AP News : ఇటీవల ఏపీలోని కందుకూరులో ప్రతిపక్ష నేత చంద్రబాబు నిర్వహించిన సభలో ప్రమాదం జరిగి ఎనిమిది మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అనంతరం గుంటూరులో నిర్వహించిన సభలోనూ అపశృతి చోటు చేసుకొని తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందారు. ఈ రెండు ఘటనలతో ఏపీ సర్కార్ సీరియస్ అయ్యింది. సభలు, ర్యాలీలు రోడ్లపై నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జగన్ సర్కార్. అయితే, ఈ ఉత్తర్వులపై చంద్రబాబు మండిపడుతున్నారు. తానేమైనా సంఘవిద్రోహశక్తినా అని ప్రశ్నిస్తున్నారు.
తాజాగా పోలీసుల ఆంక్షలను ధిక్కరిస్తూ టీడీపీ అధినేత కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా పోలీసులపై కూడా చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసులకు, టీడీపీ శ్రేణులకు తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకున్నాయి. అనంతరం టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో చంద్రబాబు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్న తనను ప్రభుత్వం అక్రమంగా అడ్డుకుంటోందని మండిపడ్డారు.
కందుకూరు సభలో ప్రభుత్వమే కుట్ర చేసి ఎనిమిది మంది అమాయకులను పొట్టనబెట్టుకుందని చంద్రబాబు సంచలన ఆరోపణ చేశారు. తాను కందుకూరులో భారీ సభ పెడితే కనీసం 20 మంది కూడాపోలీసులు రాలేదని, కానీ కుప్పంలో తన పర్యటనను అడ్డుకొనేందుకు ఏకంగా 20 వేల మంది పోలీసులు రావడం దేనికి సంకేతమని చంద్రబాబు ప్రశ్నించారు. కందుకూరులో కుట్రలు చేసి ప్రజలను చంపేశారని, తిరిగి తనపైనే కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.
పరిహారం ఇచ్చినా అరెస్టు చేస్తారా?
ఒక ప్రవాసాంధ్రుడు అమెరికా వెళ్లి సంపాదించి సేవ చేయాలని గుంటూరుకు వస్తే.. అతడిపై కేసులు పెట్టారని చంద్రబాబు వాపోయారు. 5 కోట్ల రూపాయలతో పేదలకు సాయం చేయాలని తలపెడితే పోలీసులు సరైన రక్షణ ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. ఘటనలో చనిపోయిన వారికి ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇచ్చినా ఆ ఎన్‌ఆర్‌ఐని అరెస్టు చేయడం హేయమన్నారు. వేలాది మంది పోలీసులతో తనను అడ్డుకోవడానికి తానేమైనా దాక్కున్న నక్సలైటునా? అని ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు.
also read:
Telangana News : బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. 45 మంది ప్రయాణికులను కాపాడి తాను కన్నుమూశాడు!
Veera Simha Reddy Movie Trailer | ‘వీరసింహారెడ్డి’ ట్రైలర్