యాట్‌తో, బంతితో రాణించి మలుపు తిప్ప భారత్ కి మూడు చెరువుల నీళ్లు తాగించింది. మీర్‌పూర్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజు ఉదయం తన రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లా జట్టు 6 వికెట్లు కోల్పోయిన సమయానికి కేవలం 26 పరుగుల ఆధిక్యంతో ఉంది. మరో 25 పరుగుల లోపే చాప చుట్టేస్తుందని భావించిన తరుణంలో నూరుల్ (31), లిట్టన్ దాస్ (73) ఎదురుదాడికి దిగడంతో తమ జట్టుకు 144 పరుగుల ఆధిక్యాన్ని ఇచ్చారు.
బంగ్లాదేశ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఫస్ట్ ఇన్నింగ్స్ 227 పరుగులను కలుపుకొని భారత్‌కు 144 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో దాటిగా ఆడి 314 పరుగులు చేసిన భారత్.. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఇట్టే చేధిస్తుందని అభిమానులు భావించగా బంగ్లాదేశ్ స్పిన్నర్లు మరోసారి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. 12 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోగా, . 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత టాప్ ఆర్డర్‌లో కేఎల్ రాహుల్ (2), ఛటేశ్వర్ పుజారా (6), శుభ్‌మన్ గిల్ (7), విరాట్ కోహ్లీ (1) తక్కువ స్కోరు చేసి పెవిలియన్ చేరారు.ఈ రోజు ఉదయం ఉనద్కత్, అక్షర్ పటేల్, పంత్ వెంటవెంటనే వికెట్స్ చేజార్చుకోగా భారత్ కి లక్ష్యాన్ని చేధించడం కష్టంగా మారింది.
అయితే ఇక భారత్ ఓటమి ఖాయం అని అందరు భావిస్తున్న సమయంలో శ్రేయాస్ అయ్యార్(29), అశ్విన్(42) 71 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో భారత్ 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రెండు టెస్టుల్లోనూ బంగ్లాదేశ్ పై విజయం సాదించడం ద్వారా.. సీరిస్ ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా, పుజారా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నారు. ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిదీ హసన్ మిరాజ్ 5 వికెట్లు తీశాడు. షకీబ్ అల్ హసన్ రెండు వికెట్లు వికెట్ తీశాడు.