Ramiz Raja: రాజకీయ పరంగానే కాదు క్రికెట్ పరంగాను భారత్- పాకిస్తాన్ మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఏడాది జరగనున్న ఆసియా కప్ విషయంలో భారత్ – పాక్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పాక్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో ఆడేందుకు టీమిండియా విముఖత చూపిస్తుండగా, దాయాది దేశం భారత్ తమ దేశంలో వచ్చి ఆడకుంటే.. తాము కూడా ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్‌నకు దూరంగా ఉంటామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రజా ఇప్పటికే తేల్చి చెప్పారు. అయితే భారత్ మాత్రం ఆసియా కప్‌ను తటస్థ వేదికలో జరిపించేందుకు పావులు కదుపుతుంది.
ఆసియా కప్ ఆతిథ్యం పాక్ నుంచి మరోక చోటుకు మారుస్తారనే వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో పీసీబీ చైర్మన్ రమీజ్ రజా స్పందించారు. “మాకు ఆతిథ్య హక్కులు ఇవ్వమని మేము కోరుకోవడం లేదు. ఆ హక్కులను మాకు మేము పారదర్శకంగా తెచ్చుకున్నాం. భారత్ రాకపోతే అది వారి ఇష్టం. అందుకోసం పాక్ నుంచి వేదికను మరోక చోటుకు మారిస్తే మాత్రం ఆసియా కప్ నుంచి మేమే వైదొలుగుతాం” అంటూ రమీజ్ రజా కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్.. ఆసియా కప్ కోసం వచ్చి ఆడితేనే.. ఇండియాలో జరగనున్న వరల్డ్ కప్‌లో మేము ఆడతాం. ఒకవేళ రాకుంటే.. పాకిస్థాన్ లేకుండా 2023 ప్రపంచకప్ జరుగుతుంది. మేము చూస్తాం పాక్ లేకుండా ఎవరెవరు ఆడతారో
మా జట్టు గత రెండేళ్లుగా మంచి ప్రదర్శన చేస్తోంది. క్రికెట్ మార్కెట్ అత్యధిక వ్యాపారం చేస్తోన్న జట్టును ఏడాది వ్యవధిలో రెండుసార్లు ఓడించాం అంటూ ఆస్తికర వ్యాఖ్యలు చేశారు రమీజ్ రాజా. పాక్ చివరగా 2009 ఆసియా కప్‌ను హోస్ట్ చేయగా, అప్పుడు లాహోర్‌లోని గడాఫీ స్టేడియానికి సమీపంలో శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్రదాడి జరగడంతో అప్పటి నుంచి ఆ దేశంలో ఇతర జట్లు పర్యటించడానికి ఆలోచిస్తున్నాయి. అయితే 2017లో శ్రీలంక జట్టు వన్డే సిరీస్ ఆడగా, ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా కూడా పర్యటించింది.