Telugu Flash News

Adani Group: సుప్రీం కోర్టుకు చేరిన అదానీ పంచాయితీ.. రేపు కీలక విచారణ!

Gautam Adani

Adani Group : దేశ వ్యాప్తంగా సంచలనం ప్రకంపనలు సృష్టిస్తున్న అదానీ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ నివేదిక అనంతరం అదానీ షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కావడంతో విపక్షాలన్నీ ఏకమయ్యాయి. ప్రధాని మోదీ సాయంతోనే అదానీ లక్షల కోట్లకు పడగలెత్తారని విపక్సాలు ఆరోపించాయి. రాజ్యసభ, లోక్‌ సభలో దీనిపై చర్చకు పట్టు పడుతున్నాయి.

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రసంగిస్తూ.. మోదీ, కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అనంతరం ప్రధాని మోదీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడారు. ఈ సందర్భంగా విపక్షాల దుమ్మ దులిపేశారు మోదీ. ఆరోపణలన్నీ కొట్టిపారేస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు. మరోవైపు అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని కొన్ని రోజులుగా పార్లమెంట్‌ను స్తంభింపజేస్తున్నాయి విపక్షాలు.

ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టుకు ఈ వివాదం చేరింది. అదానీ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశాలివ్వాలని కోరుతూ అత్యున్నత ధర్మాసనంలో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేయనుంది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదికపై దర్యాప్తు చేసేందుకు సుప్రీం మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో కమిటీని ఏర్పాటు చేసేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని న్యాయవాది విశాల్‌ తివారీ పిటిషన్‌ వేశారు. దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని సీజేఐ ధర్మాసనాన్ని కోరారు.

ఈ పిటిషన్‌ను స్వీకరించిన సుప్రీంకోర్టు.. ఫిబ్రవరి 10న విచారణ చేస్తామని స్పష్టం చేసింది. మరోవైపు అదానీ వ్యవహారంలో నివేదిక ఇచ్చిన అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ సంస్థ యజమాని నాథన్‌ అండర్సన్‌, అతడి అనుచరులపై దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ సీనియర్‌ న్యాయవాది ఎంఎల్‌శర్మ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కూడా రేపు సుప్రీం కోర్టు విచారణ చేయనుంది. అదానీ షేర్లలో అవకతవకలు చోటు చేసుకున్నాయని, భారీ మోసాలు జరుగుతున్నాయని హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

also read:

Prabhas : మిర్చి జ్ఞాపకాలు.. అనుష్క ప్రభాస్ ని నిజంగా ఎత్తుకుందా ?

ఆల్కహాల్‌ సేవిస్తున్నారా? లిక్కర్‌ అలర్జీ లక్షణాలు తెలుసా?

 

Exit mobile version