Afghanistan Women : అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు తమ అరాచకాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల దేశ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో మహిళల ప్రవేశాన్నినిషేధించారు. దీంతో అఫ్గాన్‌లో ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాలిబన్ సర్కార్ అరాచకాలు మితిమీరిపోతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. ఇక మహిళలు నేరుగా తాలిబన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు దిగుతున్నారు.
ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకున్న నాటి నుంచి తాలిబన్లు పాలనను భ్రష్టుపట్టించారు. మహిళలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇళ్లకే పరిమితం కావాలని హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత కొంత సడలింపు ఇస్తామని ప్రకటించినా అది తాత్కాలికమే అయ్యింది. తమ నిరంకుశత్వాన్ని కొనసాగిస్తూ.. మహిళల హక్కుల్ని కాలరాస్తున్నారు. అంతర్జాతీయంగా సమాజం అభ్యంతరాలు తెలిపినా తాలిబన్లలో మార్పు రావడం లేదు. వర్సిటీల్లోకి ప్రవేశాన్ని నిషేధించడంపై అక్కడి అమ్మాయిలు నిరసనకు దిగితే ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు.
వర్సిటీల దగ్గర భారీగా బలగాలను మోహరించి చెదరగొడుతున్నారు. ఈ నేపథ్యంలో కనీసం నిరన తెలపడానికి కూడా అవకాశం లేకపోవడంతో అక్కడి మహిళల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ఈ క్రమంలో 19 ఏళ్ల మార్వా అనే యువతి తన వర్సిటీ చదువును మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితులు నెలకొనడంపై తీవ్రంగా స్పందించింది. మహిళలపై నిషేధం విధించడం కంటే తల నరికేసినా బాగుండేదంటూ సంచలన కామెంట్స్ చేసింది.
కలలు కన్నీళ్లయ్యాయి..
నిషేధం కంటే మెరుగైనది శిరచ్చేదనం అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది మార్వా. అఫ్గాన్‌లో ఇంతటి దురదృష్టవంతులమైన నేపథ్యంలో అసలు పుట్టకుంటే బాగుండేదని వాపోయింది. భూమిపై పుట్టినందుకు బాధపడుతున్నానంటూ వ్యాఖ్యానించింది. పశువుల కన్నా హీనంగా చూస్తున్నారంటే ఆవేదన చెందింది. పుశువులు తమ మేత కోసం ఎక్కడికైనా వెళ్లగలవని.. మహిళలకు ఆ స్వేచ్ఛ కూడా లేకుండా చేయడం అత్యంత హేయమైన చర్యగా మార్వా అభివర్ణించింది. కాబూల్‌లోని మెడికల్ యూనివర్సిటీలో చేరేందుకు ఇటీవలే మార్వా పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించింది. సోదరుడు హమీద్‌తో కలిసి వర్సిటీకి వెళ్లాలని కలలు కనింది. ఈలోపే తాలిబన్ ప్రభుత్వ నిరంకుశ ఆదేశాలతో ఆమె కల చెదిరినట్లవుతోంది.
also read news:
Rewind 2022 : ఈ ఏడాది బాలీవుడ్ లో బోల్తా పడిన సినిమాల గురించి తెలుసుకోండి.