Telugu Flash News

Adani Group : ఎఫ్‌పీవో రద్దు చేసుకున్న అదానీ గ్రూప్‌.. 20వేల కోట్లు ప్రాజెక్టుపై వెనక్కి!

Adani

ప్రపంచంలోనే టాప్‌ టెన్‌లో ఒకడిగా కొనసాగిన అపర కుబేరుడు గౌతమ్‌ అదానీ (Adani) వ్యాపార సామ్రాజ్యంపై హిండెన్‌బర్గ్‌ నివేదిక ఎఫెక్ట్‌ భారీగానే చూపిస్తోంది. లక్షల కోట్ల సంపద ఆవిరి కావడంతో పాటు అదానీ ప్రపంచ కుబేరుల లిస్ట్‌లో కూడా ర్యాంకు దిగజారుతోంది. తాజాగా అదానీ గ్రూప్‌ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.20 వేల కోట్ల విలువైన షేర్లు ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ (FPO)ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

హిండెన్‌బర్గ్‌ నివేదిక ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో అదానీ గ్రూప్‌ తీసుకున్న తాజా నిర్ణయం కలకలం రేపుతోంది. ఫిబ్రవరి 1న భేటీ అయిన అదానీ గ్రూప్‌ కంపెనీ డైరెక్టర్లు.. చందాదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రూ.20 వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల ఎఫ్‌పీవోను కొనసాగించొద్దని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కంపెనీ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ప్రకటన చేశారు. అదానీ గ్రూప్‌ పన్ను ట్యాక్స్‌ హెవెన్స్‌ను ఉపయోగిస్తోందంటూ అమెరికన్‌ సెల్లర్‌ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.

ఇటీవల అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ రూపొందించిన నివేదిక ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ‘హౌ ది వరల్డ్స్‌ థర్డ్‌ రిచ్చెస్ట్‌ మ్యాన్‌ ఈజ్‌ పుల్లింగ్‌ ది లార్జెస్ట్‌ కాన్‌ ఇన్‌ కార్పొరేట్‌ హిస్టరీ’ అనే హెడ్డింగ్‌తో తన నివేదికను బహిర్గతం చేసింది హిండెన్‌బర్గ్‌. అదానీ గ్రూప్‌ అకౌంటింగ్‌, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ పద్ధతులను ప్రశ్నిస్తూ సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే భారత్‌లో అదానీ షేర్ల విలువ భారీగా పతనమైంది. ఇన్వెస్టర్లు లబోదిబోమన్నారు.

ఇంత కాలం స్టాక్‌ మార్కెట్‌ను శాసిస్తూ వచ్చిన అదానీ గ్రూప్‌ ఇప్పుడు.. స్టాక్‌ అన్నీ ఒక్కసారిగా దిగొస్తుండడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. గత వారం అదానీ స్టాక్స్‌ తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాయి. అయితే, హిండెన్‌బర్గ్‌ నివేదికను, ఆరోపణలను అదానీ గ్రూప్‌ తీవ్రంగా ఖండించింది. అదానీ గ్రూప్‌ను దెబ్బతీసేందుకు హిండెన్‌బర్గ్‌ దురుద్దేశాలు ఆపాదిస్తోందని కౌంటర్‌ ఇచ్చింది. ఇందులో భాగంగానే 413 పేజీల వివరణాత్మక రిప్లై ఇచ్చింది అదానీ గ్రూప్‌. అయితే, దీనిపై కూడా హిండెన్‌బర్గ్‌ మరోసారి విరుచుకుపడింది. దేశభక్తి మాటున అక్రమాలు దాచలేరంటూ ఫైర్‌ అయ్యింది హిండెన్‌బర్గ్‌.

also read :

Hanuma Vihari : లెఫ్ట్‌ హ్యాండర్‌గా మారిన హనుమ విహారి.. గాయం కారణంగా ఒంటిచేత్తోనే పోరాటం

Kiara Advani: మ‌హేష్ హీరోయిన్ కూడా పెళ్లి పీట‌లెక్క‌బోతుందోచ్.. వెన్యూ ఎక్క‌డంటే..!

Exit mobile version