ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాజాగా ఢిల్లీ పర్యటనకు (AP CM Delhi Tour) బయల్దేరి వెళ్లారు. దీంతో రాష్ట్రంలో రాజకీయాలు ఎటు తిరుగుతాయో అనే ఆసక్తి సర్వతా నెలకొంది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. పైకి మాత్రం ముందస్తు ముచ్చటే లేదని వైసీపీ కీలక నేతలు సంకేతాలిస్తున్నా.. లోపల మాత్రం ముందస్తుకు వెళ్తేనే మంచిదన్న అభిప్రాయం అధికార పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉందని విశ్లేషణలు వస్తున్నాయి.
ఢిల్లీ పర్యటన నిమిత్తం ఏపీ సీఎం జగన్.. మంగళవారం సాయంత్రం బయల్దేరారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన నేతలు మాత్రం రాష్ట్రాభివృద్ధే ప్రధాన అజెండాగా జగన్ ఢిల్లీకి వెళ్తున్నారని చెబుతున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, ఇంకా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను ప్రధాని మోదీతో భేటీ అయ్యి జగన్ వివరిస్తారని చెబుతున్నారు. అయితే, జగన్ మదిలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఉందని, అందుకే మోదీతో సమావేశమైన ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
రేపు మధ్యాహ్నం ప్రధాని మోదీతో జగన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇప్పటికే ఈ నెల మొదటి వారంలో జీ20 సదస్సుకు సంబంధించిన సన్నాహక సమావేశంలో జగన్ పాల్గొన్నారు. తర్వాత కొత్త సంవత్సరం రాబోతున్న తరుణంలో జగన్ ఢిల్లీకి వెళ్లడంపై ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఇక ఏపీలో సంక్షేమ పథకాల అమలు విషయంలో జగన్ కాంప్రమైజ్ కావడం లేదు. ఎన్ని అప్పులు చేసి అయినా సరే.. తాను చేపట్టిన ప్రతి పథకంలో లబ్ధిదారులకు నగదు జమ కావాల్సిందేనని ఆయన పట్టుదలతో ఉన్నారు.
సంక్షేమ పథకాలే గెలిపిస్తాయా?
ఏపీలో సంక్షేమం మాత్రమే తనను గెలిపిస్తాయని జగన్ ధీమాగా ఉన్నారు. జగన్‌కు అటు కేంద్రం కూడా సానుకూలంగా ఉంటూ అప్పులు, నిధులు ఇస్తుండడంతో జగన్‌కు కాస్త బలం పెరుగుతూనే ఉంది. అయితే, నిధులు ఇచ్చేందుకు ఎన్నికల ముంగిట కేంద్రం కొర్రీలు పెడితే పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితే వస్తే.. ప్రభుత్వాన్ని రద్దు చేసి జగన్ ఎన్నికలకు వెళ్లే చాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టీడీపీ మాత్రం.. జగన్‌పై ఉన్న ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. అది ఎంత మాత్రం విజయవంతం అవుతుందనేది వేచి చూడాల్సిందే.
మరిన్ని వార్తలు చదవండి :
తెలంగాణ వార్తలు | జాతీయ వార్తలు | సినిమా వార్తలు | అంతర్జాతీయ వార్తలు | ఆరోగ్య చిట్కాలు