Telugu Flash News

Tirumala: తిరుమలలో కలకలం.. ఆనంద నిలయం దృశ్యాలు చిత్రీకరించిన భక్తుడు

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇల వైకుంఠం తిరుమలలో మరోసారి భద్రతాలోపం వెలుగు చూసింది. ఇటీవలో డ్రోన్లు తిరుమల క్షేత్రంపై అక్రమంగా తచ్చాడిన విషయం మరువక ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. తాజాగా ఓ భక్తుడు తన సెల్‌ఫోన్‌తో ఆలయం ఆవరణలోకి ప్రవేశించాడు. అనంతరం ఆలయంలోని ఆనంద నిలయం ప్రాంతమంతా చిత్రీకరించాడు. ఆ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలోకి ప్రవేశించే సమయంలోనే దాదాపు మూడు సార్లు తనిఖీలు ఉంటాయి. భద్రతా సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉంటారు. అయితే గుర్తు తెలియని భక్తుడు ఈ తనిఖీలన్నీ దాటుకొని సెల్‌ఫోన్‌ను తీసుకొని ఆలయంలోపలికి ప్రవేశించడం గమనార్హం. అంతేకాదు.. ఆనంద నిలయంలోని దృశ్యాలను చిత్రీకరించినా టీటీడీ భద్రతా సిబ్బంది పసిగట్టలేకపోయారు. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనపై తిరుమల తిరుమతి దేవస్థానం విజిలెన్స్‌ అధికారి బాలిరెడ్డి స్పందించారు. సీపీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. మరోవైపు తిరుమల ఆనంద నిలయం దృశ్యాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వ్యక్తిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ చీఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (సీవీఎస్‌ఓ) నరసింహ కిషోర్‌ తెలిపారు. తిరుమల తిరుమతి దేవస్థానం నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంలోకి ఎలక్ట్రానిక్‌ వస్తువులు తీసుకెళ్లడం, వీడియో చిత్రీకరించడం నేరం.

ఈ విషయాలు భక్తులందరికీ తెలుసని ఆయన తెలిపారు. ఈ ఘటనపై సీవీఎస్‌ఓ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆదివారం రాత్రి తిరుమలలో ఉరుములతో కూడిన వర్షం కురిసిందన్నారు. సుమారు రెండు గంటల పాటు కరెరంటు సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. ఈ క్రమంలోనే ఆ భక్తుడు లోపలికి ప్రవేశించి అప్పటికే తన వెంట తెచ్చుకున్న పెన్‌ కెమెరాతో వీడియోను షూట్‌ చేశాడని అనుమానిస్తున్నట్లు తెలిపారు. పవిత్రమైన ఆలయంలో నిబంధనలు అందరికీ తెలుసని, అయినప్పటికీ ఇలా చేయడం ఆక్షేపణీయం అన్నారు. సీసీ కెమెరాల్లో చూసి చర్యలు తీసుకోవాల్సిందిగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆదేశించారని, ఆ మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

Read Also : Jogi Naidu: ఝాన్సీని, న‌న్ను క‌ల‌పడానికి చిరంజీవి ఎంతో ప్ర‌య‌త్నించారు.. జోగినాయుడు స్ట‌న్నింగ్ కామెంట్స్

Exit mobile version