HomeinternationalBolivia : బొలీవియాలో సైనిక కుట్రకు విఫలయత్నం!

Bolivia : బొలీవియాలో సైనిక కుట్రకు విఫలయత్నం!

Telugu Flash News

దేశంలో సైనిక కుట్రను భగ్నం చేశామని బొలీవియా (Bolivia) అధ్యక్షుడు లూయిస్ ఆరెస్ బుధవారం ప్రకటించారు.దేశ ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. బుధవారం మధ్యాహ్నం లాపాజ్లో సైనిక జనరల్ జువాన్ జునిగా ఆదేశాల మేరకు వందలాదిమంది మిలటరీ సిబ్బంది ప్రభుత్వ భవనాన్ని చుట్టుముట్టారు. మంత్రిత్వస్థాయి సమావేశం జరగడానికి ముందుగా, వారు భవనం ప్రధాన ద్వారాన్ని ట్యాంక్లతో బద్దలు కొట్టి, లోపలకు బలవంతగా ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వం భగ్నం చేసింది. సైనిక సిబ్బందిని జైలుకు తరలిస్తామని జునిగా ప్రకటించారు.

2019లో అప్పటి అధ్యక్షుడు ఎవో మొరేల్స్కు వ్యతిరేకంగా పన్నిన కుట్రలో ప్రమేయం వున్న, రాజకీయ ఖైదీలు జెనిన్ అనెజ్, లూయిస్ ఫెర్నాండోలను విడుదల చేస్తామని ప్రకటించారు. సైన్యం భవనం లోపలకు చొచ్చుకుపోవడానికి ప్రయత్నిస్తుండగానే వందలాదిమంది ప్రజలు వెంటనే గుమిగూడారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని డిమాండ్ చేశారు. ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, సాధారణ పౌరులు అందరూ కలిసి నిరసనలు తెలియజేశారు. వారిపై సైనికాధికారులు అణచివేత చర్యలకు పాల్పడ్డారు. పోలీసులు విచక్షణారహితంగా బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. ప్లాజా మురిల్లోకు వెళ్లే దారిని మూసివేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు ఎవో మొరేల్స్ అప్రమత్తమయ్యారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఏకతాటిపైకి రావాల్సిందిగా బొలీవియా ప్రజలకు పిలుపునిచ్చారు. బొలీవియా విదేశాంగ మంత్రి సెలిండా సోసా వీడియో సందేశమిస్తూ, ప్రజాస్వామ్యం, శాంతి, భద్రతలపై దాడి చేసేందుకు బొలీవియా సైన్యంలోని కొన్ని విభాగాలను అక్రమంగా సమీకరించిన కొన్ని దేశాల చర్యలను తీవ్రంగా నిరసించారు. ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా అంతర్జాతీయ సమాజాన్ని, దేశ ప్రజలను కోరారు.

20లక్షల మందికి పైగా కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న బొలీవియా వర్కర్స్ సెంట్రల్ (సిఓబి) వెంటనే నిరవధిక సమ్మెను ప్రకటించింది. రాజ్యాంగ వ్యవస్థను పునరుద్దరించాలని, బొలీవియాలో చట్టబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వం వుండాలని డిమాండ్ చేసింది. భవనాన్ని సైన్యం చుట్టుముట్టిన దాదాపు గంట తర్వాత అధ్యక్షుడు లూయిస్ అరెస్ కొత్త మిలటరీ కమాండర్గా జునిగా స్థానంలో జోస్ సాంచెజ్ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే బాధ్యతలు తీసుకున్న సాంచెజ్ సైన్యాన్ని వారి వారి యూనిట్లకు వెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. చట్టబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన లూయిస్ అరెస్ ప్రభుత్వానికి మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.

కుట్రకు విఫలయత్నం జరిగిన నేపథ్యంలో దేశంలో రాజకీయ పరిస్థితులను చక్కగా దిద్దుకొనగల సామర్ధ్యం అధ్యక్షుడు లూయిస్ అరెస్కు వుందని చైనా విశ్వసిస్తోందని గురువారం చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ చెప్పారు. బొలీవియాలో అసాధారణ సైనిక చర్య వార్తలను బీజింగ్ పరిశీలిస్తోందని చెప్పారు. బొలీవియాకు మంచి మిత్రదేశంగా, భాగస్వామిగా ఈ పరిస్థితులను నుండి బొలీవియా బయటపడగలదని ఆశిస్తున్నట్లు చెప్పారు. బొలీవియా ప్రజల ప్రాథమిక, దీర్ఘకాల ప్రయోజనాలకు అనుగుణంగానే ప్రభుత్వం సామర్ధ్యం వుంటుందని తెలిపారు.

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News