Govt Old Vehicles : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇటీవల వాహన కాలుష్యం భారీగా పెరిగిపోతుండడంతో చర్యలకు కేంద్రం ఉపక్రమించింది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు మోటారు వాహన చట్టంలో సవరణ నోటిఫికేషన్‌ను కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ జారీ చేసింది. దీని ప్రకారం 15 ఏళ్లు నిండిన ప్రభుత్వ వాహనాలు ఇకపై రోడ్లపై తిరగడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అలాంటి వాహనాల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.
రిజిస్ట్రేషన్ పునరుద్ధరించిన ప్రభుత్వ ఓల్డ్ వెహికల్స్ అన్నీ రద్దు కానున్నాయి. 15 ఏళ్లు నిండిన వాహనాలన్నీ రిజిస్టర్డ్ స్క్రాప్ కిందకు వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ వెహికల్స్, రాష్ట్రాల పరిధిలోని గవర్నమెంట్ వాహనాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వాడుతున్న ప్రభుత్వ వాహనాలు, రాష్ట్రాల రవాణా వాహనాలు, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ వాహనాలతోపాటు ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి సంస్థల కింద వాడుతున్న 15 ఏళ్లు నిండిన వెహికల్స్ అన్నింటినీ రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరించింది.
ఆర్మీ వాహనాలకు ఇందులో మినహాయింపు ఇచ్చింది కేంద్రం. ఈ నిర్ణయం ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తుందని కేంద్రం పేర్కొంది. అయితే, దీనిపై గతేడాది నవంబర్‌లోనే కేంద్ర ట్రాన్స్‌పోర్ట్ మినిస్ట్రీ ఓ ముసాయిదాను వెలువరించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 15 సంవత్సరాలు నిండిన వెహికల్స్‌ను రద్దు చేయాలని ఆ ముసాయిదాలో పేర్కొంది. దీనిపై నెల రోజుల్లోగా తగిన సూచనలు, లేదా అభ్యంతరాలు ఉంటే తెలపాలని సూచించింది.
2021లోనే నేషనల్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీ ప్రారంభం
ఇప్పటికే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయంపై ప్రకటన చేశారు. అలాంటి వాహనాలన్నింటినీ జంక్‌గా మారుస్తామని స్పష్టం చేశారు. దీనిపై రాష్ట్రాలతోనూ సంప్రదించినట్లు వెల్లడించారు. అన్ని రాష్ట్రాలూ ఈ విధానాన్ని అనుసరించాలని సూచించారు. ప్రధాన నగరాలకు 150 కిలోమీటర్లలోపే ఓ ఆటో మొబైల్ స్క్రాపింగ్ సెంటర్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు గడ్కరీ చెప్పారు. 2021లోనే నేషనల్ వెహికల్ స్క్రాపేజ్ పాలసీని ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది.
also read:
Kalyan Ram: బుల్లితెరపై కూడా రికార్డ్ బద్దలు గొట్టిన బింబిసార.. కళ్యాణ్ రామ్ రేంజ్ మారిందా..!