Telugu Flash News

Calcutta High Court: కలకత్తాలో కలకలం.. 36 వేల మంది టీచర్లను తొలగించాలన్న హైకోర్టు

Calcutta High Court: కలకత్తా హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. టీచర్ల నియామకాల విషయమై కుంభకోణాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ మేరకు కలకత్తా హైకోర్టు స్పందించింది. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్లలో గతంలో నియమితులైన 36 వేల మంది టీచర్ల నియామకాలను రద్దు చేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సంచలన ప్రకటనతో రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. నియామకాల ప్రక్రియ జరిగిన సందర్భంలో విధి విధానాలు సక్రమంగా పాటించలేదని హైకోర్టు పేర్కొంది.

ఈ కారణంగా వారి నియామకాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అభిజిత్‌ గంగోపాధ్యాయ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో 2016 సంవత్సరంలో నియమితులైన సుమారు 36 వేల మంది ఉపాధ్యాయులు ఎటువంటి శిక్షణ తీసుకుండానే నేరుగా టీచర్లుగా నియమితులయ్యారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కారణం చేత వీరి నియామకాలు చెల్లవని జస్టిస్‌ గంగోపాధ్యాయ స్పష్టం చేశారు.

ఈ మేరకు సుమారు 17 పేజీలతో కూడిన తీర్పును వెలువరించారు. రాబోయే మూడు నెలల్లో ఖాళీలు ఏర్పడిన పోస్టులను భర్తీ చేయాలని మమతా బెనర్జీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయాన తొలగించిన టీచర్లు నాలుగు నెలలపాటు పని చేసుకొనే సౌలభ్యాన్ని జస్టిస్‌ గంగోపాధ్యాయ కల్పించారు. అయితే, పారా టీచర్లకు ఇచ్చే జీతానికే వీరు పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్‌లో ఈ తరహా అవినీతిని తాను మునుపెన్నడూ చూడలేదంటూ జస్టిస్‌ గంగోపాధ్యాయ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఈ తీర్పు నేపథ్యంలో మమతా బెనర్జీ సర్కార్‌ ఎలా ముందుకెళ్తుందని ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏకంగా 36 వేల మంది టీచర్లను తొలగించడం సామాన్యమైన విషయం కాదని, వారంతా ఇప్పుడు రోడ్డున పడితే పరిస్థితి ఏంటని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అది కూడా సుమారు ఏడేళ్ల పాటు ఉద్యోగాలు చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఉపాధ్యాయులు కారు.. ఇంటికి వెళ్లిపోండని చెబితా ఆ కుటుంబాల పరిస్థితి ఏంటని పలువురు ప్రశ్నలు వేస్తున్నారు.

స్కూల్‌ జాబ్‌ ఫర్‌ క్యాష్‌ స్కామ్‌గా పేర్కొనే ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి పార్థా ఛటర్జీ, ప్రైమరీ ఎడ్యుకేషన్‌ మాజీ ఛైర్మన్‌ మాణిక్‌ భట్టాచార్య అరెస్టు అయ్యారు. మరోవైపు ఈ తీర్పుపై ప్రభుత్వం స్పందించింది. సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలపై నిపుణుల సలహా తర్వాత సవాల్‌ చేస్తామని తెలిపింది.

Read Also : Karnataka Election Results: కర్ణాటకలో బీజేపీ మతం కార్డు పని చేయలేదా? ఓటమికి కారణాలెన్నో!

Exit mobile version