Telugu Flash News

Amit Shah : బీజేపీ శ్రేణులపై అమిత్‌ షా ఆగ్రహం.. బైకులు తప్ప జనాలెక్కడ?

amit shah

amit shah

Amit Shah : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతలు జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. ఈనెల 10వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 13వ తేదీన కౌంటింగ్‌ అనంతరం ఫలితాలు వెలువడతాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీల తరఫున ఇప్పటికే జోరుగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. ప్రచారంలో భాగంగా బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా బెళగావిలో రోడ్‌ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తల కంటే ఎక్కువగా ద్విచక్రవాహనాలే దర్శనమిచ్చాయి. దీంతో అమిత్‌ షా దీనిపై రియాక్ట్‌ అయ్యారు.

రోడ్‌ షోలో జనం తక్కువగా కనిపించే సరికి అమిత్‌ షాకు కోపం వచ్చింది. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జనం కంటే బైకులే ఎక్కువగా ఉన్నాయి ఏంటి? అని మొహం మాడ్చుకున్నారు. ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అయ్యింది. ఇప్పటికే పలు సర్వేల్లో కర్ణాటక కాంగ్రెస్‌దేనని తేలింది. తాజాగా ఏబీపీ ఆధ్వర్యంలో జరిపిన సర్వేలోనూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని తేల్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి కొత్త జోష్‌ వచ్చింది.

బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ రెండో రోజు ఆదివారం నిర్వహించిన రోడ్‌షోకు మంచి స్పందన లభించింది. అభిమానులు, బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరిలివచ్చారు. మోదీపై పూలవర్షం కురిపించారు. ఈలలు, కేరింతలతో హోరెత్తించారు. మరోవైపు ఎన్నికలకు మూడు రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నికల సంఘం ఝలక్‌ ఇచ్చింది. ఆ పార్టీకి ఈసీ లీగల్‌ నోటీసులు పంపింది. కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ.. బీజేపీ అవినీతి రేటు…, ట్రబుల్‌ ఇంజన్‌… పేరుతో యాడ్స్‌ ఇచ్చింది. దీనిపై ఎన్నికల సంఘానికి రాష్ట్ర బీజేపీ నేతలు కంప్లయింట్‌ చేశారు.

రాహుల్ గాంధీ, డీకే శివకుమార్, సిద్ధరామయ్యకు ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు పంపింది. బీజేపీ అవినీతికి పాల్పడుతోందన్న ఆరోపణలపై కాంగ్రెస్ ప్రకటనలు ఇచ్చిందని, దీనిపై ఆధారాలు తమకు సమర్పించాలని డీకే శివకుమార్‌కు కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. ఈసీ తన నోటీసులో ప్రభుత్వ విధానాలను విమర్శించే హక్కు ఉందని, అయితే ప్రకటన అనేది సాధారణ ఆరోపణ కాదని పేర్కొంది. ప్రభుత్వ పాలనా యంత్రాంగాన్ని ప్రత్యేకంగా తప్పుపట్టారని, ఇది సజావుగా జరిగే ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుందని ఈసీ పేర్కొంది. అంత పెద్ద యాడ్ ఇచ్చారంటే కాంగ్రెస్ పార్టీ దగ్గర తప్పక రుజువు ఉండాలని, రుజువులను మే 7 సాయంత్రం 7 గంటల్లోగా ఈసీకి పంపాలని పేర్కొంది.

Exit mobile version