Telugu Flash News

Amritpal Singh Arrest : 35 రోజులుగా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన అమృత్‌పాల్‌ సింగ్‌ అరెస్ట్‌

Amritpal singh arrest

ఖలిస్తానీ సానుభూతిపరుడు, వారిస్‌ పంజాబ్‌ దే చీఫ్‌ అమృత్‌పాల్‌ సింగ్‌ (Amritpal Singh) ను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 35 రోజులుగా దొరక్కుడా ముప్పుతిప్పులు పెడుతున్న అమృత్‌పాల్‌ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం మోగా జిల్లాలోని ఓ గురుద్వార్‌లో అమృత్‌పాల్‌ సింగ్‌ ఉన్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో చాకచక్యంగా వ్యవహరించి అతడిని నలువైపులా చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. ఎట్టకేలకు అతడు చిక్కడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

మరోవైపు అమృత్‌పాల్‌ సింగ్‌ అరెస్టుపై మరో వాదన కూడా వినిపిస్తోంది. తనంతట తానే పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు చుట్టుముట్టిన సమయంలో కనీసం ప్రతిఘటించే ప్రయత్నం కూడా చేయలేదని అక్కడున్న వారు చెబుతున్నారు. అమృత్‌పాల్‌ సింగ్‌కు లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదని ఓ పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు. అతనిపై ఎన్‌ఎస్‌ఏ వారెంట్ జారీ అయిందని ఆయన తెలిపారు. భద్రతా కారణాల నేపథ్యంలో అమృత్‌పాల్‌ సింగ్‌ను పంజాబ్‌ పోలీసులు అసోంలోని డిబ్రూగఢ్‌ జైలుకు తరలించారు.

అమృత్‌పాల్‌ సింగ్‌ అనుచరులు ఇప్పటికే అరెస్టయ్యారు. వారిని కూడా భద్రతా కారణాలతో మరో రాష్ట్రానికి తరలించినట్లు తెలుస్తోంది. అమృత్‌పాల్‌కు అత్యంత సన్నిహితుడైన పాపల్‌ ప్రీత్‌ సింగ్‌ను కూడా అసోంలోని డిబ్రూగఢ్‌ సెంట్రల్‌ జైల్లో ఉంచారు. అమృత్‌పాల్‌ సింగ్‌ను త్వరలోనే అరెస్టు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శనివారం వ్యాఖ్యానించగా.. మరుసటి రోజే పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. గతంలో అతడు స్వేచ్ఛగా తిరిగాడని, ఇప్పుడా పరిస్థితి లేదని అమిత్‌ షా పేర్కొన్నారు. అమిత్‌ షా వ్యాఖ్యల తర్వాత వెంటనే పోలీసులు చర్యలు తీసుకున్నారు.

రెచ్చగొట్టే ప్రసంగాలతో యువతను పెడదోవపట్టిస్తున్న అమృత్‌పాల్‌ సింగ్‌.. మార్చి 18 నుంచి పరారీలో ఉన్నాడు. అప్పటి నుంచి వేలాది మంది పోలీసులు అతడి కోసం గాలింపు కొనసాగించారు. వేషాలు, వాహనాలు మార్చుకుంటూ ఎప్పటికప్పుడు ఎవరికంటా పడకుండా తప్పించుకు తిరుగుతూ వచ్చాడు. అతడి అనుచరులను ఒక్కొక్కరుగా అందరినీ అరెస్టు చేయడంతో అమృత్‌పాల్‌ సింగ్‌కు లొంగిపోవడం ఒక్కటే మార్గమైంది. అతడి సన్నిహితుడు పాపల్‌ ప్రీత్ సింగ్‌ను ఏప్రిల్ 11న అరెస్టు చేశారు. ఏప్రిల్‌ 15న జోగా సింగ్‌ను, ఏప్రిల్‌ 18న మరో ఇద్దరు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు.

also read :

Sarath Babu: సీరియస్‌గా ఉన్న శరత్ బాబు హెల్త్ కండీష‌న్… వెంటిలేట‌ర్‌పై చికిత్స‌..

rushika raj : బాహుబలిలో అనుష్క డూప్‌గా ఈ హీరోయిన్ నటించిందా?

Exit mobile version