Telugu Flash News

Mahanadu: అట్టహాసంగా మొదలైన మహానాడు.. సీఎం జగన్‌పై బాబు విసుర్లు

Mahanadu: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమం నేడు అట్టహాసంగా ప్రారంభమైంది. రాజమహేంద్రవరం ఇందుకు వేదిక అయ్యింది. నగరమంతా పసుపు జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయింది. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా టీడీపీ కార్యకర్తలు తరలి వచ్చారు. వారి కోసం ప్రత్యేకంగా బస్సులు, ఇతర వాహనాలను పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసింది. తొలి రోజు కావడంతో జన సమీకరణ కూడా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించారు.

మహానాడులో భాగంగా మొదటి రోజు ప్రతినిధులు భేటీ నిర్వహించారు. 35 వేల మందిదాకా కార్యకర్తలు హాజరైనట్లు అంచనా వేశారు. రాజమహేంద్రవరంలోని హోటళ్లన్నీ తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు బుక్‌ చేసుకున్నారు. ఇతర గెస్ట్‌ హౌస్‌లు కూడా అన్నీ హౌస్‌ఫుల్‌ అయినట్లు తెలుస్తోంది. మహానాడుకు హాజరైన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు.. మొదట వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ జెండాను ఆవిష్కరణ చేశారు.

ఇక చంద్రబాబు ప్రసంగిస్తూ.. యథావిధిగా సీఎం జగన్‌పై సెటైర్లు, విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. ఈసారి మహానాడుకు ఓ ప్రత్యేకత ఉందన్న చంద్రబాబు.. ఎన్నో మహానాడులను చూశానుగానీ.. ఇంతకుముందెప్పుడూ కనిపించని ఉత్సాహం ఇప్పుడు కనబడుతోందన్నారు. ఎన్టీఆర్‌ శత జయంతిని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించుకుంటున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా 100 ప్రదేశాల్లో ఏ నాయకుడికీ జరగనంత గొప్పగా శతజయంతిని చేశామని పేర్కొన్నారు. క్రీస్తు శకం మాదిరిగా ఎన్టీఆర్‌ శకం మొదలవుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఆర్బీఐ ఉపసంహరించుకున్న రూ.2 వేల రూపాల నోట్లన్నీ సీఎఓం జగన్‌ వద్దే ఉన్నాయని చంద్రబాబు సెటైర్లు వేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సైకిల్‌ సిద్ధంగా ఉందని, రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని వ్యాఖ్యానించారు. ఆ రాయి పేదలకు తగలకుండా అడ్డం పడతామని పేర్కొన్నారు. పేదల సంక్షేమం.. రాష్ట్రాభివృద్ధికి ఏం చేయాలో తెలుగుదేశం పార్టీకి తెలుసన్నారు. సంపద సృష్టిస్తాం.. పేదలకు పంచుతామని చంద్రబాబు పేర్కొన్నారు. ఒక్క చాన్స్‌ అంటూ జగన్‌ ఓట్లు అడిగారని, దేశంలో పేదలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీ అని విమర్శించారు. జగన్‌ 4 ఏళ్లలో రూ.2.27 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

Read Also : Chandrababu Naidu : బాబాయి హత్య కేసులో జగన్‌ దొరికిపోయారు.. కన్నా చేరిక సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యలు!

Exit mobile version