Andhra Pradesh: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణపై ఆంధ్రప్రదేశ్‌లో ఉత్కంఠ వీడటం లేదు. సీబీఐ అధికారులు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవినాశ్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో అవినాశ్ తల్లి అనారోగ్యం కారణంగా ఆస్పత్రిపాలు కావడం తెలిసిందే. అయితే, తన తండ్రి జైలులో ఉన్నాడని, తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్న అవినాశ్.. సీబీఐ విచారణకు పది రోజులు గడువు కావాలని కోరారు. ఈ మేరకు సీబీఐకి లేఖ రాశారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన మీడియా చానళ్లు, పత్రికల్లో అవినాశ్ విచారణ, అరెస్టుపై జోరుగా కథనాలు ప్రసారం, ప్రచురితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు స్పందించారు. అవినాశ్ సీబీఐ విచారణతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధమని సజ్జల ప్రశ్నించారు. ఎల్లో మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందంటూ పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో జీవో 176 తీసుకొచ్చి సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా చేసిన విషయాన్ని మర్చిపోరాదన్నారు.
అవినాష్ రెడ్డి గురించి ఎల్లో మీడియా ఇష్టానుసారం రాస్తోందని పేర్ని నాని అభ్యంతరం తెలిపారు. మనోడు ఉంటే ఒకలా .. లేకుంటే మరోలా రాయడం ఎల్లో మీడియా పని అని విమర్శించారు. గుండెజబ్బు వచ్చిన తల్లి కోసం ఎంపీ అవినాష్ రెడ్డి వెసులుబాటు అడిగారని, తల్లికి అనారోగ్యంగా ఉంటే అవినాష్ వెళ్లకూడదా? అని ప్రశ్నించారు. పిలిచిన ప్రతిసారీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారని గుర్తు చేశారు. అవినాష్ ఎక్కడికైనా పారిపోయాడా అని ప్రశ్నించారు.
తల్లి ఆరోగ్యం సీరియస్‌గా ఉంటే ఇష్టమొచ్చినట్లుగా రాతలు, ప్రచారాలు చేస్తున్నారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస మానవత్వం లేకుండా ఎల్లో మీడియా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. సీఎం జగన్‌ను చూస్తే వీరందరికీ కడుపు మంట అని, మచిలీపట్నం సభపై తప్పుడు వార్తలు రాశారని మండిపడ్డారు. ఖాళీ కుర్చీలకు స్పీచ్ ఇచ్చిన ఘనుడు చంద్రబాబేనని పేర్నినాని సెటైర్లు వేశారు. చంద్రబాబు సభలకు జనం రాకుంటే అద్భుతంగా జనం వచ్చారని రాస్తారని, జగన్ సభకు భారీగా జనసందోహం హాజరైనా తప్పుడు రాతలు రాస్తారని పేర్ని నాని విమర్శించారు.
Read Also : IAS Success Story: ఆ అలవాట్లే నన్ను ఐఏఎస్ అయ్యేలా చేశాయి..